చలో రామతీర్థం : బీజేపీ, జనసేన నేతల పర్యటన, భారీగా పోలీసుల మోహరింపు

చలో రామతీర్థం : బీజేపీ, జనసేన నేతల పర్యటన, భారీగా పోలీసుల మోహరింపు

Chalo Ramatheertham : బీజేపీ మరోసారి రామతీర్థం పర్యటనకు రెడీ అయ్యింది. మొన్న ఎక్కడికక్కడ బీజేపీ, జనసేన నేతలను అరెస్ట్‌ చేయడంతో… మరోసారి రామతీర్థం వెళ్లాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. ఇందుకు అనుమతివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. రామతీర్థంలోని కోదండరాముడి ఆలయాన్ని పరిశీలిస్తామని..అందుకు పర్మిషన్‌ ఇవ్వాలన్నారు. బీజేపీ విజ్ఞప్తిపై ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. కమలనేతల రామతీర్థం సందర్శనకు అనుమతి ఇచ్చింది. దీంతో సోమువీర్రాజు, జీవీఎల్‌ నరసింహారావుతో పాటు మరికొంత మంది బీజేపీ, జనసేనకు చెందిన ముఖ్యనేతలకు పర్మిషన్‌ వచ్చింది. దీంతో రామతీర్థం వెళ్లడానికి బీజేపీ, జనసేన నేతలు రెడీ అయ్యారు.

20 తర్వాత సోము వీర్రాజు రాష్ట్ర పర్యటన : –
బీజేపీ నేతల పర్యటన నేపథ్యంలో… రామతీర్థంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. రామతీర్థం మొత్తం పోలీసుల అదుపులోకి వెళ్లింది. అక్కడ 144 సెక్షన్‌ అమలు చేస్తోంది. దీంతో భారీ సంఖ్యలో కాకుండా.. పరిమిత సంఖ్యలోనే బీజేపీ నేతలను ఆలయ సందర్శనకు అనుమతించనున్నారు. ఏపీలో ధ్వంసం చేసిన ఆలయాలను, దేవతా విగ్రహాలను పరిశీలించేందుకు ఈనెల 20 తర్వాత రాష్ట్ర పర్యటన చేపట్టనున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు.

బీజేపీ ఊరుకోదు : –
2021, జనవరి 07వ తేదీ గురువారం రామతీర్థం వెళ్లనున్న తమ పార్టీ నాయకులను…. మంత్రులను, చంద్రబాబును ఎలా దగ్గరుండి తీసుకెళ్లారో ….తమ పార్టీ నేతలను కూడా తీసుకెళ్లాలని డిమాండ్‌ చేశారు. వైసీపీ
చుప్‌చాప్‌ అంటే బీజేపీ ఊరుకోబోదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గెరిల్లా యుద్ధం చేస్తున్నారని సీఎం జగన్‌ చేసిన ఆరోపణలను వీర్రాజు ఖండించారు. హిందువులపై కేసులు పెడుతూ ప్రభుత్వమే గెరిల్లా యుద్ధం చేస్తోందని విమర్శించారు.

బీజేపీ నేతల ఆందోళన : –
మరోవైపు…రామతీర్థం ఆలయంలోకి బీజేపీ నేతలను అనుమతించకపోవడం.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి అరెస్ట్‌ను నిరసిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు ఆందోళనలకు దిగారు. పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ విశాఖ, విజయవాడ, విజయనగరం, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ధర్నాలు నిర్వహించారు. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బీజేపీ ధర్నా నిర్వహించింది. తమను రామతీర్థంలోకి అడుగు పెట్టనివ్వకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బీజేపీ నేతలు హెచ్చరించారు.

గవర్నర్ ను కలువనున్న టీడీపీ నేతలు : –
మరోవైపు..ఏపీ టీడీపీ నేతలు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను గురువారం కలవనున్నారు. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. ఆలయాలపై దాడుల అంశాన్ని సీబీఐతో విచారణ జరిపించాలని కోరనున్నారు. టీడీపీ బృందంలో ధూళిపాళ్ల నరేంద్ర, తెనాలి శ్రవణ్‌కుమార్‌, వర్ల రామయ్య, బుద్ధా వెంకన్న గవర్నర్‌ను కలవనున్నారు.