మద్యం తాగి కారు డ్రైవింగ్..నలుగురి మృతి : ఒక చేతిలో స్టీరింగ్‌, మరో చేతిలో బీరు సీసాతో డ్రైవింగ్‌

మద్యం తాగి కారు డ్రైవింగ్..నలుగురి మృతి : ఒక చేతిలో స్టీరింగ్‌, మరో చేతిలో బీరు సీసాతో డ్రైవింగ్‌

Four killed in road accident : డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేయోద్దని నెత్తినోరు కొట్టుకుని చెబుతున్నా వినడం లేదు కొందరు. తప్ప తాగి వాహనాలతో రోడ్లపైకి వస్తున్నారు. నెత్తికెక్కిన నిషాలో సర్రుమని దూసుకెళ్తున్నారు. ఇలాంటి వారి నిర్లక్ష్యం వల్ల ఇతరుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కారణంగా అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెనుకొండ మండలం ఎర్రమంచి సమీపంలోని కియాకార్ల పరిశ్రమ ప్రధాన గేటు వద్ద లారీని కారు ఢీ కొట్టింది. మద్యం మత్తు కారణంగా కారులో ఉన్న నలుగురు అక్కడిక్కడే చనిపోయారు.

ప్రమాదానికి గురైన కారులో డ్రైవింగ్‌ సీటులో కూర్చున్న వ్యక్తి చేతిలో బీరు సీసా ఉంది. మద్యం తాగుతూ అతడు డ్రైవింగ్ చేశాడు. కుడి చేత్తో స్టీరింగ్‌ పట్టుకుని ఎడమ చేతిలో బీరు సీసా పట్టుకుని కారుని పరిగెత్తించాడు. బెంగళూరు నుంచి ఇదే విధంగా డ్రైవింగ్‌ చేస్తూ వస్తున్నారు. అయితే కియా కార్ల పరిశ్రమ ప్రధాన గేటు వద్ద వాహనాలు నెమ్మదిగా వెళ్లేందుకు స్పీడ్‌ బ్రేకర్‌ ఏర్పాటు చేశారు. ముందుగా వెళ్తున్న లారీ డ్రైవర్‌ స్పీడ్‌ బ్రేకర్,‌ సైన్‌ బోర్డు చూసి వేగం తగ్గించాడు.

అప్పటికే మద్యం మత్తులో ఒంటి చేత్తో కారును డ్రైవ్‌ చేస్తున్న వ్యక్తి… అటు స్పీడ్ బ్రేకర్‌ సైన్‌ బోర్డును కానీ, ముందుగా వెళ్తున్న లారీ స్లో అవుతున్న విషయాన్ని పట్టించుకోలేదు. మద్యం మత్తులో ముందు జరుగుతున్నదేంటో అంచనా వేయలేకపోయాడు. చేతిలో బీరు సీసా ఉండటం నిషా నషాళానికి తాకడంతో కారుపై అదుపు కోల్పోయాడు. అంతే క్షణాల్లో జెట్‌ స్పీడ్‌తో దూసుకొచ్చిన ఆ కారు లారీ వెనుక భాగాన్ని గట్టిగా ఢీ కొట్టింది.

ప్రమాదం తీవ్రతకి కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. లారీ వెనుక భాగంలో కారు ఇరుక్కుపోయింది. పోలీసులు జేసీబీ సాయంతో కారును బయటకు తీశారు. కారులో కూర్చున్న నలుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. సీట్లలో కూర్చున్నవారు అక్కడిక్కడే చనిపోయారు. కారులో ప్రతీ సీటు దగ్గర మద్యం బాటిళ్లు ఉన్నాయి. బీరు, వైన్‌, షాంపెన్‌, విస్కీ ఇలా అన్ని రకాల మద్యం బాటిళ్లను కారులో వేసుకుని … డ్రింకింగ్‌ అండ్‌ డ్రైవింగ్‌ అన్నట్టుగా కారును నడిపారు. ప్రమాదం జరిగే సమయానికి ఇందులో కొన్ని బాటిళ్లు ఖాళీ అవగా మరికొన్ని పగిలిపోయి ఉన్నాయి. పీకల దాక మద్యం సేవించి బాధ్యత లేకుండా డ్రైవింగ్‌ చేసి చివరకు ప్రాణాలు కోల్పోయారు.

ఈ ప్రమాదంలో ఢిల్లీకి చెందిన ఓ యువతి, బెంగళూరుకు చెందిన ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతదేహాల వద్ద లభించిన గుర్తింపు కార్డుల ఆధారంగా… చనిపోయిన వారిని రేఖ , ఆంచల్ సింగ్, మహబూబ్ ఆలం, మనోజ్ మిట్టల్‌ గా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను కుటుంబ సభ్యులకు ఫోన్‌ ద్వారా తెలియజేశారు పోలీసులు. మృతదేహాలను పెనుగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సైన్‌ బోర్డులు మొదలు సినిమా థియేటర్ల వరకు ప్రతీ చోట డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ వద్దని విస్త్రృత ప్రచారం ప్రచారం చేస్తున్నా.. కొందరిలో ఇంకా మార్పు రావడం లేదు. తాజా ఘటనలోనూ మృతులందరూ ఇతర ప్రాంతాల వారే. కుటుంబ సభ్యులు వచ్చే వరకు వారి మృతదేహాలకు మార్చురీనే దిక్కు. సరదా కోసమో, సాహసం పేరు చెప్పో … తప్పతాగి వాహనం నడిపి .. ముప్పై ఏళ్లు కూడా నిండకముందే ఇలా అర్ధాంతరంగా తనువు చాలించారు.