బెజవాడను భయపెడుతున్న కృష్ణమ్మ

10TV Telugu News

ALERT Krishna water levels rise : కష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. బెజవాడను భయపెడుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం బ్యారేజీకి 7 లక్షల 65 వేలకు పైగా క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు.ప్రకాశం బ్యారేజీకి మరింత ఇన్‌ఫ్లో పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత మున్న ఏడున్నర లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో … 9 లక్షలకు చేరవచ్చని హెచ్చరిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వరద అంతకంతకూ పోటెత్తుతుండడం.. లంక గ్రామాలను వణికిస్తోంది. లంక గ్రామాలతోపాటు పల్లపు ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.దీంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లంక గ్రామాల ప్రజలతోపాటు.. పల్లపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 1736 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించినట్టు అధికారులు చెబుతున్నారు.ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు భారీ వరద వస్తోంది. అది అంతకంతకూ పెరుగుతోంది. జూరాల దగ్గర ప్రస్తుతం 5 లక్షల 20వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దీంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. జూరాల పూర్తి స్థాయి నీటి సామర్థ్యం… 9.657 టీఎంసీలు అయితే… ప్రస్తుతం నీటి ప్రవాహం 4.225 టీఎంసీలకు చేరింది. దీంతో ఎగువ నుంచి ప్రాజెక్టులోకి వస్తోన్న నీటిని దిగువకు వదులున్నారు. 52 గేట్లు ఎత్తి…. దిగువకు 5 లక్షల 29వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.మరోవైపు…జూరాల నుంచి నీటిని వదలడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. శ్రీశైలం డ్యామ్‌కు భారీగా వరద వచ్చి చేరుతోంది. 5 లక్షల 62వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. గంటగంటకూ వరద పెరుగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 885 అడుగులు ఉండగా… ప్రస్తుతం నీటిమట్టం 884 అడుగులకు చేరింది. దీంతో 5 లక్షల 94వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

×