దివీస్‌ ల్యాబ్‌కు నిరసన సెగ.. భూములు సేకరించొద్దంటూ రైతుల ఆందోళన

దివీస్‌ ల్యాబ్‌కు నిరసన సెగ.. భూములు సేకరించొద్దంటూ రైతుల ఆందోళన

Farmers protest against Divis Lab : తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయిపేట పంచాయతీ పరిధిలో నిర్మించే దివీస్‌ లేబొరేటరీకి స్థానికుల నుంచి నిరసన సెగ తగిలింది. తమ భూములను సేకరించొద్దంటూ దివీస్‌కు వ్యతిరేకంగా అన్నదాతలు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

దివీస్‌ లేబొరేటరీ నిర్మాణాలు కొనసాగిస్తుండడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా దివీస్‌ లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. రైతులు, వామపక్షనేతలను అదుపులోకి తీసుకున్నారు.

దివీస్‌కు భూములు సేకరించి ఇవ్వాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. కంపెనీ ఆధీనంలో ఉన్న 200 ఎకరాల్లో ఈ నెల 7న లేబొరేటరీ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని దివీస్‌ నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యే సీఎం పర్యటనకు ఏర్పాటు చేసేందుకు కలెక్టర్‌ తొండంగికి వెళ్లారు.

ఈ నేపథ్యంలో దివీస్‌కు వ్యతిరేకంగా మళ్లీ ఉద్యమం మొదలైంది. గురువారం చేపట్టిన నిరసన ప్రదర్శన ఉద్రిక్తంగా మారింది. ప్రదర్శనల్లో పాల్గొన్న ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేయగా… వారిని విడుదల చేయాలని రైతులు పట్టుబట్టారు.

అప్పటి వరకు వెనక్కి తగ్గేది లేదంటూ దివీస్‌ గేటు ముందు బైఠాయించారు. దివీస్‌ లేబొరేటరికీ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో కనిపించిన వాటిని ధ్వంసం చేశారు. కంపెనీకి చెందిన ప్రహరీని కూలగొట్టారు. గోడను నేలమట్టం చేశారు. కంపెనీ పరిసరాల్లోని కంటైనర్‌కు నిప్పుపెట్టారు. రేకులషెడ్డు, జనరేటర్‌ను సైతం ధ్వంసం చేశారు.

తొండంగి మండలం కొత్తపాకల గ్రామ సమీపంలో దివీస్‌ లేబొరేటరీ ఏర్పాటుకు ఆ సంస్థ నిర్ణయించింది. దశల వారీగా 1,500 కోట్ల పెట్టబడి పెట్టాలని నిశ్చయించింది. ఇందులోభాగంగా 500 ఎకరాల వరకు భూములు సేకరించి ఇవ్వాలని ఏపీఐఐసీని దివీస్‌ కోరింది. దీంతో ఆ సంస్థ అన్నదాతల నుంచి సేకరణ మొదలుపెట్టింది. అతికష్టంపై 200 ఎకరాల వరకు 2015లో సేకరించారు.

మిగిలిన రైతులు ససేమిరా అన్నారు. దివీస్‌కు వ్యతిరేకంగా 2016 నుంచి ఉద్యమిస్తున్నారు. అప్పటి నుంచి ఇక్కడ రైతులు ఉద్యమం కొనసాగుతూనే ఉంది. నిన్న కలెక్టర్‌ అక్కడికి రావడంతో రైతులు మరోసారి ఆందోళన చేపట్టారు. ఇవాళ్టి నుంచి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు.