AP PRC : పీఆర్సీపై చర్చలు సఫలం.. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ఆందోళన విరమణ

పీఆర్సీపై ఏపీ ఉద్యోగ సంఘాల నిరసనలకు తెరపడింది. ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. పీఆర్సీపై ఉద్యోగ సంఘాల నేతలతో..

AP PRC : పీఆర్సీపై చర్చలు సఫలం.. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ఆందోళన విరమణ

Ap Prc

AP PRC : పీఆర్సీపై ఏపీ ఉద్యోగ సంఘాల నిరసనలకు తెరపడింది. ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. పీఆర్సీపై ఉద్యోగ సంఘాల నేతలతో (ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నాయకులు) రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, సీఎస్ సమీర్ శర్మ జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ఉద్యోగ సంఘాల 71 డిమాండ్లను పరిశీలిస్తామని మంత్రి బుగ్గన హామీ ఇచ్చారు. దీంతో తమ ఆందోళనను తాత్కాలికంగా విరమించేందుకు ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నాయకులు అంగీకరించారు. వచ్చే బుధవారం మరోసారి సీఎస్ తో సమావేశం ఉంటుందని మంత్రి తెలిపారు.

సచివాలయ ఉద్యోగుల అంశాలు 11, ప్రభుత్వం ఉద్యోగుల అంశాలు 85 పరిశీలిస్తామని మంత్రి బుగ్గన, సీఎస్ సమీర్ శర్మ హామీ ఇచ్చారని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి అన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ పిరియడ్ పూర్తయినందున రెగ్యులర్ చేయమని కోరామని, అందుకు అంగీకారం తెలిపారని చెప్పారు. వీఏవో, వీఆర్ఓలకు పదోన్నతి కల్పించాలని, వారికి రెగ్యులర్ స్కేల్ ఇవ్వమని కోరామని, దానికి మంత్రి అంగీకారం తెలిపారని చెప్పారు.

WhatsApp Group Admins : వాట్సాప్ గ్రూపు అడ్మిన్లకు న్యూ పవర్..? అందరి మెసేజ్‌లు డిలీట్ చేయొచ్చు!

”ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాము. ఏపీ సచివాలయానికి సంబంధించి 11 అంశాలు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన 85 అంశాలు పరిష్కారించాలని కోరాం. సచివాలయంలో అదనపు పోస్టులను భర్తీ చేయాలని కోరాం. కోర్టు కేసులు ఎక్కువ అవవుతున్నందున అదనపు పని భారం పెరిగింది. అసెంబ్లీ ఉద్యోగులకు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం దృష్టికి తెచ్చాం. జిల్లాల్లో ఉద్యోగులకు స్థానికంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరాం. వీఆర్వోలకు పదోన్నతులు ఇచ్చినా గ్రేడ్ 2 స్కేల్ ఇస్తున్నారు” అని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి చెప్పారు.

ఏపీ ఉద్యోగ సంఘాల నేతలతో పెండింగ్ అంశాలపై చర్చలు జరిపినట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఇరు జేఏసీల నేతలతో మాట్లాడినట్లు తెలిపారు. చాలా రోజులుగా వారు ఇచ్చిన విజ్ఞప్తులను తీసుకున్నామని.. కొవిడ్ సహా వివిధ అంశాల వల్ల ఈ అంశాల పరిష్కారం ఆలస్యం అయిందన్నారు. ప్రభుత్వం అనేది ఓ కుటుంబం, ఉద్యోగులు కూడా అందులో భాగమని మంత్రి స్పష్టం చేశారు.

త్వరలోనే ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. టైమ్ బౌండ్ పెట్టుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఉద్యోగుల సమస్యలపై ఎప్పటికప్పుడు సమావేశాలు పెట్టుకుని పరిష్కరిస్తామన్నారు. ఉద్యోగులు లేవనెత్తిన ప్రతి సమస్యనూ పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి చెప్పారు. ఉద్యోగుల సమస్యలపై వివిధ శాఖల అధికారులతో సీఎస్ బుధవారం సమావేశం అవుతారని మంత్రి తెలిపారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కంటిన్యూగా టచ్ లో ఉంటామన్నారు. ఉద్యమంలో ఉన్న తొమ్మిది సంఘాలను ఆందోళన విరమించాలని కోరామన్నారు.

”బుధవారం సీఎస్ సమీర్‌శర్మతో కూడిన కార్యదర్శుల కమిటీ ఉద్యోగుల సమస్యలపై నిర్ణయం తీసుకుంటుంది. నేనే స్వయంగా పర్యవేక్షిస్తా. ఉద్యోగుల డిమాండ్లపై 9 సంఘాలు ఉద్యమం చేస్తున్నాయి. వారిని విరమించాలని ప్రభుత్వం తరఫున కోరుతున్నా. డిమాండ్లను పరిష్కరిస్తామని వారికి హామీ ఇస్తున్నా” అని మంత్రి బుగ్గన అన్నారు.

Omicron Variant vs Delta: డెల్టా కంటే ఒమిక్రాన్ ప్రమాదమా? రెండు వేరియంట్లలో ఏయే లక్షణాలు ఉన్నాయంటే..?

ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల నేతలతో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వేర్వేరుగా చర్చలు జరిపింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. పీఆర్‌సీ సహా ఉద్యోగ సంఘాలు ప్రతిపాదించిన 71 అంశాలపై భేటీలో ప్రధానంగా చర్చించారు.

దురుద్దేశంతో ఉద్యమానికి వెళ్లలేదని, సమస్యల పరిష్కారం కోసమే ఉద్యమించామని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు అన్నారు. ఆర్ధికేతర సమస్యలు కూడా చాలా కాలం పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. తమ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారని, బుధవారం స్వయంగా సీఎస్ సమీర్ శర్మ సమీక్షించనున్నారని బొప్పరాజు చెప్పారు. ప్రభుత్వ సానుకూల స్పందనతో తాత్కాలికంగా ఉద్యమాన్ని వాయిదా వేస్తున్నామని బొప్పరాజు ప్రకటించారు.