కరోనా వైరస్ కట్టడిపై సీఎం జగన్ సుదీర్ఘ సమీక్ష

కోవిడ్‌–19 నివారణపై 2020, ఏప్రిల్ 26వ తేదీ ఆదివారం సీఎం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను అధికారులు సీఎంకు వివరించారు.

కరోనా వైరస్ కట్టడిపై సీఎం జగన్ సుదీర్ఘ సమీక్ష

కోవిడ్‌–19 నివారణపై 2020, ఏప్రిల్ 26వ తేదీ ఆదివారం సీఎం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 231 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని ఆరోగ్యంతో ఇళ్లకు వెళ్లారని అధికారులు తెలిపారు. వీరందరికీ రూ.2వేల రూపాయలు చొప్పున అందించాలని సీఎం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంతమందికి అందించామని, మిగిలిన వారికి కూడా అందిస్తామన్నారు రాష్ట్రవ్యాప్తంగా కేసుల వివరాలను సీఎంకు వివరించారు. విజయవాడలో కేవలం ఇద్దరు వ్యక్తుల కారణంగా కృష్ణ లంకలోని ఒక వీధిలో, కార్మికనగర్‌లోని ఒక వీధిలో కేసులు వచ్చాయన్నారు.

పశ్చిమగోదావరిలో కూడా ఢిల్లీనుంచి వచ్చిన వ్యక్తి కారణంగా వ్యాపించిందన్నారు. టెస్టులు సంతృప్తికర స్థాయిలో జరుగుతున్నాయని, దీనివల్ల రాష్ట్రంలో వైరస్‌ పరిస్థితి ఏంటి ? ఏరకంగా ప్రభావం చూపుతోంది ? హైరిస్క్‌ ఉన్న వారిపై వైరస్‌ చూపించే ప్రభావం తదితర అంశాలను తెలుసుకునేందుకు విస్తృతంగా నిర్వహించిన ఈ పరీక్షలు చాలా ఉపయోగపడుతున్నాయని వెల్లడించారు.

లాక్‌డౌన్‌ అనంతరం తీసుకునే నిర్ణయాలు, ఆ తర్వాత పరిణామాల్లో భాగంగా ఎలాంటి వైద్య పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలన్న దానికి ఈ అధ్యయనం, విశ్లేషణలు తోడ్పాటునందిస్తాయన్నారు. ప్రజల్లో తీవ్ర భయం, ఆందోళన కలిగించరాదని సూచించారు సీఎం జగన్. కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ఇంటికి వెళ్లినా స్థానికులు అడ్డుకోవడం, చివరకు ఉద్రిక్తతకు దారి తీసిన ఒకటిరెండు ఘటనలను కూడా సమావేశంలో సీఎం దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని మీడియా సంస్థలు విపరీత పోకడ, తీవ్ర ఆందోళన కలిగించేలా ప్రచారం చేస్తుండడం దీనికి కారణమని సమావేశంలో వైద్య నిపుణులు ప్రస్తావించారు.

ప్రజల్లో తీవ్ర ఆందోళన బదులు ధైర్యం, భరోసా, స్థైర్యం, అవగాహన, జాగ్రత్తలు పాటించేలా, చైతన్యం కలిగించేలా మరిన్ని అడుగులు ముందుకేయాలని సీఎం ఆదేశించారు. కోవిడ్‌ –19 లాంటి విపత్తను ఎదుర్కోవాలంటే ఆరోగ్యం రంగంలో మౌలికసదుపాయాల కల్పన ముమ్మరంగా సాగాలని స్పష్టం చేశారాయన. నాడు – నేడు కింద ప్రతిపాదించిన పనులన్నీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అత్యవసర సేవలకు ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కలగకూడదని, ప్రణాళిక ప్రకారం ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సుల పోస్టులు భర్తీ చేయాలన్నారు.

రాష్ట్రంలో ప్రతి మనిషికీ మూడు మాస్కుల చొప్పున పంపిణి పై ఆరా తీశారు సీఎం జగన్. మాస్క్‌లు ధరించడం, పరిశుభ్రమైన వస్త్రాన్ని కప్పుకోవడం లాంటి చర్యలు మేలుచేస్తాయని సమావేశంలో వైద్య నిపుణులు సూచించారు. ఇప్పటికే 1.3 కోట్లకు పైగా మాస్క్‌లను రెడ్‌ క్లస్టర్లలో పంపిణీ చేశామని వివరించారు అధికారులు. రోజుకు 40 లక్షల చొప్పున మాస్క్‌లు తయారు చేస్తున్నామని, అత్యంత వేగంగా పంపిణి కార్యక్రమం జరుగుతోందన్నారు. డ్వాక్రా సంఘాలుకు ఇవ్వడంవల్ల వారికి కష్టకాలంలో ఉపాధికూడా కలిగిందన్నారు. మాస్క్ ల తయారీ, పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం జగన్ సూచించారు.ః

రైతులు నష్టపోకుండా వెంటనే పొగాకును కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రకాశం జిల్లాల్లో పొగాకు కొనుగోలు కేంద్రాలు రెడ్‌జోన్లలో ఉన్నందున టంగుటూరు, కొండెపిల్లో వేలం పాట కేంద్రాల ఏర్పాటు చేయాలన్నారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కూడా పొగాకు కొనుగోలు కోసం వేలం పాట కేంద్రాలు నిర్వహించాలని సూచించారు. 2020, ఏప్రిల్ 27వ తేదీ సోమవారం నుంచి వేల పాటలు నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. స్వయంగా పర్యవేక్షించాలని ప్రకాశం, ప.గో. జిల్లాల కలెక్టర్లకు సీఎం సూచించారు.