Badvel By-Poll: బద్వేల్‌లో నైతిక విజయం బీజేపీదే.. ఓటుకు వెయ్యిచ్చి వైసీపీ గెలిచింది

కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో జరిగిన ఉపఎన్నికలో వైసీపీ ఘనవిజయం సాధించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు.

Badvel By-Poll: బద్వేల్‌లో నైతిక విజయం బీజేపీదే.. ఓటుకు వెయ్యిచ్చి వైసీపీ గెలిచింది

Somu Veerraju

Badvel By-Poll: కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో జరిగిన ఉపఎన్నికలో వైసీపీ ఘనవిజయం సాధించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. బీజేపీ అభ్యర్ధి సురేష్ కేవలం 21 వేల ఓట్లకే పరిమితమవ్వగా.. సోము వీర్రాజు ఈ ఓటమిపై తనదైన శైలిలో కామెంట్ చేశారు. బద్వేల్‌లో బీజేపీ ఓటమికి కారణం వైసీపీ డబ్బు పంచడమే అని అన్నారు.

బద్వేల్‌ ఉప ఎన్నికలో వైసీపీ అక్రమాలకు పాల్పడిందని సోము వీర్రాజు ఆరోపించారు. భారీగా డబ్బు పంచి ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడంతో పాటు వైసీపీ రిగ్గింగ్‌కు పాల్పడిందన్నారు. వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేకతను కప్పిపిచ్చుకొనేందుకు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని విమర్శించారు. బద్వేల్‌లో బీజేపీ ధర్మ పోరాటం చేసిందన్నారు. నైతిక విజయం బీజేపీ దేనన్నారు సోము వీర్రాజు.

బద్వేల్‌లో ఏం చేయబోతున్నాం అనే విషయాన్ని కరపత్రం ఇచ్చి మరీ ఓట్లు అడిగామని చెప్పుకొచ్చారు. కానీ వైసీపీ వెయ్యి నోటు ఇచ్చి ఓటు అడిగిందని అన్నారు. బద్వేల్‌లో ప్రజాస్వామ్య బద్దంగా పోలింగ్ జరగాలని బీజేపీ కోరిందని, వైసీపీ బయటవారిని తీసుకొచ్చి రిగ్గింగ్ చేసినట్లుగా ఆరోపించారు.