కరోనా వైరస్ : కర్నూలు జ్యోతి వచ్చేస్తోంది

  • Published By: madhu ,Published On : February 26, 2020 / 12:09 PM IST
కరోనా వైరస్ : కర్నూలు జ్యోతి వచ్చేస్తోంది

కరోనా వైరస్ ఎఫెక్ట్ తో చైనాలోని వూహాన్ లో చిక్కుకున్న కర్నూలు యువతి జ్యోతిని.. ఇండియాకు తీసుకురానున్నారు. 2020, ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం విమానంలో భారత్‌కు వస్తునట్లు జ్యోతి తమ కుటుంబ సభ్యులతో చెప్పడంతో అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జ్యోతి ఇండియాకు వస్తునట్లు ఫోన్ వచ్చిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కరోనా వైరస్ విజృంభించడంతో.. చైనాలోని చిక్కుకున్న భారతీయులను స్వదేశం చేర్చేందుకు మొదట రెండు ఎయిరిండియా విమానాలు అక్కడకు వెళ్లాయి.

కానీ.. జ్యోతిని తీసుకొచ్చేందుకు అధికారులు నిరాకరించారు. ఆమెకు కరోనా వైరస్ సోకిన లక్షణాలు ఉన్నాయని అందుకే ఆమెను తీసుకురావడం లేదని విమాన సిబ్బంది తెలిపారు. దీంతో కుంటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అయితే తనకు స్వల్ప జ్వరం మాత్రమే వచ్చిందని.. కరోనా సోకలేదని, తనను వెంటనే భారత్‌కు చేర్చాలని ఆమె సెల్ఫీ వీడియోలో భారత ప్రభుత్వాన్ని కోరింది. అటు ఆమె తల్లిదండ్రులు, కాబోయే భర్త అమరనాథ్ రెడ్డి కూడా భారత అధికారులను అభ్యర్థించారు.

మరోవైపు వివాహం కూడా వాయిదా పడింది. చివరకు వూహాన్ చేరిన ఎయిరిండియా విమానం.. ఇతర భారతీయులతో పాటు అన్నెం జ్యోతిని కూడా ఇండియాకు తీసుకొని వస్తునట్లు తెలుస్తోంది. ఇటీవలే సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన జ్యోతి ట్రైనింగ్ కోసం చైనాలోని వూహాన్ నగరానికి వెళ్లింది. అదే సమయంలో కరోనా వైరస్ విజృంభించడంతో ఆమె అక్కడే చిక్కుకపోయింది. చివరకు ఆమెకు కరోనా లేదని తెలియడంతో.. భారత్ కు తీసుకు వస్తోంది. 

కరోనా వైరస్ చైనా నుంచి ఇరాన్ మీదుగా మిడిల్ఈస్ట్ దేశాలను చుట్టేస్తోంది. ఇప్పటికి ఈ మహమ్మారి బారిన పడినవారి సంఖ్య 80వేలు దాటిపోయింది. ఓ వైపు చైనాలో ఈ వైరస్ ప్రతాపం కాస్త తగ్గిందనుకుంటే సౌత్‌కొరియాలో విజృంభించడం ప్రారంభమైంది. మరోవైపు అమెరికాలోని మోడెర్నా అనే బయోటెక్ సంస్థ కరోనాకి వేక్సిన్ తయారు చేసినట్లు ప్రకటించింది. 

Read More : బ్రేకింగ్ న్యూస్ : ఆరోగ్య శాఖ మంత్రికి కరోనా వైరస్