Kodi Pandalu : బరికి సై అంటున్న పందెం కోళ్లు…వద్దంటున్న పోలీసులు

కోర్టు ఆదేశాల ప్రకారం కోడి పందేలు నిర్వహించకూడదని పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.. పందేం కోళ్ళ పెంపకం దారులు, కోడి కత్తుల తయారీ దారులపై....

Kodi Pandalu : బరికి సై అంటున్న పందెం కోళ్లు…వద్దంటున్న పోలీసులు

Kodi

Kodi Pandalu Celebration : సంక్రాంతి బరికి సై అంటూ పందెం కోళ్లు కాలు దువ్వుతున్నా యి… ప్రత్యేక శిక్షణ శిబిరాల్లో రాటుదేలి ఈ సంక్రాంతికి నువ్వా నేనా అంటూ తొడగొడుతున్నాయి పందేం కోళ్లు.. ఆంక్షలున్నా సరే తగ్గేదేలే అంటూ పందెం రాయుళ్లు రెడీ అయిపోయారు..అయితే…కోర్టు ఆదేశాల ప్రకారం కోడి పందేలు నిర్వహించకూడదని పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.. పందేం కోళ్ళ పెంపకం దారులు, కోడి కత్తుల తయారీ దారులపై దాడులు జరిపి భారీ మొత్తంలో కోళ్ళను, కత్తులను స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో పందెం రాయుళ్ళను పిలిచి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. అయినా కానీ కోడి పందేల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తూనే వచ్చారు. ఆర్ధిక, రాజకీయ పలుకుబడి ఉపయోగించి పోలీసులు, మీడియాను అటువైపు రానీవ్వకుండా కోడి పందేలు నిర్వహించడానికి రెడీ అయ్యారు.

Read More : Surya Namaskaralu : కోటి మందితో సూర్య నమస్కారాలు

పందెం నీదా..నాదా :
జిల్లాలో రోజూ ఎక్కడో ఒక చోట కోడి పందేల స్ధావరాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. పందెం రాయుళ్ళు పట్టుబడుతూనే ఉన్నారు. ఎలాగైనా పందెం కొట్టాలన్న కసితో పందెం నీదా.. నాదా అంటూ ఎంత ఖర్చుకైనా వెనకాడడం లేదు పందెం రాయుళ్లు. కోడి పందేలంటేనే గోదావరి జిల్లాలు. ఈ జిల్లాల్లో పండుగ మూడు రోజులు పందెం బరులు తిరునాళ్లను తలపిస్తాయి. ఇక కోడి పందేలను వీక్షించేందుకు ఇతర రాష్ట్రాల నుంచే కాదు, దేశ విదేశాల నుంచి ఎన్నారైలు గోదావరి జిల్లాలకు తరలివస్తారు. పందేల్లో డబ్బు సంపాదించాలని కొందరు… తమ సత్తా చాటాలని మరికొందరు పుంజులను బరుల్లోకి దింపుతారు. ఈ ఏడాది కూడా పందేలు భారీ ఎత్తున నిర్వహించేందుకు పందెంరాయుళ్లు సిద్ధమయ్యారు.

Read More : Chandrababu: చంద్రయ్య పాడె మోసిన చంద్రబాబు

మూడు రోజుల పాటు పందేలు : 
మూడు రోజుల పాటు జరిగే పందేల్లో కోట్ల రూపాయలు చేతులు మారనున్నాయి.. ఏపీ నుంచే గాకుండా తెలంగాణ నుంచి కూడా ఇప్పటికే పందెం రాయుళ్లు భారీగానే ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలకు చేరుకున్నట్టు తెలుస్తోంది.. సాంప్రదాయ క్రీడ పేరుతో కోడి పందేలను నిర్వహించడానికి మినీ స్టేడియంలను తలపించే విధంగా పందెం బరులను ఏర్పాటు చేస్తున్నారు. ఎల్ఈడి స్క్రీన్లు, ఫ్లడ్ లైట్ల వెలుగులో గుండాట, పేకాటలతో పందేలను రక్తి కట్టించడానికి భారీ ఏర్పాట్లు చేశారు. కోర్టు ఎన్ని ఆదేశాలు ఇచ్చినా, పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా ప్రతీ ఏటా ఈ ప్రాంతంలో కోడి పందేలు యధావిధిగా నిర్వహిస్తూనే వస్తున్నారు… నిజానికి సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచే చాలా గ్రామాల్లో కోడి పందేలు ప్రారంభమయ్యాయి.

Read More : Road Accident : పండగపూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో నలుగురు కూలీలు మృతి

బరులు మినీ స్టేడియాలను తలపిస్తున్నాయి : 
తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ రూరల్, కరప మండలాల్లో భారీగా పందెం బరులను ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల ఈ బరులు మినీ స్టేడియాలను తలపిస్తున్నాయి.. ఎల్‌ఈడి స్క్రీన్లపై కోడి పందేలను వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు. వేలాది వాహనాలను పార్క్‌ చేసే విధంగా వందలాది ఎకరాల్లో పార్కింగ్ స్థలాలను కూడా సిద్ధం చేశారు. వీటన్నింటితో పాటు కోడి పందేల స్థావరాల సమీపంలో మద్యాన్ని పారించడానికి కూడా స్థానిక మద్యం వ్యాపారులు సిద్ధమవుతున్నారు. గతేడాది ఏడాది సంక్రాంతికి సుమారు 2 వేల కోట్లకు పైగా కోడి పందేలు జరిగాయని తెలుస్తోంది.