Vizag Steel Plant: అమ్మేస్తామంతే.. హైకోర్టులో కేంద్రం అఫిడవిట్.. ఉద్యోగులనూ తొలగిస్తాం

Vizag Steel Plant: అమ్మేస్తామంతే.. హైకోర్టులో కేంద్రం అఫిడవిట్.. ఉద్యోగులనూ తొలగిస్తాం

Vizag

Centre Gives Clarity On Vizag Steel Plant Privatization: విశాఖ స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏపీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం కీలక అఫిడవిట్ దాఖలు చేసింది. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు రాజ్యాంగ భద్రత ఉండదని, అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను కూడా తొలగిస్తామని కేంద్రం అఫిడవిట్‌లో స్పష్టం చేసింది.

వంద శాతం స్టీల్‌ ప్లాంట్‌ పెట్టుబడులను ఉపసంహరించుకోబోతున్నట్లు తెలిపిన కేంద్రం.. ఇప్పటికే బిడ్డింగులను ఆహ్వానించినట్టు అఫిడవిట్‌లో ఏపీ హైకోర్టుకు వెల్లడించింది. కేంద్రం తరపున కార్యదర్శి ఆర్కే సింగ్ ఈ మేరకు దాఖలు చేశారు. ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకే.. స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొంది కేంద్రం. దీనిపై ఈ ఏడాది జనవరి 27నే నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం హైకోర్టుకు చెప్పింది.

హైకోర్టులో వేసిన పిటీషన్ రాజకీయ దురుద్దేశంతో వేశారంటూ కేంద్రం అభిప్రాయపడింది. స్టీల్ ప్లాంట్ విషయంలో జేడీ లక్ష్మీనారాయణ వేసిన పిటీషన్ విచారణకు అర్హత లేనిదని అభిప్రాయపడింది కేంద్రం. దేశ ఆర్థిక వ్యవహారాలపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికి ఉంటుందని, ఇటువంటి విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని ఆర్కే సింగ్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

ఇప్పటికే ఇటువంటి విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఉందని చెప్పారు. స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా..దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని అఫిడవిట్‌లో కోరింది కేంద్రం.