Vijayasai Reddy : మీ భర్త మీద కూడా అమిత్‌ షాకి ఫిర్యాదు చేశారా? లేదా? పురంధేశ్వరిని ప్రశ్నించిన విజయసాయిరెడ్డి

ఇంతకీ మీరు టీడీపీలో ఉన్నారా? లేక బీజేపీలో ఉన్నారా? మీ టాప్‌ ప్రయారిటీ మీ అవినీతి మరిదికి శిక్ష పడకుండా కాపాడుకోవటమే అని బాగా నిరూపిస్తున్నారు! Vijayasai Reddy

Vijayasai Reddy : మీ భర్త మీద కూడా అమిత్‌ షాకి ఫిర్యాదు చేశారా? లేదా? పురంధేశ్వరిని ప్రశ్నించిన విజయసాయిరెడ్డి

Vijayasai Reddy Questions Purandeswari (Photo : Facebook)

Vijayasai Reddy Questions Purandeswari : టీడీపీ నేత నారా లోకేశ్ కేంద్రహోంమంత్రి అమిత్ షాని కలవడం ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అక్రమ కేసులు పెట్టి చంద్రబాబుని, తనను వేధిస్తున్నారని జగన్ ప్రభుత్వంపై అమిత్ షాకి లోకేశ్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో లోకేశ్ వెంట ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా ఉండటం మరింత సెన్సేషన్ గా మారింది. అమిత్ షా తో లోకేశ్ భేటీపై స్పందించిన పురంధేశ్వరి.. జగన్ ప్రభుత్వం టార్గెట్ గా ట్వీట్ చేశారు.

జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, అందుకే చంద్రబాబుని అరెస్ట్ చేశారని, ఆ విషయాన్ని లోకేశ్ అమిత్ షాకు వివరించారు అంటూ పురంధేశ్వరి ట్వీట్ చేశారు. అంతే.. వైసీపీ నేతలు ఒక్కసారిగా భగ్గుమంటున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని టార్గెట్ చేశారు. తాజాగా దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పురంధేశ్వరిపై ప్రశ్నల వర్షం కురిపించారు విజయసాయిరెడ్డి.

Also Read : కోర్టు హాల్‌లోనే చంద్రబాబు, సీఐడీ లాయర్ల మధ్య వాగ్వాదం.. జడ్జి తీవ్ర ఆగ్రహం

”జాతీయ పార్టీ అయిన బీజేపీని ‘బావ’ సారూప్య పార్టీగా మార్చిన రాష్ట్ర అధ్యక్షురాలైన పురందేశ్వరి గారు! అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకున్న తరవాతే న్యాయస్థానం చంద్రబాబు అరెస్టును సమర్థించి, రిమాండ్‌ విధించింది. బాబు అరెస్టు, రిమాండ్‌ సరికాదన్న వాదనలను హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా తిరస్కరించాయి. సుప్రీంకోర్టు సీనియర్‌ అడ్వకేట్లు సిద్ధార్థ్‌ లూధ్రా, హరీష్‌ సాల్వే బాబు కోసం చేసిన వాదనలను న్యాయస్థానాలు తిరస్కరిస్తున్నాయి కాబట్టి.. ‘బ్లడ్‌ ఈజ్‌ థిక్కర్‌ దేన్‌ వాటర్‌’ అన్న విధంగా మీ మరిది కోసం మీరు రంగంలోకి దిగారు.

ఇన్ని ఆధారాలు కనిపిస్తుంటే దీన్ని రాష్ట్ర ప్రభుత్వ కక్ష సాధింపు అని మీరే అబద్ధం చెపుతూ, లోకేశ్‌ని వెంటబెట్టుకుని బాబు తరఫున మధ్యవర్తిత్వం చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ని కలిశారు. ఇంతకీ మీరు టీడీపీలో ఉన్నారా? లేక బీజేపీలో ఉన్నారా? మీరు గతంలో కాంగ్రెస్‌లో ఉన్నా, ఇప్పుడు బీజేపీలో ఉన్నానని అంటున్నా మీ టాప్‌ ప్రయారిటీ మీ అవినీతి మరిదికి శిక్ష పడకుండా కాపాడుకోవటమే అని బాగా నిరూపిస్తున్నారు!

Also Read : పురంధేశ్వరికి చేతులు జోడించి నమస్కరిస్తున్నా.. వాళ్లు కలిసినప్పుడు.. వీళ్లు కలిస్తే తప్పేంటి?

పురంధేశ్వరి గారు! బాబు అవినీతికి శిక్ష పడాలి. బాబు అవినీతికి ఆధారాలన్నీ చూపిస్తూ అరెస్టు జరిగింది. బాబు అవినీతిని రాష్ట్ర సీఐడీ, కేంద్ర ఈడీ, కేంద్ర ఐటీ నిర్ధారించాయి. అలాంటప్పుడు బాబుకు మీ మద్దతు అంటే దాని అర్థం ఏమిటి? మీది నేరానికి మద్దతా? లేక చట్టానికి మద్దతా? బాబుకు 17-ఏ సెక్షన్‌ వర్తిస్తుందని.. ఆ సెక్షన్‌ ప్రకారం గవర్నర్‌ అనుమతి తీసుకునే అరెస్టు చేయాలని బాబు లాయర్లు వాదిస్తున్నారు తప్ప, బాబు ఏ నేరం చేయలేదని.. ఏ విచారణకైనా సిద్ధం అని మాట వరసకు కూడా అనటం లేదు! ఇలాంటి అవినీతి బాగోతంలో మీరంతా మీ కుటుంబంగా, బాబు జనతా పార్టీగా చంద్రబాబు వైపు నిలబడ్డారు!

మరి ఈ అవినీతి బాగోతంలో తాము ఎటువైపు నిలబడాలన్నది భారతీయ జనతా పార్టీ తేల్చుకోవాలి! మరో విషయం కూడా. చంద్రబాబు అవినీతి గురించి, దుర్మార్గాల గురించి మీ భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు గతంలో రాసిన ‘‘ఒక చరిత్ర కొన్ని నిజాలు’’ అన్న పుస్తకాన్ని అమిత్‌ షా గారికి ఇచ్చారా? లేక ఆ పుస్తకం మీద, మీ ఆయన మీద కూడా మీరు, లోకేశ్‌ కలిసి అమిత్‌షా గారికి ఫిర్యాదు చేశారా? అన్నది కూడా మా రాష్ట్ర ప్రజలకు తెలియజేయండి” అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.