మున్సిపల్ ఎన్నికల వేళ టీడీపీలో అంతర్గత విభేదాలు..

మున్సిపల్ ఎన్నికల వేళ టీడీపీలో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. విజయవాడ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

మున్సిపల్ ఎన్నికల వేళ టీడీపీలో అంతర్గత విభేదాలు..

Internal conflicts in TDP : మున్సిపల్ ఎన్నికల వేళ టీడీపీలో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. విజయవాడ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలోనూ వర్గపోరు సమసిపోలేదు. విజయవాడలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు చంద్రబాబు. ఈ ప్రచారంలో ఎక్కడా విజయవాడ ఎంపీ కేశినేని కనిపించకపోవడం చర్చకు దారి తీసింది.

కొంతకాలంగా విజయవాడలో ఎంపీ కేశినేని నానితో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు పొసగడం లేదు. దీనిపై ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరగగా రెండు వారాల క్రితం చంద్రబాబు సర్థిచెప్పారు. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో కేశినేని నాని ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ, నాగుల్‌ మీరాలు మీడియా సమావేశం పెట్టి మరీ తమ అసంతృప్తి వెళ్లగక్కారు. కనీసం చంద్రబాబు పర్యటన రూట్‌ మ్యాప్‌ వివరాలు కూడా కేశినేని నాని తమకు ఎందుకు ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెంటనే మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత.. బోండా, బుద్దా, నాగుల్ మీరాతో చర్చలు జరిపారు. కలిసి పనిచేద్దామని, టీడీపీ గెలుపునకు కృషి చేద్దామని విజ్ఞప్తి చేశారు. అందుకు వారు కూడా అంగీకారం తెలిపారు. వివాదం సమసిపోయిందనుకుంటున్న తరుణంలో.. ఎంపీ కేశినేని నాని చంద్రబాబు పర్యటనలో కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

చివరకు చంద్రబాబు పర్యటనలో రూట్‌మ్యాప్‌ రూపొందించిన కేశినేని కనిపించలేదు. మరోవైపు బాబు పర్యటన గురించి సమాచారం లేదన్న బుద్దావెంకన్న ఇతర నేతలు పర్యటనలో చంద్రబాబు వెన్నంటే ఉన్నారు. బాబు సూచలన మేరకే కేశినేని నాని బాబుతో పాటు రోడ్‌షోలో పాల్గొనలేదంటున్నాయి టీడీపీ వర్గాలు.

శనివారం చోటు చేసుకున్న వివాదంతో పాటు మేయర్ అభ్యర్థిగా కేశినేని శ్వేతను ప్రమోట్ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రోడ్‌షోలో టీడీపీ లీడర్లు బుద్దా వెంకన్న, జలీల్‌ఖాన్‌కు చురకలంటించారు చంద్రబాబు. నాయకులు వెనక్కి వెళ్లి అభ్యర్థులను తన పక్కన నిలబెడితే.. నాలుగు ఓట్లు ఎక్కువ పడతాయన్నారు చంద్రబాబు.