కరోనా ఎఫెక్ట్, ఏపీలో 13 ప్రత్యేక జైళ్లు, ప్రభుత్వం కీలక నిర్ణయం

  • Published By: naveen ,Published On : July 8, 2020 / 07:27 AM IST
కరోనా ఎఫెక్ట్, ఏపీలో 13 ప్రత్యేక జైళ్లు, ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. రోజురోజుకి పాజిటివ్ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా వెయ్యికి పైగా కేసులు నమోదవుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ క్రమంలో జైళ్లలో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 13 కొవిడ్‌ ప్రత్యేక జైళ్లను ఏర్పాటు చేసింది. జిల్లాకో ప్రత్యేక కొవిడ్‌ జైలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా వచ్చే ఖైదీల వల్ల ఇతరులకు కరోనా సోకకుండా ఉండేందుకు ఈ జైళ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.

తొలుత మగ ఖైదీలను ప్రత్యేక జైళ్లకు తరలించి కరోనా పరీక్షలు:
ఇకపై వచ్చే మగ ఖైదీలను తొలుత ప్రత్యేక జైళ్లకు తరలించి అక్కడ కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. కరోనా లేదని తేలితేనే కోర్టు సూచించిన జైలుకు ఖైదీలను పంపనున్నారు. ప్రత్యేక జైలు సిబ్బందికి కరోనా సోకకుండా రక్షణ చర్యలు కల్పించాలని జైళ్ల శాఖ డీజీని ప్రభుత్వం ఆదేశించింది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, భీమవరం, మచిలీపట్నం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, డోన్‌, గుత్తి, పీలేరు, కావలి, మార్కాపురం జైళ్లను కొవిడ్‌ ప్రత్యేక జైళ్లుగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

record corona cases in andhra pradesh

ఖైదీలకు కరోనా వైరస్:
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రిమాండ్ ఖైదీలు కొందరికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. ఇప్పటివరకూ 4 జైళ్లలో ఖైదీలు కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఖైదీలను ఆసుపత్రికి తరలించారు. అలాగే జైళ్లలో పని చేసే పలువురు సిబ్బంది కూడా కరోనా బారినపడ్డారు. దీంతో ఆందోళన వ్యక్తమైంది. అలర్ట్ అయిన ప్రభుత్వం కొవిడ్ ప్రత్యేక జైళ్లను ఏర్పాటు చేసింది.

జైళ్లలో కరోనా కట్టడికి చర్యలు:
ఏప్రిల్ మొదటి వారంలో రాష్ట్రంలోని వివిధ జైళ్లలో ఉన్న సుమారు 600 మంది ఖైదీలను ఇంటీరియమ్ బెయిల్ పై విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా సాధారణ కేసుల్లో ఇరుక్కున్న వారిని అప్పట్లో విడుదల చేశారు. ఆ తర్వాత మళ్లీ మే మధ్యలో తిరిగి వారంతా జైళ్లకి చేరినట్టు అధికారులు ప్రకటించారు. అప్పట్లో కేసులు నమోదు కాకపోవడంతో అందరినీ తిరిగి జైళ్లకి తరలించారు. కానీ ప్రస్తుతం కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మరోసారి పెరోల్ పై పంపించే ప్రతిపాదన పరిశీలించాలని పలువురు కోరుతున్నారు. కరోనా కేసులు విస్తృతమవుతున్న సమయంలో ఖైదీల విషయంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వారిని మళ్లీ సొంత ఇళ్లకు పంపించే ఏర్పాట్లు చేయాలని మానవహక్కుల కౌన్సిల్ కోరింది.

Iran releases about 70,000 prisoners as coronavirus death toll reaches 237

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 4 సెంట్రల్ జైళ్లు (విశాఖ, రాజమహేంద్రవరం, కడప, నెల్లూరు) ఉన్నాయి. వాటితో పాటుగా జిల్లా జైళ్లు 8, స్పెషల్ సబ్ జైల్స్ 11, మహిళా జైలు 1, సబ్ జైళ్ళు 60 ఉన్నాయి. వాటిలో సుమారుగా 5వేల మంది ఖైదీలున్నారు. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన వెంటనే జైళ్ల శాఖ అప్రమత్తం కావడంతో పాటుగా పలు మార్పులు కూడా చేసినట్టు జైళ్ల శాఖ ఐజీ తెలిపారు.

రికార్డు స్థాయిలో 1178 కేసులు నమోదు:
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు నానాటికీ విస్తరిస్తున్నాయి. తాజాగా 1178 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం సంఖ్య 21,197కి చేరింది. ఇందులో 11వేల 200 కేసులు యాక్టివ్ గా ఉండగా, 9వేల 745 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇకపోతే, గడిచిన 24 గంటల్లో 13 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 252 కి చేరింది.

Read Here>>ఎల్జీపాలిమర్స్ ఘటనలో ముగ్గురు అధికారులపై వేటు