కరోనా సాకుతో ధరలు పెంచినా..తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు – సీఎం జగన్

  • Published By: madhu ,Published On : March 20, 2020 / 07:32 AM IST
కరోనా సాకుతో ధరలు పెంచినా..తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు – సీఎం జగన్

కరోనా వైరస్‌ నిరోధం, ఇళ్ల పట్టాలపై జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రస్తుతం వైరస్ ప్రబలుతున్న క్రమంలో…నో టూ పానిక్‌… ఎస్‌ టూ ప్రికాషన్స్‌ అన్నది నినాదంగా ఉండాలని, ఆందోళన వద్దు.. జాగ్రత్తలతోనే రక్షణ ఉంటుదనే విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. తెలియని సమాచారం ఇచ్చినా, తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను ఆందోళనకు గురి చేస్తే మాత్రం గట్టి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సరుకులు కొరత వస్తుందన్న ఆందోళన అవసరం లేదని, దుకాణాలు అందుబాటులో ఉంటాయని..వాటిని మూసివేయడం జరగదన్నారు. ఈ విషయాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే.. నిత్యావసర వస్తువుల ధరలపై పర్యవేక్షణ చేయాలని, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా నిత్యావసర వస్తువులపై దృష్టి పెట్టాలన్నారు.(విశాఖలో కరోనా : భయపడొద్దు అంటున్న వైద్యులు)

ఒకవేళ కొంతమంది కరోనాను సాకుగా తీసుకుని ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందనే విషయాన్ని వ్యాపారస్తులకు తెలియచేయాలన్నారు. ప్రస్తుతం వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న కలెక్టర్లు, అధికారులు, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, ఆశావర్కర్లు, వాలంటీర్లను అభినందిస్తున్నట్లు తెలిపారు. వీరు చేపడుతున్న చర్యల కారణంగా కరోనాకు అడ్డుకట్ట పడుతోందన్నారు. వైరస్‌కు సంబంధించి సమాచారాన్ని అందుబాటులో ఉంచడమే కాకుండా..ప్రచారం నిర్వహించాలన్నారు. 

ప్రతి గ్రామ సచివాలయానికి ఒక ఏఎన్‌ఎం, ఇద్దరు ఆశావర్కర్లతో పాటు..ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ ఉన్నారన్నారు. వారి వారి ఫోన్లలో ఓ యాప్‌ను అందుబాటులోకి తేవడం జరిగిందని, ఈ యాభై ఇళ్లకు సంబంధించి డేటాను కలెక్ట్‌చేసి ఉంచుతున్నారని సమావేశంలో వెల్లడించారు. ఎవరైనా విదేశాలనుంచి వస్తే.. ఏ తేదీలో వచ్చారు, ఎప్పుడు వచ్చారు, అతని ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఆరోగ్య పరిస్థితి ఏంటన్నదానిపై వైద్య శాఖకు నిరంతరం డేటా పంపుతున్నట్లు తెలిపారు. తర్వాత ఆ డేటాను గ్రామ సచివాలయాల్లో ఉన్న ఏఎన్‌ఎం, ఆశావర్కర్లు అలర్ట్‌ అవుతూ..దగ్గర్లో ఉన్న ఆస్పత్రిని కూడా అలర్ట్‌ చేస్తున్నారన్నారు. 

కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. దాదాపుగా ట్రీట్‌మెంట్‌ తీసుకున్నట్టేనని, దీన్ని అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలకు తెలిపారు. జిల్లా స్థాయిల్లో టాస్క్‌ఫోర్సులు ఏర్పాటు, కలెక్టర్‌ను కన్వీనర్‌ను చేశామన్నారు. జిల్లా వైద్యాధికారి, డీసీహెచ్‌స్‌లు కూడా ఇందులో సభ్యులుగా ఉన్నారన్నారు. ఎస్సీలు, ఆర్‌ఎంలు, పంచాయితీ జిల్లా అధికారి, మున్సిపల్‌కమిషనర్‌లు… కూడా ఈ టాస్క్‌ఫోర్స్‌లో ఉన్నట్లు చెప్పారు. ప్రతిరోజూ కూడా క్రమం తప్పకుండా… టాస్క్‌ఫోర్స్‌ సమావేశం జరగాలి, నిరంతర పర్యవేక్షణ జరగాలని ఆదేశాలు జారీ చేశారాయన. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారిని రోజూ పర్యవేక్షించి, సోషల్‌ డిస్టెన్స్‌ కచ్చితంగా జరుగుతుందా? లేదా? అన్నదానిపై తప్పనిసరిగా పర్యవేక్షణ చేయాలన్నారు. 

ఆర్టీసీ బస్సులో నిండుగా ప్రయాణికులను తీసుకెళ్లడానికి వీల్లేదని, బస్సుల్లో శుభ్రత పాటిస్తున్నారా? వాటిని శానటైజ్‌ చేస్తున్నారా? లేదా? అన్నది చూడాలన్నారు. టాస్క్‌ ఫోర్స్‌ ఈ అన్ని అంశాలమీద దృష్టిపెట్టాలన్నారు. జిల్లా ఆస్పత్రులు, బోధనాసుపత్రుల్లో పెట్టిన ఐసోలేషన్‌ వార్డుల మీద కలెక్టర్లు తనిఖీలు చేసి పర్యవేక్షణ చేయాలన్నారు. 21 ఔషధాలు ఉంచాలని కేంద్ర ప్రభుత్వం, డబ్ల్యూహెచ్‌ఓ, ఐసీఎంఆర్‌ సూచిస్తోందనే విషయాన్ని ఆయన అధికారులకు తెలిపారు. 

పారాసిట్మల్‌ సరిపడా నిల్వలు ఉంచాలని, 6 యాంటీబయాటిక్స్‌ను అందుబాటులో ఉంచాలని కేంద్రం సూచించినట్లు వైద్య నిపుణులు తెలిపారు. జిల్లా ఆస్పత్రులు, టీచింగ్‌ ఆస్పత్రుల్లో పొటెక్టెడ్‌సూట్స్‌ ఉన్నాయా ? లేవా ? వెంటిలేటర్స్‌ ఉన్నాయా ? లేవా ? ఐసీయూ బెడ్స్‌ ఉన్నాయా ? లేవా ? అన్నది చూసుకుని ఆ మేరకు సన్నద్ధం కావాలని సీఎం జగన్ సూచించారు. చాలామంది ఎమ్మెల్యేలు మాస్కులు కావాలని అడుగుతున్నారని, మాస్క్‌లు కూడా పెట్టడం, ఏ రకంగా మాస్క్‌లను వినియోగించాలి? ఎప్పుడు వినియోగించాలి? అన్నదానిపై వారికి అవగాహన కలిగించాలన్నారు. వాడిన మాస్క్‌లను రోడ్డుమీద పడేస్తే మరింత ప్రమాదకరమని సీఎం జగన్ హెచ్చరించారు. 

ప్రస్తుతం దేశం మొత్తం మీద 191 పాజిటివ్‌ కేసులు ఉన్నాయని, ఏపీ రాష్ట్రంలో మూడే మూడు కేసులు వచ్చాయన్నారు. విదేశాలనుంచి వచ్చిన వారి నుండే కేసులు నమోదయ్యాయన్నారు. ఇటలీ, యూకే, సౌదీ నుంచి వచ్చారన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసినా 80.9శాతం మంది ఇళ్లల్లోనే ఉంటూ.. వైద్యం తీసుకోవడం ద్వారా నయం అయ్యిందన్నారు. 13.8 శాతం మంది మాత్రమే ఆస్పత్రుల్లో చేరుతున్నారని, 4.7 శాతం కేసులు మాత్రమే ఐసీయూలో ఉంచాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయని సీఎం జగన్ తెలిపారు. 

Read More : ఈసీ లేఖ నిజమే..రమేశ్ కుమార్‌కు భద్రత కల్పిస్తాం – కిషన్ రెడ్డి