CM Jagan : సీఎం జగన్ గొప్పమనసు, ఆ డాక్టర్ చికిత్సకు రూ.కోటి సాయం

ఏపీ సీఎం జగన్ మరోసారి తన గొప్పమనసు చాటుకున్నారు. ఆసుపత్రిలో విషమ పరిస్థితుల్లో ఉన్న డాక్టర్‌కు అండగా నిలిచారు. ఆయన చికిత్స ఖర్చుల కోసం రూ.కోటి సాయం చేశారు.

CM Jagan : సీఎం జగన్ గొప్పమనసు, ఆ డాక్టర్ చికిత్సకు రూ.కోటి సాయం

Cm Jagan Grants One Crore

CM Jagan Grants One Crore : ఏపీ సీఎం జగన్ మరోసారి తన గొప్పమనసు చాటుకున్నారు. ఆసుపత్రిలో విషమ పరిస్థితుల్లో ఉన్న డాక్టర్‌కు అండగా నిలిచారు. ఆయన చికిత్స ఖర్చుల కోసం రూ.కోటి సాయం చేశారు.

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కొత్తపుట్టుగకు చెందిన డాక్టర్‌ ఎన్‌.భాస్కరరావు ప్రకాశం జిల్లా కారంచేడు పీహెచ్‌సీ వైద్యాధికారిగా పని చేస్తున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ఏమాత్రం భయపడకుండా ఆయన డ్యూటీ చేశారు. వేలాది మంది కరోనా బాధితులకు వైద్యం అందించారు. ఆయన వైద్యంతో ఎంతోమంది కోలుకున్నారు.

ఇలా ఎందరో ప్రాణాలు నిలబెట్టిన డాక్టరే ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. కరోనా రోగులకు వైద్యం అందించే క్రమంలో ఏప్రిల్‌ 24న డాక్టర్ భాస్కరరావు కరోనా బారిన పడ్డారు. నెలాఖరు వరకు హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండి వైద్యం తీసుకున్నారు. ఆ తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆయన భార్య డాక్టర్‌ భాగ్యలక్ష్మి విజయవాడ ఆయుష్‌ ఆస్పత్రిలో భాస్కరరావుని చేర్చారు.

అక్కడ 10 రోజుల వైద్యం తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ తరలించారు. ముందుగా యశోదలో చికిత్స అందించారు. తర్వాత గచ్చిబౌలిలోని కేర్‌ హాస్పిటల్‌ కు తీసుకెళ్లారు. ఊపిరితిత్తులు పూర్తిగా పాడవటంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా మారిందని, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్టు డాక్టర్లు తెలిపారు. ఆయనకు ఊపిరితిత్తులు మార్చాలని తేల్చిన వైద్యులు అందుకు రూ.1.50 కోట్లకు పైగా ఖర్చవుతుందని చెప్పారు.
అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో డాక్టర్‌ భాస్కరరావు కుటుంబ సభ్యులు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆశ్రయించారు.

మంత్రి బాలినేని ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన సీఎం జగన్ విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతున్న ఆ డాక్టర్ వైద్య ఖర్చుల నిమిత్తం రూ.కోటి నిధులు విడుదల చేయించారు. అవసరమైతే మిగిలిన రూ.50 లక్షలు కూడా అందజేసేందుకు ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు మంత్రి బాలినేని తెలిపారు. కష్ట సమయంలో సీఎం జగన్ చేసిన సాయానికి భాస్కరరావు కుటుంబసభ్యులు ధన్యవాదాలు తెలిపారు.