ఏపీలో 30 లక్షల 75 వేల ఇళ్ల పట్టాలు పంపిణీ..17,004 వైఎస్ఆర్ జగనన్న కాలనీలు

ఏపీలో 30 లక్షల 75 వేల ఇళ్ల పట్టాలు పంపిణీ..17,004 వైఎస్ఆర్ జగనన్న కాలనీలు

Distribution of places of 30 lakh 75 thousand houses in AP :  రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల 75 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని..ఇందుకు రూ.50,940 కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. రెండు దశల్లో రూ.50,940 కోట్లు ఖర్చు పెట్టబోతున్నామని పేర్కొన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం రెండు వారాలపాటు సాగునుందని తెలిపారు. శుక్రవారం (డిసెంబర్ 25, 2020) తూర్పుగోదావరి జిల్లా కొమరగిరిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. వైఎస్ ఆర్ జగనన్న ఇళ్లపట్టాల పైలాన్ ను ఆవిష్కరించారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15.60 లక్షల ఇళ్లను నిర్మించేందుకు ఈరోజే శ్రీకారం చుడుతున్నామని చెప్పారు.

టిడ్కో ద్వారా మహిళలకు ఇళ్లపట్టాలు ఇస్తున్నామని చెప్పారు. 2.62 లక్షల టిడ్కో ఇళ్లకు సేల్ అగ్రిమెంట్ కూడా అందించబోతున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 17,004 వైఎస్ఆర్ జగనన్న కాలనీలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. మరో రూ.7 వేల కోట్లతో కాలనీల్లో మౌళిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. కాలనీల్లో అంగన్ వాడీ కేంద్రాలు, స్కూళ్లు, పార్కులు నిర్మిస్తున్నామని తెలిపారు. పేదలకు సొంత ఇళ్లపై మేనిఫెస్టోలో హామీ ఇచ్చామని పేర్కొన్నారు. 25 లక్షల ఇళ్లు కట్టిస్తామని మేనిఫెస్టోలో చెప్పామని తెలిపారు. ఇచ్చిన హామీకి మించి ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు.

ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలన్నింటినీ నెరవేరుస్తున్నామని చెప్పారు. అర్హత మాత్రమే ప్రాతిపదిక కావాలన్నారు. మనకు ఓటు వెయ్యని వారికి కూడా ఇళ్లు ఇస్తున్నామని తెలిపారు. 2011 లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 4 కోట్ల 95 లక్షల మందని…ఇళ్ల పంపిణీతో కోటి 24 లక్షల మందికి లబ్ధి జరుగుతోందన్నారు. గతంలో 224 చదరపు అడుగుల్లో ఇంటిని నిర్మించే వారని…ఇప్పుడు 340 చదరపు అడుగుల్లో ఇంటిని నిర్మిస్తున్నామని తెలిపారు.

గ్రామాల్లో ఒకటిన్నర సెంట్లలో ఇంటి నిర్మాణం ఉంటుందన్నారు. గ్రామాల్లో ఒకటిన్నర సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో సెంట్ స్థలంలో ఇంటి నిర్మాణం ఉంటుందన్నారు. స్థలం ఇవ్వడమే కాదు..ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. ఇంటిలో బెడ్ రూమ్, లివింగ్ రూమ్, కిచెన్, వరండా,బాత్ రూమ్ ఉంటాయన్నారు.

68,361 ఎకరాల భూమిలో ఇళ్ల స్థలాల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కుల, మత, పార్టీలకతీతంగా ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతుందన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీలో రాజకీయాలకు తావులేదన్నారు. మనం కట్టేది ఇళ్లు కాదు..ఊళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. రూ.25,530 కోట్ల మార్కెట్ల విలువ చేసే భూములను అక్కాచెల్లెమ్మలకు పంపిణీ చేయబోతున్నామని పేర్కొన్నారు.