లాక్ డౌన్ కొత్త మార్గదర్శకాలు వలసకూలీలు,విద్యార్ధులు,యాత్రికులు ఇంటికెళ్లవచ్చు

  • Published By: venkaiahnaidu ,Published On : April 29, 2020 / 01:51 PM IST
లాక్ డౌన్ కొత్త మార్గదర్శకాలు వలసకూలీలు,విద్యార్ధులు,యాత్రికులు ఇంటికెళ్లవచ్చు

లాక్ డౌన్ కారణంగా ఆయా రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు, కార్మికులు, విద్యార్థులు, పర్యాటకులు..కరోనా వైరస్ లక్షణాలు లేకుంటే తిరిగి తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవచ్చని కేంద్రం తెలిపింది. లాక్ డౌన్ విధించిన దాదాపు 5వారాల తర్వాత ఇవాళ(ఏప్రిల్-29,2020) అంతరాష్ట్ర ప్రయాణాలకు అనుమతి తెలుపుతూ కేంద్ర హోంశాఖ పలు మార్గదర్శకాలను విడుదల చేసింది.

COVID-19 లక్షణాలు లేని వలసకార్మికులను ఇంటికి వెళ్ళడానికి అనుమతించాలని కోరుతూ దాఖలైన అనేక పిటిషన్లను విచారిస్తున్న సుప్రీంకోర్టు…ఈ ఇష్యూపై స్పందించాలని కేంద్రాన్ని కోరిన ఒక రోజు తర్వాత ఈ ఆర్డర్ వచ్చింది. అందరికీ పరీక్షలు నిర్వహించిన తర్వాతే కరోనా లక్షణాలు లేని వ్యక్తుల తరలింపును చేపట్టవచ్చని హోంశాఖ రాష్ట్రాలకు తెలిపింది. తరలింపు ప్రక్రియలో రెండు రాష్ట్రాల అనుమతి తప్పనిసరి అని హోంశాఖ తెలిపింది.

ఈ మేరకు అన్ని రాష్ర్టాలు నోడల్‌ అధికారులను నియమించుకోవాలని సూచించింది. తరలించే సమయంలో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. బస్సులను సైతం శానిటైజ్‌ చేసి నిబంధనలు పాటించాలని హోంశాఖ తెలిపింది.  దేశవ్యాప్త లాక్‌డౌన్‌ మరో నాలుగు రోజుల్లో ముగుస్తుందనగా కేంద్ర హోంశాఖ అంతరాష్ట్ర ప్రయాణాలపై ఈ మార్గదర్శకాలు జారీ చేసింది.

హర్యానాలో చిక్కుకుపోయిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వలసకార్మికులను తిరిగి రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు గత వారం ఉత్తరప్రదేశ్‌కు అనుమతి ఇచ్చిన తరువాత,బీహార్,జార్ఖండ్ వంటి రాష్ట్రాలు దీన్ని తప్పుబట్టాయి. లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన కిందకే ఇది వస్తుందని అన్న విషయం తెలిసిందే.