ఏలూరులో అంతుచిక్కని వ్యాధి…నీటిలో ఎలాంటి బ్యాక్టిరీయా లేదని ఎయిమ్స్ రిపోర్టు

  • Published By: bheemraj ,Published On : December 11, 2020 / 05:47 PM IST
ఏలూరులో అంతుచిక్కని వ్యాధి…నీటిలో ఎలాంటి బ్యాక్టిరీయా లేదని ఎయిమ్స్ రిపోర్టు

mystery illness in eluru aiims report : ఏలూరు అంతు చిక్కని వ్యాధిపై సీఎం జగన్ సమీక్ష ముగిసింది. గాలి, నీటిలో లెడ్, నికెల్ ఎక్కువ మోతాదులో అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అలాగే.. ఆహార పదార్థాల్లో మెర్క్యురీ ఉన్నట్లుగా తేలిందని హెల్త్ కమిషనర్ కాటంనేని భాస్కర్‌ చెప్పారు. నీటిలో ఎలాంటి బ్యాక్టీరియా లేదని ఎయిమ్స్ రిపోర్ట్ వెల్లడించదని తెలిపారు. రైస్‌లో మెర్క్యురీ ఉందని ఎయిమ్స్ రిపోర్ట్ లో పేర్కొన్నట్లు చెప్పారు.

అంతకముందు ఏలూరు అంతుచిక్కని వ్యాధి ఘటనలో భూగర్భ జలశాఖ తన పరీక్షల వివరాలను వెల్లడించింది. క్లోరిన్ అధిక మోతాదులో ఉన్నట్టు గుర్తించింది. ఏలూరులో సేకరించిన మున్సిపల్ ట్యాప్ వాటర్ శాంపిల్స్‌ను పరీక్షించగా.. ఉండాల్సిన దానికంటే నీటిలో ఎక్కువ మోతాదులో క్లోరిన్ ఉన్నట్టు గుర్తించింది.

బాధిత ప్రాంతాల్లోని 12 చోట్ల శాంపిల్స్‌ సేకరించినట్లు భూగర్భ జలశాఖ వెల్లడించింది. అంతేకాక.. ట్యాంక్‌ పరిసర ప్రాంతాల్లో మద్యం బాటిల్స్‌ను కూడా గుర్తించారు. మద్యం మత్తులో క్లోరిన్‌ను అధిక మోతాదులో కలిపి ఉండవచ్చునని కూడా భావిస్తున్నారు.

అంతుచిక్కని అనారోగ్యం.. ఏలూరు ప్రజలను ఇంకా వేధిస్తోంది. ఇప్పటికే వందల మంది బాధితులు ఈ వ్యాధి కారణంగా ఆస్పత్రి పాలయ్యారు. ఈ వ్యాధి కారణంగా ఆస్పత్రిలో చేరి.. మెరుగైన చికిత్స కోసం విజయవాడకు వచ్చిన బాధితుల్లో ఇద్దరు మృతి చెందారు.

మృతులు సుబ్బరావమ్మ, అప్పారావు వింత వ్యాధి కారణంగా ఆస్పత్రిలో చేరినప్పటికీ.. వాళ్లు చనిపోవడానికి అసలు కారణం వేరే ఉందని వైద్యులు చెబుతున్నారు. సుబ్బరావమ్మ కరోనాతో, అప్పారావు ఊపిరితిత్తుల సమస్యతో మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఈ ఇద్దరి మరణంతో ఏలూరు వింత వ్యాధి కారణంగా చనిపోయిన వారి సంఖ్య మూడుకు చేరింది.

వింత వ్యాధి బారినపడ్డ బాధితుల సంఖ్య 609కి చేరింది. ఇప్పటివరకు 543 మంది రోగులను డిశ్చార్జ్‌ చేయగా.. ప్రస్తుతం 32 మంది ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న మరో 33 మంది గుంటూరు, విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.

మరోవైపు ఏలూరు వింత వ్యాధికి కచ్చితమైన కారణాలను కనుక్కునేందుకు కేంద్ర వైద్య బృందాలు, ప్రఖ్యాత సంస్థల నిపుణులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రధానంగా తాగునీటి వల్ల అస్వస్థత వచ్చిందా.. లేదా? అనే విషయంపై దృష్టి సారిస్తున్నారు.