Payyavula Keshav : ప్రజల కొంప ముంచుతున్న ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు : పయ్యావుల కేశవ్
ప్రభుత్వ పెద్దలు, అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టి విచారించాలన్నారు. ఇప్పటివరకు సామాన్యులపై రూ.30 కోట్ల అదనపు భారాన్ని మోపిందని విమర్శించారు.

Payyavula Keshav
TDP MLA Payyavula Keshav : ఏపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వ పెద్దల అనాలోచిత నిర్ణయాలు ప్రజల కొంప ముంచుతున్నాయని విమర్శించారు. విద్యుత్ కోతలు, ప్రజలపై ఛార్జీల వాతలు పడడానికి ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు. విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఉన్న ఏపీని విద్యుత్ కొరత ఉన్న రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. ఈ మేరకు అమరావతిలో పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడారు.
ప్రస్తుతం ఏపీ 7 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరతలో ఉందన్నారు. పీపీఏలను పక్కన పెట్టడం వల్ల ప్రజలు ఒక్కో యూనిట్ కు రెండుసార్లు ఛార్జీలు చెల్లించాల్సి వస్తోందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఓపెన్ మార్కెట్ ద్వారా రూ. 12 వేల కోట్ల విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చిందన్నారు.విద్యుత్ రంగంలో దారుణమైన తప్పిదాలకు, అవకతవకలకు తెర లేపిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పెద్దలు, అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టి విచారించాలన్నారు. ఇప్పటివరకు సామాన్యులపై రూ.30 కోట్ల అదనపు భారాన్ని మోపిందని విమర్శించారు. డిస్కంలకు ఉన్న ఆర్థిక పరిపుష్టిని ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. డిస్కంలు ఆర్థిక పరిపుష్టిగా లేనప్పుడు.. అధిక ధరలతో స్మార్ట్ మీటర్లు బిగించడం అవసరమా అని ప్రశ్నించారు.
కేంద్రం చేసిన సూచనల కంటే అధిక ధరలకు స్మార్ట్ మీటర్లు కొనుగోలు చేయడం దేనికని నిలదీశారు.
ఓపెన్ మార్కెట్ లో విద్యుత్ కొనుగోళ్లు, స్మార్ట్ మీటర్ల కొనుగోళ్లల్లో ప్రభుత్వ పెద్దలకు లబ్ధి చేకూరిందని ఆరోపణలు చేశారుు. ఎల్ సీ ఓపెన్ చేస్తే తప్ప బొగ్గు సరఫరా చేయమని స్పష్టంగా చెప్పేస్తున్నారని పేర్కొన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు అప్పు పుడుతుంది కానీ, ఏపీ ప్రభుత్వానికి మాత్రం అప్పు పుట్టడం లేదన్నారు.