Krishna-Godavari Boards : కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులు.. గెజిట్ నోటిఫికేషన్ అమలుపై డైలమా

కృష్ణా, గోదావరి నదులపై తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు ఆయా బోర్డుల చేతికి ఇప్పట్లో వెళ్లేలా కనిపించడంలేదు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ నేటి నుంచి అమల్లోకి రానుంది.

Krishna-Godavari Boards : కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులు.. గెజిట్ నోటిఫికేషన్ అమలుపై డైలమా

Krmb (1)

Confusion over Gazette Notification : కృష్ణా, గోదావరి నదులపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు ఆయా బోర్డుల చేతికి ఇప్పట్లో వెళ్లేలా కనిపించడంలేదు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ ఇవాళ్టి నుంచి అమల్లోకి రానుంది. అయితే ప్రాజెక్టులను అప్పగించాలా, వద్దా అనే అంశంపై అధ్యయనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గెజిట్‌ అమల్లో భాగంగా ప్రాజెక్టులను తమకు అప్పగించాలంటూ కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ.. రెండు తెలుగు రాష్ట్రాలకు తీర్మానాలు పంపించింది.

తాము స్వాధీనం చేసుకోబోయే శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులపై ఉన్న కాంపోనెంట్లు, జలవిద్యుత్‌ కేంద్రాల జాబితాను కృష్ణా బోర్డు పంపించగా, పెద్దవాగు ప్రాజెక్టును అప్పగించాలంటూ గోదావరి బోర్డు పేర్కొంది. కృష్ణా బోర్డు తీర్మానానికి అనుగుణంగా తాము ఇవాళ ఉత్తర్వులు జారీ చేస్తామని ఏపీ ప్రకటించింది.

Gazette Conflict : కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలపై గెజిట్ అమలు చేస్తారా? గడువు ఇస్తారా?

కృష్ణా బేసిన్‌లో ప్రధానంగా శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రంతోపాటు నాగార్జునసాగర్‌లోని రెండు జలవిద్యుత్‌ కేంద్రాలను కేఆర్‌ఎంబీకి అప్పగించడంపైనే తెలంగాణకు ప్రధానంగా అభ్యంతరం ఉంది. జలవిద్యుత్‌ కేంద్రాలు చేజారితే సమస్యలు తప్పవనే భావనతో ఉంది. దీంతోపాటు నీటిపారుదల ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించడం వల్ల ప్రస్తుతానికి నష్టాలేవీ లేనప్పటికీ.. భవిష్యతులో సమస్యలు వస్తాయని ఆందోళన చెందుతోంది.

కృష్ణా, గోదావరి నదులపై గుర్తించిన ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి ఇవాళ్టి నుంచి గెజిట్‌ అమలు కానుంది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ ప్రకారం కృష్ణా, గోదావరి బోర్డులు ఈ మేరకు ప్రక్రియను అమలు చేయనున్నాయి. గెజిట్‌లో పేర్కొన్న ప్రాజెక్టులన్నింటికీ బదులు రాష్ట్ర ప్రభుత్వాలు సమ్మతి తెలిపే ప్రాజెక్టుల బాధ్యతలను మొదటి దశలో స్వీకరించనున్నాయి. ఇప్పటికే సమావేశాల్లో ప్రతిపాదించి తీర్మానించిన జాబితాను రెండు రాష్ట్రాలకు అందజేశాయి. మరికొన్ని వివరాలను పంపించాల్సి ఉన్నట్లు సమాచారం. మొత్తం 15 అవుట్‌లెట్లకు సంబంధించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీచేయాల్సి ఉంది.

KRMB Projects : కృష్ణా బోర్డు పరిధిలోకి 29 ప్రాజెక్టులు..అంగీకారం తెలిపిన ఏపీ, తెలంగాణ
బోర్డులు ఖరారు చేసిన ప్రాజెక్టులకు సంబంధించి అన్ని వివరాలను రాష్ట్రాలు అప్పగించాల్సి ఉంది. ఈ మేరకు రాష్ట్రాలు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనున్నాయి. తెలంగాణ జెన్‌కో పరిధిలోని మూడు జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను బోర్డులకు ఇవ్వమని ఇప్పటికే స్పష్టం చేసింది. అవి మినహా మిగిలిన అవుట్‌లెట్లను అప్పగిస్తుందని తెలుస్తోంది. ఏపీ ఆరు అవుట్‌లెట్లను అప్పగించేందుకు సిద్ధమని ప్రకటించగా ఉత్తర్వులు విడుదల కావాల్సి ఉంది. ఒక రాష్ట్రం ఉత్తర్వులు జారీ చేసి మరో రాష్ట్రం జారీ చేయకపోతే గెజిట్‌ పాక్షికంగానే అమలయ్యే అవకాశాలు ఉన్నాయి.