ప్రెస్‌మీట్‌లు కాదు.. పార్టీ పైకి తీసుకురావడం గురించి ఆలోచించండి: నాని

ప్రెస్‌మీట్‌లు కాదు.. పార్టీ పైకి తీసుకురావడం గురించి ఆలోచించండి: నాని

విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని రీసెంట్ ట్వీట్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. దీని టార్గెట్ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడేనంటూ విమర్శలు చేస్తున్నారు. ఇలా సొంతపార్టీపైనే ట్వీట్లు చేయ‌డం నానికి కొత్త‌ేం కాదు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోర ఓట‌మి చ‌విచూసిన త‌ర్వాత కొంత‌కాలం నాని ట్వీట్లు టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేశాయి.

కృష్ణా జిల్లాలో టీడీపీ ఘోర ప‌రాజ‌యానికి తమ పార్టీ నేత‌లే కార‌ణ‌మంటూ… ముఖ్యంగా దేవినేని ఉమా మ‌హేశ్వర‌రావు, ఎమ్మెల్సీ బుడ్డా వెంక‌న్న‌ను ప‌రోక్షంగా తీవ్ర‌స్థాయిలో ఎండ‌గ‌ట్టారు. ఈ ట్వీట్లపై సొంత విశ్లేషణలు చేస్తూ.. కేశినేని నాని బీజేపీలో చేరుతార‌ంటూ ప్ర‌చారం కూడా చేశారు.

మ‌రోసారి కేశినేని నాని రీసెంట్ గా చేసిన ట్వీట్ వైర‌ల్ అయింది. టీడీపీ అధినేత చంద్ర‌బాబును ఉద్దేశించి ప‌రోక్షంగా ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌డ‌మే ఇందుకు కారణం. ఇంతకీ ఆ ట్వీట్ లో ఏముందో తెలుసా..

“మన కలలు మనమే సాకారం చేసుకోవాలి. మన కలలు ఎదుటి వారు సాకారం చేయాలని కోరుకోవడం అవివేకం. ఈ రాష్ట్ర భ‌విష్య‌త్ కోసం క‌న్న క‌ల అమరావతి. అది సాకారం అవ్వాలంటే 2024 లో మ‌ళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలి. ఆ దిశగా పార్టీలో అందరూ క‌ష్ట‌ప‌డి ప‌ని చేయాలి. మీడియా సమావేశాలు, ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌ల వ‌ల్ల ప్రయోజనం లేదు” అని నాని ట్వీట్ చేశారు.

ఇటీవ‌ల చంద్ర‌బాబు వీడియోలో మీడియాతో మాట్లాడటం, నేత‌ల‌తో చ‌ర్చించ‌డం, ప్ర‌భుత్వ విధానాల‌పై ట్విట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టన‌లతో రాజ‌కీయాల‌ను స‌రిపెడుతున్నారనే ఉద్దేశ్యం కాబోలు. టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేశ్ కూడా తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. ప్రస్తుతం కష్టకాలంలో ఉన్న పార్టీని గట్టెక్కించాలనే ఉత్సాహంలో లోకేశ్‌ కనిపించడం లేదు.

సొంత పార్టీ శ్రేణుల‌కు, కొంత మంది నేత‌ల‌కు త‌మ నేత ట్వీట్ నొప్పి కలిగించ‌వ‌చ్చ‌ని, అయితే అందులోని వాస్త‌వాన్ని గ్ర‌హించి త‌ప్పుల‌ను స‌రిదిద్దుకుంటే తిరిగి మంచి రోజులు వ‌స్తాయ‌ంటూ కేశినేని నాని అనుచ‌రులు సూచిస్తున్నారు.