Godavari Floods: ఉగ్ర గోదావరి.. భద్రాద్రి వద్ద 67అడుగులకు చేరిన నీటిమట్టం.. ఏపీలోని లోతట్టు ప్రాంతాల్లో హైఅలర్ట్

గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఎగువనున్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరి, దాని ఉప నదులు ఉప్పొంగుతున్నాయి. ఫలితంగా ఉప్పెనలా గోదావరి విరుచుకుపడుతుంది. భద్రాచలం వద్ద గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. గంటగంటకు గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 7గంటల సమయానికి 67 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరింది.

Godavari Floods: ఉగ్ర గోదావరి.. భద్రాద్రి వద్ద 67అడుగులకు చేరిన నీటిమట్టం.. ఏపీలోని లోతట్టు ప్రాంతాల్లో హైఅలర్ట్

Godavari Flood

Godavari Floods: గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఎగువనున్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరి, దాని ఉప నదులు ఉప్పొంగుతున్నాయి. ఫలితంగా ఉప్పెనలా గోదావరి విరుచుకుపడుతుంది. భద్రాచలం వద్ద గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. గంటగంటకు గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 7గంటల సమయానికి 67 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరింది. వరద ఉధృతి ఇలానే కొనసాగితే.. 24 గంటల్లో 75 నుంచి 80 అడుగులకు చేరే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది.

Godavari Flood (1)

గోదావరికి 21లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. దిగువకు 21,47,381 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మధ్యాహ్నం వరకు నీటిమట్టం 70 అడుగులకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో 48గంటలు చాలా కీలకమని అధికారులు భావిస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే భద్రాచలం వద్ద బ్రిడ్జిపై రాకపోకలు నిషేధించారు. 48గంటల పాటు ఆంక్షలు విధించారు. భద్రాచలం పట్టణం వ్యాప్తంగా 144 సెక్షన్ ను పోలీసులు అమలు చేస్తున్నారు. వరద ఉధృతి పెరుగుతుండటంతో 62 గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. 3,001 కుటుంబాలను 48 పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు వెంటనే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ఎలాంటి ఆపద వచ్చిన సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ అధికారులకు సూచించారు.

Polavaram

Polavaram

ఇదిలాఉంటే ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. పోలవరం వద్ద 16లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతుంది. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. అనేక గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. మరోవైపు కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలను ఖాళీ చేయించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రస్తుతం 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మూడవ ప్రమాద హెచ్చరిక జారీ అయితే 31,382 కుటుంబాలపై ప్రభావం పడుతుంది. ప్రజలు ఒప్పుకోక పోతే బలవంతంగా ఖాళీ చేయించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఏ క్షణమైనా మూడో ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Godavari (1)

ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 18.46 లక్షల క్యూసెక్కులుగా ఉంది. గోదావరి వరద ఉధృతిని విపత్తుల శాఖ స్పెషల్ సిఎస్ జి.సాయిప్రసాద్, ఎండి బి. ఆర్ అంబేద్కర్ లు కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. వరద ప్రవాహం 22 నుంచి 23 లక్షల క్యూసెక్కులు చేరుకునే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. 22 లక్షల క్యూసెక్కులకు వరద ప్రవాహం చేరితే ఆరు జిల్లాల్లోని 42 మండలాల్లో 554 గ్రామాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 20, తూర్పుగోదావరి లో ఎనిమిది మండలాలపై వరద ప్రభావం ఉంటుంది. అల్లూరిసీతారామరాజు జిల్లాలో ఐదు, పశ్చిమ గోదావరి జిల్లాలో నాలుగు మండలాలపై వరద ప్రభావం ఉంటుంది. ఏలూరులో 3, కాకినాడ 2 మండలాలపై వరద ప్రభావం ఉంటుందని అధికారులు తెలిపారు.

Badrachalam

ఎప్పటికప్పుడు నిరంతరం వరద పరిస్థితిపై కలెక్టర్లకు సూచనలు చేస్తున్నారు. వరద ఉదృతం దృష్ట్యా ముందస్తుగా అదనపు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. సహాయక చర్యల్లో మొత్తం ఎనిమిది ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయి. గోదావరి ఉగ్రరూపం దాల్చుతున్న క్రమంలో గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.