టీడీపీ కంచుకోట విశాఖలో ఆ నలుగురి చూపు.. వైసీపీ వైపు?

  • Published By: sreehari ,Published On : December 28, 2019 / 11:42 AM IST
టీడీపీ కంచుకోట విశాఖలో ఆ నలుగురి చూపు.. వైసీపీ వైపు?

విశాఖలో తెలుగుదేశం పార్టీ పరిస్థితులు రోజురోజుకు మారిపోతున్నాయి. ఎన్నికల తర్వాత స్తబ్ధుగా ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు అవకాశం చిక్కడంతో మెల్లగా పక్క చూపులు చూడడం మొదలుపెట్టారట. పార్టీ ఆవిర్భావం నుంచి ఉత్తరాంధ్ర ముఖద్వారమైన విశాఖ తెలుగుదేశానికి కంచుకోటలా ఉంది. బీసీ జనాభా అత్యధికంగా ఉన్న ఈ ప్రాంతంలో టీడీపీ సత్తా ఏమిటో గత పొలిటికల్ హిస్టరీ చూస్తే అర్థమవుతుంది. అయితే గత ఎన్నికల్లో ఆ పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. గ్రామీణ ప్రాంతంలో 11 నియోజకవర్గాల పరిధిలో ఒక్క సీటును కూడా టీడీపీ గెలుచులేకపోయింది.

అవకాశం దొరికితే చాలు జంపే :
మరోవైపు అర్బన్ ప్రాంతంలో విశాఖ ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ స్థానాలను మాత్రమే టీడీపీ గెలుచుకోవడంతో కాస్త ఊరట లభించింది. దీంతో పట్టణంలో పట్టు ఉండటంతో క్యాడర్ కాస్తా ఆశలు పెంచుకున్నారు. మునిసిపల్‌ ఎన్నికల్లో సత్తా చూపించవచ్చని అనుకున్నారు. కానీ, గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, గంటా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేశ్ కుమార్, గణబాబులు ఫలితాల తర్వాత నుంచి పార్టీతో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. ఎక్కడైనా అవకాశం వస్తే దొరికితే చాలు జంపైపోదామనే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం జోరుగానే సాగింది. ఆ అవకాశం ఇప్పుడు రాజధాని రూపంలో వచ్చిందంటున్నారు.

ఆ నలుగురికి ఒకే సాకు :
టీడీపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీకి నాలుగు స్థంభాల్లా ఉంటారనుకున్న కార్యకర్తలకు షాక్‌ తగిలేలా కనిపిస్తోంది. విశాఖపట్టణాన్ని ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌గా జగన్‌ ప్రకటించడంతో.. దానిని ఆసరా చేసుకొని మన ప్రాంతం కోసం జగన్‌ పాటు పడుతున్నారు బట్టి, ప్రాంత అభివృద్ధి కోసం వైసీపీలో చేరాలని భావిస్తున్నాం అని చెప్పుకోవడానికి ఆ నలుగురికీ ఒక సాకు దొరికిందంటున్నారు. నలుగురు ఎమ్మెల్యేలు ఈ మధ్య కాలంలో వ్యవహరిస్తున్న తీరు ఇందుకు బలన్నాస్తోంది. పార్టీ అధినాయకత్వం ఆదేశాలను ఏమాత్రం ఖాతరు చేయడం లేదు.

వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమించాలని సాక్షాత్తు అధినేత చంద్రబాబు రంగంలోకి దిగి టెలికాన్ఫరెన్స్ ద్వారా, ఫోన్ల ద్వారా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇసుక కొరతపైనా, ఉల్లి కష్టాలు, ఆర్టీసీ చార్జీలు పెంపు, ఇంగ్లీషు మీడియం వంటి అంశాలపై వైసీపీ తీరును, ముఖ్యమంత్రి జగన్ వైఖరిని తప్పుబడుతూ వీధివీధినా ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారు.

అయినా సరే విశాఖలో ఒక్క తూర్పు నియోజకవర్గం మినహా మరే నియోజకవర్గంలోనూ నేతలు కనీసం స్పందించలేదు. తూర్పులో కుడా ఎమ్మేల్యే కాకుండా ఉత్సాహవంతులైన కొద్ది మంది కార్యకర్తలు అక్కడక్కడా పని చేశారేమో గానీ నేతలెవరూ పత్తా లేరు.

వైసీపీలో చేరేందుకు సిద్ధం? :
అధికారంలో ఉన్నప్పడు పదవులు వెలగబెడుతూ చక్కర్లు కొట్టిన నేతలు, ఇప్పుడు పార్టీ అధికారానికి దూరమైన వెంటనే మరీ ఇంత ఘరోంగా చూడాలా అని కార్యకర్తలు ఫీలవుతున్నారు. ప్రత్యర్థి పార్టీల కంటే కూడా ఘోరంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతారంటూ గత కొద్ది కాలంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా సరే ఎన్నడూ ఖండించడం లేదు.

ఇప్పుడు ఏకంగా జగన్‌ నిర్ణయాన్ని సమర్థిస్తూ మీటింగులు కూడా పెడుతున్నారు. బీజేపీ నేతలతో తిరిగిన ఆయన ఇప్పుడు వైసీపీలో చేరడానికి మార్గాన్ని సిద్ధం చేసుకుంటున్నారట. ఇక ఆయనతో పాటు మిగిలిన ఎమ్మెల్యేలను కూడా తీసుకెళ్లేందుకు ప్లాన్లు వేసుకుంటున్నారట.

ఇక నగరంలో ఇలా ఉంటే జిల్లాలో మరీ దారుణంగా ఉంది. సీనియర్ నాయకులు అయ్యన్నపాత్రుడు ఇంట్లో అన్నదమ్ముల మధ్య రాజకీయ పితలాటకం మొదలైంది. పీలా గోవింద్, వంగలపూడి అనిత, బండారు సత్యనారాయణమూర్తి లాంటి వారు ఉన్నా లేనట్లుగానే వ్యవహరిస్తున్నారు.

కార్యకర్తలను కూడా పట్టించుకోవడం లేదంట. దీంతో వారంతా రాజకీయాల నుంచి ప్రస్తుతానికి దూరంగా ఉండిపోతున్నారు. ఇలా అధినాయకుడు మాట కుడా లెక్క చేయకపోవడంతో నగరానికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారడం తథ్యమనే అంటున్నారు. అదే జరిగితే విశాఖ జిల్లాలో టీడీపీకి ప్రధాన నాయకులు లేక డీలా పడిపోవడం ఖాయమే.