Chandrababu Naidu : ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్‌కు టీడీపీ మద్దతు.. ప్రశ్నిస్తే వేధిస్తారా అంటూ సీఎం జగన్‌పై చంద్రబాబు ఆగ్రహం

అనంతపురంలో ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్ ను ఏపీ ప్రభుత్వం వేధిస్తోంది అంటూ ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. సమస్యలపై నిలదీసిన వాళ్లపై చర్యలు తీసుకోవడం దారుణం అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

Chandrababu Naidu : ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్‌కు టీడీపీ మద్దతు.. ప్రశ్నిస్తే వేధిస్తారా అంటూ సీఎం జగన్‌పై చంద్రబాబు ఆగ్రహం

Chandrababu Naidu : అనంతపురంలో ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్ ను ఏపీ ప్రభుత్వం వేధిస్తోంది అంటూ ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. సమస్యలపై నిలదీసిన వాళ్లపై చర్యలు తీసుకోవడం దారుణం అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

సేవ్ ఏపీ పోలీస్ అంటూ నిరసనకు దిగిన కానిస్టేబుల్ ప్రకాశ్ ను సర్వీస్ నుంచి తొలగించడానికి అక్రమ కేసులు మోపుతారా? ఆయన చేసిన తప్పేంటి? పోలీస్ శాఖలో ఉండే సమస్యలను పరిష్కరించమని జగన్ దృష్టికి తేవాలనుకోవడం తప్పా? అని తన ట్వీట్ లో ప్రశ్నాస్త్రాలు సంధించారు చంద్రబాబు.

జగన్ మాట మీద ఒక పోలీస్ పైనే అక్రమ కేసులు పెట్టారంటే వైసీపీ నేతల మాటలు విని సామాన్యులను ఎంతగా వేధిస్తున్నారో అర్థమవుతోంది అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రకాశ్ పై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకుని వెంటనే సర్వీస్ లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. అంతవరకు ప్రకాశ్ కు టీడీపీ అండగా ఉంటుందన్నారు.

సేవ్ ఏపీ పోలీస్ అంటూ ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ ఇటీవల నిరసనకు దిగడం కలకలం రేపింది. పోలీసులకు చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వం స్పందించడం లేదంటూ కానిస్టేబుల్‌ ప్రకాష్‌ ఆందోళనకు దిగారు. జూన్ 14న సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లిలో సీఎం జగన్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా పోలీసుల అమరవీరుల స్తూపం వద్ద ప్రకాశ్ నిరసన తెలిపారు.

‘ఏపీ సీఎం జగన్‌ సార్‌.. సేవ్‌ ఏపీ పోలీస్‌, గ్రాంట్‌ ఎస్‌ఎల్‌ఎస్‌, ఏఎస్‌ఎల్‌ఎస్‌ అరియర్స్‌.. సామాజిక న్యాయం ప్లీజ్‌’ అంటూ ప్లకార్డును కూడా ప్రదర్శించారు. ఈ నిరసన పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సరెండర్ లీవులు, అదనపు సరెండర్ల లీవులకు సంబంధించిన మొత్తం ఇప్పించాలంటూ కానిస్టేబుల్ ప్రకాశ్ ప్లకార్డు ప్రదర్శించడం దుమారం రేపింది. దీనిని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు ప్రకాశ్ పై చర్యలు తీసుకున్నారు.

తమకు ప్రతి ఆరు నెలలకోసారి ఇవ్వాల్సిన సరెండర్‌ లీవులు (ఎస్‌ఎల్‌ఎస్‌), అడిషనల్‌ సరెండర్‌ లీవులు (ఏఎస్ఎల్‌ఎస్‌) మూడు విడతలుగా పెండింగ్‌లో ఉన్నాయని ప్రకాష్ అంటున్నారు. 14 నెలల నుంచి తమకు టీఏలు అందడం లేదని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచిన ఆరు డీఏల అరియర్స్‌ పరిస్థితి కూడా అంతే అన్నారు. ఇవన్నీ బకాయిల రూపంలోనే ఉండిపోయాయని.. ఇలా ఒక్కో కానిస్టేబుల్‌కు ప్రభుత్వం రూ.1.80 లక్షలు చెల్లించాల్సి ఉందని చెప్పుకొచ్చారు. తమకు ఇవన్నీ చెల్లించకుండా ఆదాయ పన్ను రూపంలో తమ వేతనాల్లో కట్‌ చేశారని కానిస్టేబుల్ ప్రకాశ్ ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది పోలీసులు ఈ విషయమై ఆవేదన చెందుతున్నారని తెలిపారు.

కానిస్టేబుల్ ప్రకాశ్ నిరసనను తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు.. గతంలో ప్రకాశ్ పై ఉన్న పాత కేసులు తిరగదోడారు. వాటిపై శాఖాపరమైన విచారణ చేపట్టారు. ప్రకాశ్ పై నమోదైన కేసుల్లో అభియోగాలు రుజువయ్యాయని, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సిఫార్సు కూడా చేశారు.