Balineni Srinivasa Reddy: ఒంగోలు చేరుకున్న బాలినేని.. మీడియా సమావేశంపై ఉత్కంఠ.. ఏం చెబుతారో?

అందుకే ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో అడుగుపెట్టినట్టు సమాచారం. బాలినేని నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

Balineni Srinivasa Reddy: ఒంగోలు చేరుకున్న బాలినేని.. మీడియా సమావేశంపై ఉత్కంఠ.. ఏం చెబుతారో?

Balineni Srinivasa Reddy: వైసీపీ రీజనల్ కోఆర్టీనేటర్ పదవికి రాజీనామా చేసిన అనంతరం శుక్రవారం ఒంగోలుకు చేరుకున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఘనస్వాగతం లభించింది. రెండు రోజుల క్రితం తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్ తో భేటీ తర్వాత ఆయన హైదరాబాద్ వెళ్లిపోయారు. ఈ ఉదయం హైదరాబాద్ (Hyderabad) నుంచి ఒంగోలు వచ్చిన ఆయనకు వైసీపీ శ్రేణులు, అనుచరులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. రైల్వేస్టేషన్ నుంచి ర్యాలీగా ఒంగోలులోని తన నివాసానికి చేరుకున్నారు.

కాగా, ప్రకాశం జిల్లా (Prakasam District)లో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న అసంతృప్తితో పార్టీ తనకు అప్పగించిన నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ పదవికి ఇటీవల బాలినేని రాజీనామా చేశారు. ముఖ్యంగా ఒంగోలు డీఎస్పీ నియామకం విషయంలో తన మాట చెల్లుబాటు కాలేదన్న కారణంతో ఆయన కలత చెందారు. తాను సిఫారసు చేసిన వారిని కాకుండా వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) ప్రతిపాదించిన అశోక్ వర్ధన్ రెడ్డిని డీఎస్పీగా నియమించడంతో బాలినేని తన అసంతృప్తిని బహిరంగంగా వెల్లడించారు. దీంతో అధిష్టానం నుంచి ఆయనకు పిలుపువచ్చింది. రెండు రోజుల క్రితం సీఎం జగన్ స్వయంగా ఆయనతో మాట్లాడారు. ఒంగోలు డీఎస్సీ నియామకం విషయంపై సీఎంతో బాలినేని చర్చించనట్టు సమాచారం.

ఒంగోలు(Ongole) డీఎస్సీ నియామకం విషయంలో బాలినేని తన మాట నెగ్గించుకున్నట్టు కనబడుతోంది. ఈ వివాదం నేపథ్యంలో అశోక్ వర్ధన్ రెడ్డి గురువారం ఒంగోలు డీఎస్పీ కార్యాలయానికి వచ్చారు. క్రిందిస్థాయి అధికారుల నుంచి పుష్పగుచ్ఛాలు అందుకుని కాసేపటి తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఉన్నతాధికారుల నుంచి అందిన ఆదేశాల మేరకు ఆయన వెనుదిరిగినట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే ఈరోజు బాలినేని ఒంగోలులో అడుగుపెట్టినట్టు సమాచారం.

Also Read: బాలినేని శ్రీనివాస్ రెడ్డి పయనం ఎటు.. తర్వాతి అడుగు ఎటువైపు?

కాగా, ఒంగోలు చేరుకున్న బాలినేని ఈరోజు సాయంత్రం 5 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బాలినేని అసంతృప్తి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో ఆయన ఏం చెబుతారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రితో భేటీ తర్వాత ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారా, లేదా అనేది మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది.

Also Read: వైసీపీ అధిష్టానంపై బాలినేని అసంతృప్తి.. రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా