రాజధాని రగడ : కాంగ్రెస్ ను వెంటాడుతున్న భయం

  • Published By: veegamteam ,Published On : January 14, 2020 / 03:06 PM IST
రాజధాని రగడ : కాంగ్రెస్ ను వెంటాడుతున్న భయం

రాష్టం విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్‌కు స్థానం లేకుండా పోయింది. విభజన పాపం అంతా కాంగ్రెస్‌దే అనే భావన ఇప్పటికీ ప్రజల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రెండు ఎన్నికలను ఎదుర్కొంది. కానీ ఆయా స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా లేని అసాధారణ పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ చవిచూసింది. గడచిన ఎన్నికల తర్వాత పీసీసీ అధ్యక్ష పదవికి కూడా ఇబ్బంది ఏర్పడింది. రఘువీరారెడ్డి తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆ పోస్టు భర్తీ చేయడానికి అధిష్టానం అనేక రకాలుగా కసరత్తు చేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి భాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం సాగింది. అయితే ఇపుడున్న పరిస్థితుల్లో పార్టీని నిలబెట్టి నడపడం అంటే ఆర్థికంగా కూడా బలంగా ఉండాలి. దీనికి భయపడి చాలామంది వెనక్కి తగ్గుతున్నారు.

ఎటూ తేల్చుకోలేని అయోమయంలో కాంగ్రెస్‌:
ఈ పరిస్థితుల్లో వైసీపీ మూడు రాజధానుల ప్రతిపాదన తెరమీదకు తేవడంతో బలహీనపడిందనుకున్న తెలుగుదేశం పార్టీ కొంత మేరకు పుంజుకుంది. ఉద్యమానికి తానే సారథ్యం వహిస్తూ ముందుకు తీసుకెళుతోంది. మరోవైపు జనసేన కవాతుకు సిద్ధం అవుతోంది. బీజేపీ కూడా సంక్రాంతి తర్వాత పోరాటం మొదలుపెట్టే నిర్ణయానికి వచ్చింది. కానీ కాంగ్రెస్ మాత్రం ఇంతవరకూ తన వైఖరి ఏమిటనేది తేల్చలేదు. స్థానికంగా ఉన్న కొంతమంది నేతలు స్వయంగా ఉద్యమంలో పాల్గొనడం మినహా అధిష్టానం పరంగా ఎలాంటి ఆదేశాలు లేవంటున్నారు. ఈ వివాదంలో తలదూరిస్తే పార్టీకి వచ్చే లాభనష్టాల గురించి అంచనా వేయడంతోనే టైమంతా అయిపోతుందని అంటున్నారు. మూడు రాజధానుల వల్ల ప్రాంతాల మధ్య భేదాభిప్రాయాలు వస్తాయని, ఒక ప్రాంతం కోసం మరో ప్రాంతాన్ని వదులుకోవడం ఎందుకనే అయోమయంలో పార్టీ ఉందని చెబుతున్నారు. 

ఏ ప్రాంతానికి కాకుండా పోతామనే భయం:
ప్రభుత్వ నిర్ణయం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేదిగా ఉంది కాబట్టి అధికారిక ప్రకటన వెలువరించే వరకూ వేచి చూద్దామనే ధోరణిలో కాంగ్రెస్ ఉందని పార్టీ కార్యకర్తలు అంటున్నారు. దాదాపు రాజకీయ పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నా కాంగ్రెస్‌ మాత్రం గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తోంది. ఇలాంటి వ్యూహం వల్ల చివరకు పార్టీ ఏ ప్రాంతానికీ కాకుండా పోయే ప్రమాదం ఉందని కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. ఇపుడున్న పరిస్థితుల్లో బలహీనంగా ఉన్న పార్టీకి జవసత్వాలు అందాలంటే అమరావతి ఉద్యమంలో భాగస్వాములు అవ్వాలనే అభిప్రాయం ఎక్కువ మంది నేతల్లో వ్యక్తం అవుతోంది. మరి హైకమాండ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలంటున్నారు.