AP Municipal Elections 2021 : రాజధాని సెంటిమెంట్ ను పట్టించుకోని అమరావతి ఓటర్లు

రాజధాని తరలింపు, విశాఖ ఉక్కు ఉద్యమం...ఏపీ మున్సిపల్, కార్పొరేషన్‌ ఎన్నికలకు ముందు అందరి చర్చా ఈ రెండు అంశాల మీదే సాగింది. పుర ఫలితాలను ఈ రెండు అంశాలు తీవ్రస్థాయిలో ప్రభావం చూపబోతున్నాయన్న విశ్లేషణలు వినిపించాయి.

AP Municipal Elections 2021 : రాజధాని సెంటిమెంట్ ను పట్టించుకోని అమరావతి ఓటర్లు

Guntur

Amravati voters : రాజధాని తరలింపు, విశాఖ ఉక్కు ఉద్యమం…ఏపీ మున్సిపల్, కార్పొరేషన్‌ ఎన్నికలకు ముందు అందరి చర్చా ఈ రెండు అంశాల మీదే సాగింది. పుర ఫలితాలను ఈ రెండు అంశాలు తీవ్రస్థాయిలో ప్రభావం చూపబోతున్నాయన్న విశ్లేషణలు వినిపించాయి. పంచాయతీ ఎన్నికల్లో వైసీసీ హవా సాగినప్పటికీ…పట్టణాలు, నగరాల్లో అధికార పార్టీకి భంగపాటు తప్పదని టీడీపీ , బీజేపీ-జనసేన కలలు కన్నాయి. కానీ ఫలితాల తీరు గమనిస్తే..మూడు రాజధానుల ప్రకటన, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఓటర్లను ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయాయని స్పష్టమైంది.

అమరావతి నుంచి రాజధాని తరలింపు ప్రకటన తర్వాత ఉవ్వెత్తున ఉద్యమం సాగిన గుంటూరు జిల్లాలోనూ అనూహ్యంగా వైసీపీ తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించింది. గుంటూరు కార్పొరేషన్‌తో పాటు మున్సిపాలిటీల్లో ఓటర్లు వైసీపీ వెంటే నిలిచారు. విశాఖ జిల్లాలోని మున్సిపాలిటీల్లోనూ వైసీపీ విజయదుందుభి మోగించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను స్థానిక ప్రజలంతా వ్యతిరేకిస్తున్నప్పటికీ…ఆ నిర్ణయంలో అధికార వైసీపీ పాత్ర ఏమీ లేదని వారు నమ్మినట్టు ఈ ఫలితాలు స్పష్టంగా నిరూపిస్తున్నాయి.

ఎన్నిక ఏదైనా.. ప్రాంతం ఎక్కడైనా.. ఫలితం మాదే అన్నట్లుగా ఉంది వైసీపీ పరిస్థితి. అధికార పార్టీ దూకుడు ముందు ప్రతిపక్షాలు ఎక్కడా పోటీ ఇవ్వలేకపోతున్నాయి. కొన్ని చోట్లకు మాత్రమే టీడీపీ పరిమితం అవ్వగా.. నాలుగైదు సీట్లకు జనసేన -బీజేపీ కూటమి పరిమితం అవుతోంది. మరికొన్ని చోట్ల కాంగ్రెస్, కమ్యూనిస్టులు సింగిల్ డిజిట్‌ స్ధానాలు కైవసం చేసుకుంటున్నాయి. ఏపీలో ఈ నెల 10న జరిగిన మున్సిపల్‌ ఎన్నికలు జరిగాయి.. 2021, మార్చి 14వ తేదీ ఆదివారం ఉదయం లెక్కింపు ప్రారంభం కాగా తాజా ఫలితాలు వెలువడే సరికి… వైసీపీ ప్రభంజనం కొనసాగుతోంది.