వైసీపీలోకి గల్లా ఫ్యామిలీ? పొలిట్‌ బ్యూరోకి గల్లా అరుణ రాజీనామా చేయడానికి కారణం అదేనా?

  • Edited By: naveen , October 12, 2020 / 11:20 AM IST
వైసీపీలోకి గల్లా ఫ్యామిలీ? పొలిట్‌ బ్యూరోకి గల్లా అరుణ రాజీనామా చేయడానికి కారణం అదేనా?

galla aruna kumari: తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. అమర్‌రాజా బ్యాటరీస్ అధినేత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గల్లా అరుణకుమారి వ్యవహార శైలి ప్రస్తుతం ఎవరికీ అంతుపట్టడం లేదు. ఆమె సడన్‌గా పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేయడం చర్చనీయాంశం అయ్యింది. త్వరలో పార్టీ రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు కానున్న సమయంలో పూర్తి నిర్ణయాధికారం అధినేతకే వదిలేసినట్లు అరుణకుమారి తెలిపారు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా పార్టీలో ఉత్సాహంగా పని చేయలేకపోతున్నానని, కొత్తవారికి అవకాశం కల్పించేందుకే రాజీనామా చేస్తున్నట్లు చెబుతున్నారు.

కాంగ్రెస్ కనుమరుగు కావడంతో టీడీపీలోకి గల్లా:
మరోపక్క, ఆమె తనయుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ కూడా పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ హోదాలో పొలిట్‌బ్యూరోలో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాల్లో గల్లా అరుణ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

2018లో ఆమెను పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా చంద్రబాబు నియమించారు. గల్లా ఫ్యామిలీది మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగింది. అయితే, రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కావడంతో టీడీపీలో తనయుడు జయదేవ్‌తో పాటు అరుణ టీడీపీలో చేరారు. గుంటూరు నుంచి 2014, 2019లో పార్లమెంటుకు ఎన్నికయ్యారు జయదేవ్‌.

పొలిట్‌ బ్యూరోకి రాజీనామా చేయడానికి కారణం అదేనా?
గల్లా అరుణ కుటుంబానికి టీడీపీలో ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ ఎందుకు పొలిట్‌ బ్యూరోకి రాజీనామా చేశారనే చర్చ పార్టీలో జరుగుతోంది. అరుణ చెబుతున్న కారణాలు నిజమేనా? రాష్ట్ర కమిటీ మరో రెండు రోజుల్లో ప్రకటించబోతున్న తరుణంలో రాజీనామా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే చర్చ జోరందుకుంది. పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈసారి కొత్తవారిని పొలిట్‌బ్యూరోలోకి తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారని, అందుకే అరుణ ఈ నిర్ణయం తీసుకున్నారని కొందరు నేతలు చెప్పుకొస్తున్నారు. కమ్మ సామాజికవర్గం నుంచి మరొకరిని తీసుకోవాలని అధినేత భావిస్తున్నారని, ఈ మెసేజ్ ఆమెకి చెప్పడంతో రాజీనామా చేశారని మరికొందరు నేతలు అంటున్నారు.

వైసీపీలోకి గల్లా ఫ్యామిలీ?
గతంలో ఒకేసారి తల్లి తనయులను పొలిట్‌బ్యూరోలోకి తీసుకోవటంపై విమర్శలు కూడా వచ్చాయి. గుంటూరు పార్లమెంట్ అధ్యక్ష పదవిని కూడా గల్లా సూచించిన శ్రావణ్‌కు ఇచ్చారని, చిత్తూరు జిల్లాలో అరుణ అనుచరవర్గానికి ప్రాధాన్యం దక్కలేదనే అసంతృప్తి ఆమెలో ఉందేమోనని అనుమానిస్తున్నారు. అంతే కాకుండా మొన్నటి వరకు గల్లా జయదేవ్ సైతం బీజేపీకి దగ్గర అవుతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

గల్లా కుటుంబాన్ని అధికార పార్టీ కూడా టార్గెట్ చేసింది. అమర్ రాజా కంపెనీకి గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూములను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ఒకానొక దశలో గల్లా ఫ్యామిలీ వైసీపీ వైపు చూస్తున్నట్టుగా ప్రచారం సాగింది.

ప్రచారాలు నమ్మొద్దన్న గల్లా జయదేవ్:
గల్లా జయదేవ్ మాత్రం ఇలాంటి ప్రచారాలు నమ్మవద్దని తమ అనుచరులకు ఒక మెసేజ్ పంపించారు. గుంటూరు వచ్చి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రచారాలకు ఫుల్ స్టాప్ పెడతా అంటున్నారట జయదేవ్. రాజకీయాలకు రిటైర్మెంట్ అనేది ఉండదని, పరిస్థితులు అనుకూలించినంత వరకూ కొనసాగుతారని వేదాంతం చెబుతున్నారు కొందరు నేతలు. గల్లా అరుణ టీడీపీ పొలిట్‌బ్యూరోకి ఎందుకు రాజీనామా చేశారనే విషయం కూడా తేలిపోతుందని అంటున్నారు.