AP Graduate MLC Election Result : ఉత్తరాంధ్ర టు రాయలసీమ సైకిల్ జోరు.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ హవా
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటింది. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి ఆధిక్యం లభించింది. టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విజయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఆయనకు వెయ్యి పైచిలుకు ఓట్ల మెజారిటీ వచ్చినట్లు సమాచారం అందుతోంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 47మంది అభ్యర్థుల ఎలిమినేషన్ పూర్తి అయ్యింది.

AP Graduate MLC Election Result : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటింది. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి ఆధిక్యం లభించింది. టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విజయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఆయనకు వెయ్యి పైచిలుకు ఓట్ల మెజారిటీ వచ్చినట్లు సమాచారం అందుతోంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 47మంది అభ్యర్థుల ఎలిమినేషన్ పూర్తి అయ్యింది.
తుదివరకు వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రా రెడ్డి, భూమిరెడ్డి మధ్య ఉత్కంఠపోరు నడిచింది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ మెజారిటీ రాకపోవడంతో ద్వితీయ శ్రేణి ఓట్లు లెక్కింపు చేపట్టారు. ఇందులో మెజారిటీతో భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను క్లీన్ స్వీప్ దిశగా తెలుగుదేశం పార్టీ దూసుకుపోతోంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల స్థానాల్లో విజయం సాధించిన టీడీపీ.. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానంలోనూ ఆధిక్యంలోకి వచ్చింది. ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తుండగా, టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి వెయ్యికి పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
అయితే, ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని, రీకౌంటింగ్ చేపట్టాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి నేలపై కూర్చుని నిరసన తెలిపారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఓట్ల బండిల్ లో ఏదో గందరగోళం జరిగిందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కౌంటింగ్ లో అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలతో ఏదో మారిపోయిందని అనుకోవద్దని టీడీపీని ఉద్దేశించి అన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో వచ్చిన ఓట్లన్నీ టీడీపీవి కావని.. పీడీఎఫ్, వామపక్ష పార్టీల ఓట్లు టీడీపీకి వెళ్లాయని సజ్జల విశ్లేషించారు.
టీడీపీ బలం పెరిగిందనడం హాస్యాస్పదం అన్నారు. ఈ ఫలితాలు ఏ రకంగానూ ప్రభావం చూపబోవన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం అని తాము భావించలేమని సజ్జల స్పష్టం చేశారు. ఇక్కడ ఓట్లు వేసింది సమాజంలో ఓ చిన్న భాగం మాత్రమేనని సజ్జల వివరించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు వైసీపీని ఆదరించారన్న విషయాన్ని గమనించాలన్నారు. తొలిసారి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం వైసీపీకి పెద్ద విజయం అని అభివర్ణించారు.