ఏపీకి భారీ వర్ష సూచన..జర భద్రం

  • Published By: madhu ,Published On : October 11, 2020 / 01:40 PM IST
ఏపీకి భారీ వర్ష సూచన..జర భద్రం

bay of bengal : తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ఏపీలోని పలు జిల్లాలో కుండపోతంగా వర్షాలు పడుతున్నాయి. వచ్చే నాలుగు రోజుల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.



బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, 2020, అక్టోబర్ 12వ తేదీ సోమవారం తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కోస్తా, రాయలసీమ, జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో కుంభవృష్టిగా వర్షాలు పడుతుండడంతో రైతులు తీవ్ర ఆందోళన పడుతున్నారు.



మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని సూచించారు. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ (08942 240557) ఏర్పాటు చేశారు. ఉత్తర అండమాన్‌ సముద్ర పరిసర ప్రాంతాల్లో అక్టోబర్ 14వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.



దక్షిణకోస్తా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో నిన్న భారీ వర్షాలు కురిశాయి. తాజాగా ఏర్పడిన అల్పపీడనంతో కోస్తా తీరంలో గంటకు 45-65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు.



ఇటు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో రెండు రోజులుగా హైదరాబాద్ లో వానలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.