వాలంటీర్ల విషయంలో సీఎం జగన్ కీలక నిర్ణయం, ఉగాది నుంచి ప్రారంభం…

వాలంటీర్ల విషయంలో సీఎం జగన్ కీలక నిర్ణయం, ఉగాది నుంచి ప్రారంభం…

cm jagan to honour volunteers: గ్రామ/వార్డు వాలంటీర్ల విషయంలో ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వాలంటీర్లను సత్కరించాలని జగన్ నిర్ణయించారు. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందించే విషయంలో వాలంటీర్లది కీలక పాత్ర అని సీఎం జగన్ అన్నారు. వాలంటీర్లది సేవ అన్న జగన్, వారిని మోటివేట్‌ చేయాలని అధికారులతో చెప్పారు. దీనికోసం ఒక ఆలోచన చేశామన్నారు. ఉగాది రోజు ప్రతి నియోజకవర్గంలో వాలంటీర్లను సత్కరించాలన్నారు. వారి సేవలను గుర్తిస్తూ వారికి సత్కారం చేయాలని సూచించారు.

ఉగాది నుంచి ప్రతిరోజూ సత్కారం:
అలాగే, ప్రతి జిల్లాలో ఉగాది నుంచి ప్రతిరోజూ రోజుకు ఒక నియోజకవర్గంలో వాలంటీర్లకు సత్కార కార్యక్రమం ఉంటుందని జగన్ తెలిపారు. కలెక్టర్, ఎస్పీ, జేసీ, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. వాలంటీర్లను సత్కరిస్తూ, వారిని గుర్తించేలా, వారిని పోత్సహించడానికి ఈ కార్యక్రమాలు చేయాలన్నారు. వారు చేసేది ఉద్యోగం కాదు, సేవ.. అందుకే వారిని మోటివేట్‌ చేయాలన్నారు. ప్రతి ఏటా ఉగాది రోజున ఈ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని, దీనిపై కార్యాచరణ రూపొందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

సెక్రటేరియట్‌లో వివిధ శాఖల కార్యదర్శులతో సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాద్‌ దాస్, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారులు అజేయ కల్లం, నీలం సాహ్ని, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. గడచిన 20 నెలలుగా మీతో కలిసి పనిచేయడం చాలా సంతోషకరమని జగన్ అన్నారు. క్రికెట్‌లో కెప్టెన్‌ మాత్రమే గెలవలేడు, జట్టు సభ్యులందరూ కలిసి ఆడితేనే గెలుస్తాం.. అలాగే మీ అందరి సహకారంతో మనం ముందుకెళ్తున్నామని తెలిపారు.

మీరు రోడ్డెక్కడం నన్ను బాధించింది:
తమ జీతాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఇటీవల వాలంటీర్లు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. వాలంటీర్లు రోడ్డెక్కి నిరసన తెలపడం అధికార వర్గాల్లో కలకలం రేపింది. దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ వాలంటీర్లకు ఓ లేఖ కూడా రాశారు. వేతనాలు పెంచాలని కోరుతూ వాలంటీర్లు డిమాండ్ చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని, అయితే వాస్తవాలతో పని లేకుండా రోడ్డెక్కారన్న వార్త తనను బాధించిందని జగన్ ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి వలంటీర్లకు ఇస్తున్నది వేతనం కాదని, గౌరవ భృతి మాత్రమేనని స్పష్టం చేశారు. వాలంటీర్లకు వస్తున్న మంచి పేరును తుడి చేసి, అసలా వ్యవస్థే లేకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

సేవా దృక్పథం ఉన్న వారినే నియమించాం:
వాలంటీర్లు వారానికి ఇన్ని గంటలు, ఇన్ని రోజులు పనిచేయాలన్న నిబంధన ఏదీ లేదని సీఎం తెలిపారు. తాను హ్యాండ్‌బుక్‌లోనూ ఇదే విషయాన్ని రాశానని గుర్తు చేశారు. సేవా దృక్పథం ఉన్న యువతీ యువకులను రూ. 5 వేల వేతనంతో గ్రామ/వార్డు వాలంటీర్లుగా నియమిస్తామని, ఇంతకంటే మెరుగైన ఉద్యోగం వచ్చే వరకు పనిచేస్తారని అందులో తెలిపామని జగన్ ఆ లేఖలో గుర్తు చేశారు.

వాలంటీర్ వ్యవస్థ లేకుండా చేసే కుట్ర ఇది:
వాలంటీర్లుగా కాకుండా వేతనం కోసం పనిచేస్తే ఇప్పుడు మీకు లభిస్తున్న గౌరవం లభించి ఉండేదా? అని జగన్ ప్రశ్నించారు. మీ సేవలకు అవార్డుగా, మీకు ఇవ్వవలసిన గౌరవాన్ని మీకు దక్కకుండా చేసేందుకు, వస్తున్న మంచి పేరును చెడగొట్టేందుకు ఎవరు కుట్రలు పన్నుతున్నారో తనకు తెలుసని అన్నారు. రెచ్చగొట్టే వారికి, ప్రలోభాలకు దూరంగా ఉండాలని ఓ అన్నలా, శ్రేయోభిలాషిలా విజ్ఞప్తి చేస్తున్నట్టు లేఖలో కోరారు జగన్.

లేఖ ద్వారా వాలంటీర్లకు పలు విషయాలు చెప్పిన సీఎం జగన్.. ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. వాలంటీర్లను సత్కరించాలని సీఎం జగన్ నిర్ణయించారు.