ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం, 25 కాదు 26 జిల్లాలు

  • Published By: naveen ,Published On : July 15, 2020 / 02:30 PM IST
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం, 25 కాదు 26 జిల్లాలు

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏపీలో 25 నుంచి 26 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సీఎస్ ఆధ్వర్యంతో కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయన కమిటీ వేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకోగా, జిల్లాల ఏర్పాటులో రాజకీయ నేతల ప్రమేయం లేకుండా అధికారులకే పూర్తి బాధ్యతలు అప్పగించనున్నారు. 2021 మార్చి 31వ తేదీ లోగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించగా, పార్లమెంటు నియోజకవర్గాలు సరిహద్దులుగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా వచ్చే ఏడాది ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు ఖావడం ఖాయంగా కనిపిస్తోంది. బుధవారం(జూలై 15,2020) సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. సుమారు 2 గంటల పాటు జరిగిన ఈ భేటీలో 22 అంశాలపై మంత్రివర్గం చర్చించింది.

25 కాదు 26 జిల్లాలు:
25 జిల్లాలతో పాటూ అదనంగా అరకును ప్రత్యేక జిల్లాగా చేసే అంశంపై మంత్రివర్గంలో ప్రస్తావన వచ్చింది. ఇక కొత్తగా ఏర్పాటు కానున్న అరకు జిల్లా భౌగోళికంగా ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉందని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు. 4 జిల్లాలకు అరకు జిల్లా ప్రాంతం విస్తరించి ఉందని కొందరు సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో అరకును రెండు జిల్లాలు చేసేందుకు అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామని సీఎం అన్నారు.

27 జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు:
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా చేస్తామని ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయడంపై సీఎం ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇప్పుడున్న 13 జిల్లాలకు అదనంగా 12 కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే కొంత కసరత్తులు చేపట్టిన ప్రభుత్వానికి.. జిల్లాల నుంచి ప్రతిపాదనలు పలు ప్రతిపాదనలు వచ్చాయి. అయితే ప్రభుత్వం అనుకున్న దాని కంటే రెండు జిల్లాలు అదనంగా వస్తున్నట్లు సమాచారం. 2 గిరిజన జిల్లాల ఏర్పాటుకు డిమాండ్లు వినిపిస్తున్నాయి. దాంతో మొత్తం ప్రతిపాదిత జిల్లాల సంఖ్య 27కి పెరిగింది.

వైఎస్ఆర్ చేయూత పథకంపైనా చర్చ:
జిల్లాల ఏర్పాటుతో పాటు కీలక అంశాలపైనా కేబినెట్ లో చర్చించారు. శాండ్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఓకే చెప్పింది. ఈ కార్పొరేషన్ ప్రతినిధులుగా పలువురు మంత్రులు ఉంటారు. ఆర్థిక మంత్రితో పాటూ మరో ఇద్దరు నుంచి ముగ్గురు మంత్రులు ఉండే అవకాశం ఉంది. వైఎస్సార్ చేయూత పథకంపై కూడా మంత్రివర్గం సమావేశంలో చర్చించారు.

ఏపీ కేబినెట్ నిర్ణయాలు:
* ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
* 25 నుంచి 26 జిల్లాలు ఏర్పాటు
* జిల్లాల ఏర్పాటుపై అధ్యయన కమిటీ ఏర్పాటుకు ఆమోదం
* సీఎస్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు
* 2021 మార్చి 31వ తేదీలోగా జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయం
* పార్లమెంటు నియోజకవర్గం సరిహద్దుగా కొత్త జిల్లాల ఏర్పాటు
* కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ రద్దు కోసం ఉద్యోగులు చేసిన ఆందోళనలో నమోదైన కేసులు ఎత్తివేత
* నాడు-నేడు కార్యక్రమం కింద పాఠశాలలను తీర్చిదిద్దుతున్నాం
* 44వేల 509 స్కూళ్లను మార్పు చేస్తున్నాం
* వైఎస్సార్ చేయూత పథకంపైనా చర్చ

* గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు పరిశీలనలో ఉన్న ముగ్గురి పేర్లను నిర్ణయించిన కేబినెట్
* ప.గో. జిల్లా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్ రాజు
* కడప జిల్లా రాయచోటికి చెందిన దివంగత నేత అఫ్జల్ సతీమణి మైనా జాకియా
* గుంటూరు జిల్లాకు చెందిన మర్రి రాజశేఖర్ పేర్లు దాదాపు ఖరారు