Chandrababu-CM Jagan : ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలి.. సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ

Chandrababu-CM Jagan : ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలి.. సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ

Chandrababu Demands Cm Jagan To Pay Farmers Paddy Procured Pending Payment (1)

Chandrababu-CM Jagan : ధాన్యం బకాయిలు చెల్లించకపోవడంతో రైతులు నష్టపోతున్నారని, తక్షణమే చెల్లింపులు జరపాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్‌కు లేఖ రాశారు. మద్దతు ధరకు కొనుగోలు చేయడంలోనూ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతు ప్రభుత్వం అని చెప్పి.. వారినే నిండా ముంచే విధానాలను అవలంబిస్తున్నారని మండిపడ్డారు.

టీడీపీ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేశామన్నారు. ధాన్యం కొనుగోళ్లు చేసి రెండు నెలలు దాటినా ఉలుకూ, పలుకు లేదని విమర్శించారు. పంటలు పండించేందుకు తీసుకువచ్చిన అప్పులకు వడ్డీలు ఎవరు కడతారు? అని చంద్రబాబు లేఖలో ప్రశ్నించారు. ఖరీఫ్‌కు పెట్టుబడులు ఎవరిస్తారు? ఒక్క గోదావరి జిల్లాల్లోనే 2500 కోట్లు బకాయిలు ఉన్నాయని తెలిపారు. ధాన్యం సేకరణలోనూ తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

రాయలసీమలో మొత్తం వేరుశనగ పంట నష్టపోయినా ఇన్ పుట్ సబ్సీడీ అందలేదని విమర్శించారు. ధాన్యం కొనుగోలుకు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల పేరుతో హడావుడి చేస్తున్నారని, కౌలు రైతులుకు ప్రభుత్వ సాయం అందడం లేదన్నారు. సున్నావడ్డీ రుణాలు, పంట బీమా, ఇన్ పుట్ సబ్సీడీ చెల్లింపుల్లోనూ కౌలు రైతులు
తీవ్రంగా నష్టపోతున్నారని లేఖలో తెలిపారు.

ఈ-క్రాప్ లో నమోదు పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని, మిల్లర్లు, వైసీపీ నేతలు కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. కొనుగోలు కేంద్రాల ద్వారా గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలన్నారు. పంటలను మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన పంటలకు తక్షణమే చెల్లింపులు జరపాలని లేఖలో చంద్రబాబు డిమాండ్ చేశారు.