Tirumala Temple Ornaments : కోటి విలువ చేసే కిలో బంగారం.. తిరుమల శ్రీవారికి భారీ విరాళం

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడికి ఓ దాత భారీ విరాళం అందించాడు. ఈ ఆభరణాల బరువు ఒక కేజీ 756 గ్రాములు. వీటి విలువ కోటి రూపాయల 30 లక్షలు.

Tirumala Temple Ornaments : కోటి విలువ చేసే కిలో బంగారం.. తిరుమల శ్రీవారికి భారీ విరాళం

Updated On : December 29, 2022 / 11:50 PM IST

Tirumala Temple Ornaments : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడికి ఓ దాత భారీ విరాళం అందించాడు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కేవీఆర్ జువెలర్స్ వ్యవస్థాపకుడు కేఆర్ నారాయణమూర్తి, స్వర్ణగౌరి దంపతులు తిరుమల శ్రీవారికి మూడు రకాల స్వర్ణాభరణాలు అందజేశారు. ప్రత్యేకంగా తయారు చేయించిన మూడు రకాల స్వర్ణాభరణాలను శ్రీవారి సన్నిధిలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు.

మూల విరాట్ కోసం ఒక జత కర్ణాభరణాలు, శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామికి విలువైన రాళ్లు పొదిగిన పతకాలు, మలయప్పస్వామికి బంగారు యజ్ఞోపవీతాన్ని విరాళంగా ఇచ్చారు. మేలిమి బంగారంతో తయారు చేసిన ఈ ఆభరణాల బరువు ఒక కేజీ 756 గ్రాములు. వీటి విలువ కోటి రూపాయల 30 లక్షలు.

కేవీఆర్ జువెలర్స్ అధినేత నారాయణ మూర్తి శ్రీవారికి ఇలా విలువైన కానుకలు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. గతేడాది కూడా స్వామి వారికి రూ.3 కోట్ల విలువైన బంగారు కటి, వరద హస్తాలను స్వామికి విరాళంగా ఇచ్చారు.

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. దేశ విదేశాల నుంచి తరలి వస్తుంటారు. ఆపద మొక్కుల వాడిని దర్శించుకుని పులకించిపోతారు. భక్తులు తమ శక్తి మేరకు స్వామి వారికి కానుకలు సమర్పిస్తారు. కొందరు చాలా ఖరీదైన కానుకలు స్వామి వారికి విరాళంగా ఇస్తుంటారు. కిలోల కొద్ది బంగారం, బంగారు ఆభరణాలు స్వామికి విరాళంగా ఇస్తారు. వాటి విలువ కోట్లలో ఉంటుంది.