AP Budget Ordinance : 3 నెలలకు రూ.90వేల కోట్లు.. కీలక ఆర్డినెన్స్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం

ఏపీ ప్రభుత్వం తెచ్చిన కీలక బడ్జెట్ ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. శుక్రవారం(మార్చి 26,2021) ఉదయం బడ్జెట్ ఆర్డినెన్సును ఆన్‌లైన్‌లో మంత్రులు ఆమోదం తెలిపారు.

AP Budget Ordinance : 3 నెలలకు రూ.90వేల కోట్లు.. కీలక ఆర్డినెన్స్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం

Cm Jagan

Ap Budget Ordinance : ఏపీ ప్రభుత్వం తెచ్చిన కీలక బడ్జెట్ ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. శుక్రవారం(మార్చి 26,2021) ఉదయం బడ్జెట్ ఆర్డినెన్సును ఆన్‌లైన్‌లో మంత్రులు ఆమోదం తెలిపారు. మూడు నెలల కాలానికి ఏపీ బడ్జెట్ ఆర్డినెన్స్‌ను రూపొందించారు. రూ.80వేల కోట్ల నుంచి రూ.90వేల కోట్ల వరకు మూడు నెలల బడ్జెట్ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, నవరత్న పథకాల అమలుకు ఈ నిధులు వినియోగిస్తారు. వరుసగా రెండో ఏడాది ఆర్డినెన్స్ రూపంలో బడ్జెట్‌ను రూపొందించారు. ఏప్రిల్ లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రభుత్వం ఆమోదించనుంది.

వాస్తవానికి మార్చిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించి.. బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఆమోదించాల్సి ఉంది. మార్చి మూడో వారం, నెలాఖరులో సెషన్ నిర్వహించాలని భావించారు. కానీ వరుసగా ఎన్నికలు రావడం, కరోనా కేసులు పెరగడం, తిరుపతి లోక్‌సభకు ఉప ఎన్నిక ఉండటంతోనే ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఆ ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం గవర్నర్‌కు పంపిస్తారు. ఆయన ఆమోదం తర్వాత ఆర్డినెన్స్ అమల్లోకి వస్తుంది. గతేడాది(2020) కూడా కరోనా కారణంగా బడ్జెట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఈ ఏడాది కూడా మళ్లీ అదే రిపీట్ అయ్యింది.

కాగా, ఆర్డినెన్స్ రూపంలో బడ్జెట్ పెట్టడంపై టీడీపీ తప్పుపట్టింది. రెండోసారి కూడా రాష్ట్ర బడ్జెట్‌పై ఆర్డినెన్స్ ఇవ్వడాన్ని వ్యతిరేకించింది. ఇది పూర్తిగా పలాయనవాదం, దివాలాకోరుతనమని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రజలన్నా, ప్రతిపక్షాలన్నా, చట్టసభలన్నా ప్రభుత్వానికి లెక్కలేకుండా పోయిందని మండిపడ్డారు. బడ్జెట్ కూడా ఆర్డినెన్స్‌ల రూపంతో ఆమోదం పొందే దుష్ట సాంప్రదాయాన్ని సీఎం జగన్ తెచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఈవిధంగా ఏవో కుంటిసాకులు, దొంగవంకలు చూపి బడ్జెట్ వాయిదా వేసిన దాఖలాలు లేవన్నారు.

గతంలో ఇలాగే మొక్కుబడి బడ్జెట్ తేవాలని సీఎం జగన్ చూస్తే, మూడు రాజధానుల బిల్లుతో పాటు శాసనమండలి వ్యతిరేకించిందని యనమల గుర్తుచేశారు. అప్పుడు కూడా ఇలాగే ఆర్డినెన్స్ తెచ్చి ‘‘మమ’’ అనిపించుకున్నారన్నారు. పార్లమెంటు ఉప ఎన్నికలు ఉన్నప్పటికీ, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నా, ఎక్కడా బడ్జెట్‌పై కేంద్రంగాని, రాష్ట్ర ప్రభుత్వాలు గాని ఆర్డినెన్స్‌లు ఇవ్వలేదని చెప్పారు. ఏపీలో మాత్రమే తిరుపతి ఉప ఎన్నిక వంకతో, మిగిలిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సాకుతో బడ్జెట్ సమావేశాలు పెట్టకుండా వాయిదాలు వేయడం పలాయనవాదమని అన్నారు. ఇదే పరిస్థితులు కేంద్రంలో ఉన్నా నరేంద్ర మోదీ ప్రభుత్వం సకాలంలో పార్లమెంటు సమావేశాలు పెట్టి బడ్జెట్ ఆమోదించిందని యనమల రామకృష్ణుడు అన్నారు.