ఏపీలో గ్రామ సచివాలయాల పనితీరు భేష్…కర్ణాటక బృందం

  • Published By: murthy ,Published On : November 29, 2020 / 07:11 AM IST
ఏపీలో గ్రామ సచివాలయాల పనితీరు భేష్…కర్ణాటక బృందం

Karnataka team in Anantapur to study village secretariats : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటైన గ్రామ సచివాలయాల వ్యవస్థ దేశానికే ఆదర్శమని కర్ణాటక రాష్ట్ర పంచాయతీరాజ్‌ అధికారుల బృందం ప్రశంసలు కురిపించింది. సచివాలయాల పనితీరును పర్యవేక్షించటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు జాయింట్‌ కలెక్టర్‌ స్థాయి అధికారిని నియమించటం, సచివాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించ తలపెట్టడం వంటి చర్యలను అభినందించింది.
karnataka team 2ప్రజల జీవన ప్రమాణాలను దగ్గర నుండి పరిశీలిస్తూ, వారికి ప్రభుత్వ పథకాలు చేరవేసే సులభమైన విధానం సచివాలయ వ్యవస్థ అనే విషయం నిరూపితమైందని కర్ణాటక రాష్ట్ర పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ప్రియాంక మేరీ ఫ్రాన్సిస్‌ కొనియాడారు.



కర్ణాటక ప్రభుత్వం కూడా ఇలాంటి గ్రామ,వార్డ్ సెక్రటేరియట్ వ్యవస్ధను అమలు చేయడానికి ప్రణాళికలు రూపోందిస్తోంది. అందుకు గాను ఏపీ లో అమలవుతున్న సచివాలయ వ్యవస్థ పనితీరును పరిశీలించేందుకు కమిషనర్‌ నేతృత్వంలోని కర్ణాటక ఉన్నతాధికారుల బృందం అనంతపురంలో పర్యటించింది.

సోమందేపల్లి మండల కేంద్రంలో సచివాలయం–3ని సందర్శించి, వెలుగు కార్యాలయంలో సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లతో మాట్లాడారు. చిలమత్తూరు మండల కేంద్రంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) పరిశీలించారు.



మండలంలోని కోడూరు మన్రోతోపులో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని చూశారు. అనంతరం చిలమత్తూరు రైతుభరోసా కేంద్రంలో సచివాలయ ఉద్యోగులు, గ్రామ వలంటీర్లతో ముఖాముఖిగా మాట్లాడారు. సచివాలయాలు, ఆర్బీకేల్లో అందుతున్న సేవలు, పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు.

karnataka team 1సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు ప్రజలతో తమ అనుభవాలు వివరిస్తున్నప్పుడు కమిషనర్‌ ప్రియాంక భావోద్వేగానికి లోనయ్యారు. సచివాలయ ఉద్యోగులు మాట్లాడుతూ వలంటీర్ల సహకారం లేకపోతే తాము ఇంత తక్కువ కాలంలో ఇంతటి విజయాన్ని సాధించలేమంటూ కరోనా కష్టకాలంలో వైద్య సిబ్బందితో కలసి తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా వలంటీర్లు చేసిన సేవలను వివరించారు. అనంతరం కమిషనర్‌ ప్రియాంక మాట్లాడారు.



సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నట్లు గుర్తించామని…..2వేల జనాభాకు ఒక సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు, 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ ఏర్పాటు చారిత్రక నిర్ణయమని ఆమె కొనియాడారు.

సచివాలయాల ఏర్పాటు ద్వారా నాలుగు లక్షల పై చిలుకు ఉద్యోగాలు ఆషామాషీ కాదని….. ఇది నిరుద్యోగులకు గొప్ప వరం అని ఆమె పేర్కోన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు ఇంటి వద్దనే లభ్యమవడం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్‌ రైతులు అదృష్టవంతులనిపిస్తోందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. మహిళల సంక్షేమం కోసం సచివాలయానికో మహిళా సంరక్షకురాలి ఏర్పాటు అభినందనీయని ఆమె అన్నారు.