ఏలూరులో మాయదారి రోగం….పెరుగుతున్న బాధితుల సంఖ్య

  • Published By: murthy ,Published On : December 5, 2020 / 09:44 PM IST
ఏలూరులో మాయదారి రోగం….పెరుగుతున్న బాధితుల సంఖ్య

many people fell illness eluru,west godavari district  : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పడమర వీధిలో పలువురు అస్వస్ధతకు గురై కళ్లు తిరిగి పడిపోవటం కలకలం సృష్టించింది. శుక్రవారం రాత్రి ముగ్గరు పడిపోగా, శనివారం మరో 8 మంది అస్వస్ధతకు గురయ్యారు.  ఈవిషయంపై వెంటనే స్పందించిన వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఆళ్లనాని వైద్య సిబ్బందిని, అంబులెన్స్ల్ ల ను పడమర వీధికి పంపించారు.

అస్వస్ధతకు గురైన వారిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి ఆరోగ్య సర్వే నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారులు పడమర వీధి వద్దే ఉండి పరిస్ధితి సమీక్షిస్తున్నారు. శనివారం రాత్రి వరకు సుమారు 100 మంది ప్రభుత్వ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. వీరంతా గుర్తు తెలియని రోగంతో కళ్లు తిరిగి పడిపోవటం… లేదా మూర్ఛవచ్చినట్లు కింద పడిపోతున్నట్లు గుర్తించారు. వీరి రక్తనమూనాలు పరీక్షలకు పంపారు.


అవి వస్తే కానీ వ్యాధిని గుర్తించలేమని వైద్యులు చెపుతున్నారు. కాగా ఆస్పత్రిలో చేరిన వారిలో ఒక పాప పరిస్ధితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. మరో 22 మంది పరిస్ధితి నిలకడగా ఉంది. మంత్రి ఆళ్లనాని ఆస్పత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు.


బాధితుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో నగరంలోని ప్రయివేట్ ఆస్పత్రులను కూడా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని చికిత్స చేయించే ఉద్దేశంలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. పడమరవీధి, దక్షిణపు వీధి, కొత్తపేట, వంగాయగూడెం, కొబ్బరితోట ప్రాంతాల్లో అత్యధికులకు అస్వస్థతకు గురవతున్నట్లు తెలుస్తోంది.