Narsapuram Lok Sabha Constituency : రాజుల ఖిల్లా నర్సాపురంలో ఆసక్తిరేపుతున్న రాజకీయాలు….వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోటీ తప్పదా?
తాడేపల్లిగూడెంలో మంత్రి కొట్టు సత్యనారాయణ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాపు సామాజికవర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఇదీ ఒకటి. మంత్రి కొట్టు సత్యనారాయణపై ఆరోపణలు వినిపిస్తున్న వేళ.. ఫ్యాన్ పార్టీ గ్రాఫ్ తగ్గుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయ్.

Narsapuram
Narsapuram Lok Sabha Constituency : వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణం రాజు.. సొంత పార్టీ మీద తిరుగుబాటు జెండా ఎగురవేసినప్పటి నుంచి నరసాపురం పార్లమెంట్ రాజకీయం నానా విధాల మలుపులు తిరుగుతోంది. ప్రస్తుత రాజకీయ పరిమామాలు పరిశీలిస్తే.. చిత్ర విచిత్రంగా పాలిటిక్స్ మారడం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీకి రివర్స్ అయిన రఘురామ.. మళ్లీ ఎంపీగా పోటీ చేస్తానని అంటున్నారు. మరి ఇప్పుడు ఆయన ఏ పార్టీ నుంచి బరిలో దిగుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే నియోజకవర్గంపై టీడీపీ, జనసేన, బీజేపీ.. ప్రత్యేకంగా దృష్టిసారించాయ్. గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన నాగబాబు మళ్లీ అదృష్టం పరీక్షించుకుంటారా.. హీరో ప్రభాస్ కుటుంబాన్ని బీజేపీ టార్గెట్ చేస్తోందా.. అసలు టీడీపీ వ్యూహం ఏంటి.. పార్లమెంట్ సంగతి సరే… అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏం జరుగుతోంది. పవన్ మళ్లీ భీమవరం బరిలో నిలుస్తారా.. టీడీపీ, జనసేన పొత్తు కుదిరితే పొలిటికల్ సీనే మారిపోనుందా.. ఈ రెండు పార్టీలు కలిస్తే వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తప్పదా.. 2019 ఫలితాల నుంచి టీడీపీ, జనసేన పాఠాలు నేర్చుకున్నాయా..

nagababu, raghuramakrishnamraju
రఘురామ తిరుగుబాటుతో వైసీపీ అభ్యర్థి ఎవరు ?…నాగబాబు మళ్లీ అదృష్టం పరీక్షించుకుంటారా ?
నరసాపురం పార్లమెంట్.. ఇది రాజుల ఖిల్లా.. రాజకీయం తెలిసిన జిల్లా ! వైసీపీ మీద ఎప్పుడయితే రఘురామ తిరుగుబాటు జెండా ఎగురవేశారో.. అప్పటి నుంచి మొదలు.. రాజకీయం రకరకాల మలుపులు తిరుగుతోంది. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్. ఇలాంటి పరిణామాల మధ్య నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ రాజకీయం ఈసారి చిత్ర విచిత్ర పరిణామాలకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయ్. నరసాపురం అంటే.. ఏపీలో ఓ లోక్‌సభ నియోజకవర్గమే కాదు.. ఓ పార్టీకి సెంటిమెంట్.. మరోపార్టీకి ఎమోషనల్ అటాచ్‌మెంట్ ! పవన్ ఓడింది ఇక్కడే.. నాగబాబును పరాజయం పలకరించింది ఇక్కడే… కంచుకోటపై టీడీపీ పట్టు కోల్పోయింది ఇక్కడే ! మూడున్నరేళ్లలో రాజకీయం పూర్తిగా మారిపోయింది. దీంతో ఇప్పుడేం జరగబోతోందన్న ఆసక్తి ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది.
READ ALSO : Araku Lok Sabha Constituency : రాజకీయాలకు వార్ జోన్‌గా మారిన అరకు….ఆంధ్రా ఊటీ లో హాట్ హాట్ గా రాజకీయాలు
మళ్లీ ఎంపీగా ఏపార్టీ నుండి రఘురామకృష్ణరాజు పోటీచేస్తారన్న విషయంపై అందరిలో ఆసక్తి…
నరసాపురం పార్లమెంట్ స్థానంలో రఘురామకృష్ణం రాజు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. వైసీపీ నుంచి గెలిచిన ఆయన ఇప్పుడు వైసీపీ అంటేనే కస్సుమంటున్నారు. ఆయనను అధికారికంగా పార్టీ దూరం పెట్టకపోయినా.. పార్టీకి ఆయన, ఆయనకు పార్టీ దూరం అయినట్లే ! అయినా సరే వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఎంపీగా పోటీ చేస్తానని రఘురామ ప్రకటించడం ఆసక్తికర పరిణామాలకు దారి తీస్తోంది. ఏ పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తారనే టెన్షన్ కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, జనసేన మధ్య త్రిముఖ పోటీ కనిపించింది. టీడీపీ నుంచి శివరామరాజు పోటీ చేయగా.. జనసేన అభ్యర్థిగా మెగాబ్రదర్ నాగబాబు పోటీ చేశారు. బీజేపీ నుంచి మాణిక్యాలరావు, కాంగ్రెస్ నుంచి కనుమూరి బాపిరాజు, ప్రజాశాంతి పార్టీ నుంచి కేఏ పాల్ పోటీ చేసి డిపాజిట్లు దక్కించుకోలేకపోయారు. ఐతే ఈసారి ఏ పార్టీ నుంచి ఎవరు బరిలోకి దిగుతారన్నది ఆసక్తికరంగా మారింది.

gokaraju ramaraju
వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారన్నదానిపై నెలకొన్న సందిగ్ధం….
రఘురామ తిరుగుబాటు తర్వాత.. ఇక్కడ వైసీపీకి భారీ షాక్ తగిలినట్లు అయింది. ఎంపీగా గెలిచిన తర్వాత కొద్దిరోజులు మాత్రమే ఎంపీగా రఘురామ జనాలకు అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. 2024లో మళ్లీ పోటీ చేసేందుకు రఘురామ రెడీ అవుతున్నారు. టీడీపీ లేదా బీజేపీ తీర్థం పుచ్చుకొని ఆయన పార్లమెంట్ బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. నరసాపురం పార్లమెంట్ ఇంచార్జి గోకరాజు రామరాజును పోటీకి దించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఓ బడా పారిశ్రామికవేత్త లేదా పార్లమెంట్ పరిధిలోని సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో క్షత్రియ సామాజికవర్గానికి చెందిన వారిని రంగంలోకి దించాలని వైసీపీ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ పరిధిలో పెద్దగా అభివృద్ధి జరగలేదనే విమర్శలు ఉన్నాయ్. నరసాపురంలో అడుగుపెట్టనీయం అంటూ రఘురామకు వైసీపీ ఎమ్మెల్యేలు సవాళ్లు విసరడం.. ఆయన దూరంగా ఉండడం.. నియోజకవర్గంలో అభివృద్ధి జరగకపోవడం.. వైసీపీకి మైనస్‌గా మారే అవకాశాలు ఉన్నాయ్.

krishnam raju
నరసాపురం మీద బీజేపీ ప్రత్యేక శ్రద్ధ… కృష్ణంరాజు ఫ్యామిలీ నుంచి ఒకరిని పోటీలో దించాలని ప్లాన్ !
టీడీపీ నుంచి ప్రస్తుతానికి ఎవరి పేరు వినిపించడం లేదు. ఐతే గత సైకిల్ పార్టీ తరఫున పోటీ చేసిన శివరామరాజు.. ఈసారి అసెంబ్లీ బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రచారం కూడా మొదలుపెట్టారు. టీడీపీ, జనసేన మధ్య పొత్తు దాదాపు కన్ఫార్మ్ అయినట్లు కనిపిస్తున్నాయ్. అదే జరిగితే ఇక్కడి నుంచి జనసేన పోటీ చేస్తుందా.. టీడీపీ అభ్యర్థి బరిలో ఉంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఐతే ఈ పొత్తులో బీజేపీ చేరితే ఒకలా.. చేరకపోతే మరోలా రాజకీయం మారే అవకాశం ఉంది. నరసాపురం మీద బీజేపీ ప్రత్యేక శ్రద్ధ చూపించినట్లు కనిపిస్తోంది. సింగిల్‌గా వెళ్లాల్సి వచ్చినా సరే.. ఇక్కడ సత్తా చాటాలని పావులు కదుపుతోంది. నరసాపురం పరిధిలో బీజేపీ నేతలు వరుస పర్యటనలు చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో బీజేపీకి మంచి పట్టు ఉంది. కమలం పార్టీ తరఫున కృష్ణంరాజు ఒకసారి.. గోకరాజు గంగరాజు ఒకసారి విజయం సాధించారు. ఐతే ఒంటరిగా బరిలోకి దిగాల్సి వస్తే.. కృష్ణంరాజు ఫ్యామిలీ నుంచి ఎవరినైనా పోటీలో ఉంచితే ఎలా ఉంటుందనే చర్చ కూడా బీజేపీ నేతల్లో నడుస్తోంది.
నరసాపురం పార్లమెంట్ పరిధిలో నరసాపురం అసెంబ్లీతో పాటు ఆచంట, పాలకొల్లు, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలు ఉన్నాయ్. అక్కడి పరిస్ధితులేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ramanaidu
టీడీపీకి కంచుకోటగా పాలకొల్లు…2024లో టీడీపీ నుంచి నిమ్మల పోటీ ఖాయం
పాలకొల్లు నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. నిమ్మల రామానాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. జనాలకు అందుబాటులో ఉండే నేతగా ఆయనకు మంచి పేరు ఉంది. వినూత్న కార్యక్రమాలతో వైసీపీ విధానాలను ఎండగడుతూ తన మార్క్ రాజకీయం చేస్తున్నారు. గెలుపుగుర్రం అని ఆయనకు పేరు. 2024లో టీడీపీ నుంచి మళ్లీ ఆయనే పోటీ చేయడం దాదాపు ఖాయం. వైసీపీ నుంచి కవురు శ్రీనివాస్ నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయ్. జనసేన, బీజేపీకి ఇక్కడ బలమైన అభ్యర్థులు లేరు. టీడీపీ, జనసేన పొత్తు కుదిరితే.. సైకిల్ జోరును అడ్డుకోవడం ఇక్కడ వైసీపీకి పెద్ద సవాలే అనడంలో ఎలాంటి అనుమానం లేదు.

pavankalyan, srinivas
భీమవరం నుండి పవన్ మళ్లీ పోటీ చేసే చాన్స్….మరోసారి బరిలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంధి
నరసాపురం పార్లమెంట్ పరిధిలో భీమవరం నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. 2019లో పవన్ ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గ్రంధి శ్రీనివాస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఏ పార్టీ నుంచి ఎవరు ఇక్కడ బరిలోకి దిగుతారన్నది సస్పెన్స్‌గానే మిగిలింది. నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి జరగకపోవడం.. అధికార పార్టీకి మైనస్‌గా మారింది. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తీరు మీద జనాల్లోనూ అసంతృప్తి ఉండడంతో.. ఆయన స్థానంలో వేరొకరిని బరిలోకి దింపే ఆలోచన వైసీపీ చేస్తోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయ్. భీమవరం నుంచి పవన్ మళ్లీ పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయ్. భీమవరానికి పవన్ దూరంగా ఉండాలి అనుకుంటే.. జనసేన నుంచి కొటికలపూడి గోవిందరావు పోటీ చేసే అవకాశాలు ఉంటాయ్. టీడీపీ నుంచి పులపర్తి ఆంజనేయులుతో పాటు తోటా సీతారామలక్ష్మి టికెట్ రేసులో ఉన్నారు. జనసేన, టీడీపీ పొత్తు కుదిరితే.. భీమవరం ఏ పార్టీకి కేటాయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఎదుర్కోవడం వైసీపీకి అతిపెద్ద సవాల్‌గా మారడం ఖాయం అనే చర్చ జరుగుతోంది.
READ ALSO : Bapatla Lok Sabha Constituency : సాగరతీరంలో కాక రేపుతున్నరాజకీయాలు.. బాపట్ల రాజకీయాలు చాలా హాట్ గురూ !

ramaraju
ఉండి టీడీపీలో భారీగా టికెట్ ఫైట్…సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుతో పాటు..మాజీ ఎమ్మెల్యే శివరామరాజు పోటీకి ఆసక్తి
టీడీపీకి కంచుకోటలాంటి మరో నియోజకవర్గం ఉండి. టీడీపీ నుంచి గెలిచిన మంతెన రామరాజు.. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2024కు టీడీపీ నుంచి ఇక్కడ స్ట్రాంగ్ టికెట్ ఫైట్ కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుతో పాటు.. మాజీ ఎమ్మెల్యే శివరామరాజు కూడా ఇక్కడి నుంచి బరిలో దిగేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే ఎవరికి వారు జనాల్లోకి వెళ్లిపోయారు. టీడీపీకి మంచిపట్టు ఉన్న ఈ నియోజకవర్గంలో ఎలాగైనా గెలిచి తీరాలని వైసీపీ పావులు కదుపుతోంది. గత ఎన్నికల్లో నర్సింహరాజు పోటీచేయగా.. ఈసారి కూడా ఆయనే పోటీకి దిగే అవకాశాలు ఉన్నాయ్. జనసేన నుంచి ఇంచార్జిగా జుత్తిగ నాగరాజు ఇంచార్జిగా ఉన్నారు. ఐతే ఉండిలో టీడీపీని ఢీకొట్టడం అంత ఈజీ వ్యవహారం కాదు. ఐతే వైసీపీ మాత్రం ప్రయత్నాలు ఆపడం లేదు. సైకిల్ జోరుకు బ్రేకులు వేసేందుకు వ్యూహాలు రచిస్తోంది.

karumuri srinivas
తణుకు వైసీపీలో వర్గవిభేదాల టెన్షన్… బలమైన కేడర్ కలిగిన సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
తణుకులో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో తన మార్క్ చూపించిన కారుమూరి.. బలమైన కేడర్‌ను సంపాదించుకున్నారు. ఐతే నియోజకవర్గంలో వర్గవిభేదాలు వైసీపీని కాస్త టెన్షన్ పెడుతున్నాయ్. 2024 బరిలోనూ కారుమూరి నిలవడం ఖాయం. టీడీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన అరిమిల్లి రాధాకృష్ణ.. వైసీపీకి గట్టి పోటీ ఇచ్చారు. ఈసారి కూడా ఆయన టికెట్ ఆశిస్తున్నారు. ఇక జనసేన నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన వెంకటరామారావుతో పాటు.. విడివాడ రామచంద్రరావు టికెట్ ఆశిస్తున్నారు. టీడీపీ, జనసేన కలిస్తే.. ఇక్కడ వైసీపీకి ఎదురుదెబ్బ ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ, జనసేన మధ్య ఓట్లు చీలడం.. 2019లో కారుమూరికి కలిసి వచ్చింది. కేవలం 2వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు.అలాంటిది ఇప్పుడు జనసేన, టీడీపీ పొత్తును ఎదుర్కోవడం వైసీపీకి సవాలే ! ఐతే సంక్షేమమే తమను మళ్లీ గెలిపిస్తుందని.. కారుమూరి ధీమాగా ఉన్నారు.
READ ALSO : Guntur Lok Sabha Constituency : ఆంధ్రా రాజకీయాలకు సెంటర్ పాయింట్…గుంటూరు రాజకీయం మిర్చి కన్నా ఘాటు గురూ…

prasadaraju
నరసాపురం అసెంబ్లీ అభ్యర్ధుల గెలుపును నిర్ణయించనున్న కాపు సామాజికవర్గం ఓటర్లు….సిట్టింగ్ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్‌రాజుపై ప్రజల్లో అసంతృప్తి
నరసాపురం అసెంబ్లీలో ముదునూరి ప్రసాద్‌రాజు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. స్థానికుడు కాకపోయినా.. గత ఎన్నికల్లో ప్రసాద్‌రాజు ఇక్కడి నుంచి విజయం సాధించారు. అందుబాటులో ఉండే నేతగా ఆయనకు మంచి పేరు ఉన్నా.. హామీలను నెరవేర్చలేకపోయారనే అసంతృప్తి జనాల్లో కనిపిస్తోంది. ఇది ఇక్కడ వైసీపీకి మైనస్ అయ్యే అవకాశం ఉంది. 2019 ఎన్నికల్లో జనసేన ఇక్కడ రెండోస్థానంలో నిలిచింది. ఇక్కడ కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువ ! జనసేన ఇంచార్జిగా ఉన్న బొమ్మిడి నాయకర్.. మరోసారి పోటీలో నిలిచేందుకు సిద్ధం అవుతున్నారు. ఐతే గ్లాస్ పార్టీని గ్రూప్ తగాదాలు టెన్షన్ పెడుతున్నాయ్. టీడీపీ నుంచి పొత్తూరి రామరాజుతో పాటు.. ఎన్ఆర్ఐ కొవ్వాలి యతిరాజ రామ్మోహన్ నాయుడు టికెట్ ఆశిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బండారి మాధవనాయుడు కూడా టికెట్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీతో పొత్తు కుదిరితే.. ఈ స్థానాన్ని జనసేన కోరే అవకాశాలు కనిపిస్తున్నాయ్. ఈ రెండు పార్టీలు కలిసి బరిలోకి దిగితే.. వైసీపీకి గట్టి పోటీ ఎదురుకావడం ఖాయంగా కనిపిస్తోంది.

kottu satyanarayana
తాడేపల్లిగూడెంలో మంత్రి కొట్టు సత్యనారాయణ పై వ్యతిరేకత….బలం పుంజుకుంటున్న జనసేన, టిడిపి
తాడేపల్లిగూడెంలో మంత్రి కొట్టు సత్యనారాయణ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాపు సామాజికవర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఇదీ ఒకటి. మంత్రి కొట్టు సత్యనారాయణపై ఆరోపణలు వినిపిస్తున్న వేళ.. ఫ్యాన్ పార్టీ గ్రాఫ్ తగ్గుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయ్. 2024లోనూ ఆయనే మళ్లీ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తున్నా.. ఈసారి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయ్. టీడీపీ, జనసేన క్రమంగా బలం పుంజుకుంటున్నాయ్. టీడీపీతో పొత్తు ఖరారు అయితే.. జనసేన కచ్చితంగా కోరుకునే స్థానంలో తాడేపల్లిగూడెం ఒకటి ! ఇక్కడ జనసేన నుంచి బొల్లిశెట్టి శ్రీనివాస్ టికెట్ ఆశిస్తుండగా.. టీడీపీ నుంచి వలవల బాబ్జి రేసులో నిలిచేందుకు సిద్ధం అవుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన వేర్వేరుగా పోటీ చేయడం.. కొట్టు సత్యనారాయణకు కలిసి వచ్చింది. ఐతే ఈసారి ఆ రెండు పార్టీలు కలిస్తే మాత్రం… వైసీపీకి గట్టి పోటీ ఖాయంగా కనిపిస్తోంది.

Sri Ranganadha Raju
ఆచంట లో వైసీపీ నుంచి తిరిగి బరిలో శ్రీరంగనాథ రాజు…టీడీపీ నుంచి పితాని సత్యనారాయణ బరిలోకి దిగే చాన్స్
ఆచంట నియోజకవర్గంలో మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సీనియర్ నేత పితాని సత్యనారాయణపై గత ఎన్నికల్లో రంగనాథరాజు విజయం సాధించారు. జనాలకు అందుబాటులో ఉంటున్నా.. నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి జరగకపోవడం.. ఎమ్మెల్యేపై వ్యతిరేకత వచ్చేలా చేస్తోంది. గతంతో పోలిస్తే ఆచంటలో టీడీపీ బలం పుంజుకుంది. వైసీపీ నుంచి శ్రీరంగనాథరాజు మళ్లీ బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తుండగా.. టీడీపీ నుంచి పితాని పోటీ నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయ్. జనసేన నుంచి చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. టీడీపీతో పొత్తు కుదిరితే.. ఆచంటను జనసేన డిమాండ్ చేసే అవకాశాలు ఉంటాయ్. ఇక్కడ కాపు సామాజికవర్గ ఓటర్లు ఎక్కువ. ఎలాగైనా ఆచంటను గెలుచుకోవాలని గ్లాస్ పార్టీ కసితో ఉంది. టీడీపీ, జనసేన కలిస్తే వైసీపీకి కష్టమే !
నరసాపురం పార్లమెంట్ బరిలో.. ఏ పార్టీ నుంచి ఎవరు నిలుస్తారన్న దానిపై క్లారిటీ లేకపోయినా.. అసెంబ్లీ సెగ్మెంట్ ఫైట్ మాత్రం ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయ్. టీడీపీకి కంచుకోటలాంటి పార్లమెంట్ పరిధిలో బీజేపీ, జనసేన కూడా బలంగానే ఉన్నాయ్. జనసేన ఎవరితో పొత్తు ఉంటుందన్న దాని మీద.. నరసాపురంలో ఫలితాలు ఆధారపడే అవకాశాలు ఉంటాయ్. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే ఎదుర్కోవడం వైసీపీకి కష్టంగా మారే అవకాశం ఉంటుంది. జనసేన, బీజేపీతో కలిసి పోటీ చేసినా.. సింగిల్‌గా పోటీ చేసినా.. అది వైసీపీకి ప్లస్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో రాజకీయంలో ఎలాంటి పొత్తులు కనిపిస్తాయ్. ఎలాంటి ఎత్తులు చూస్తామన్న ఆసక్తి కనిపిస్తోంది. టీడీపీ, జనసేన విడిగా పోటీ చేయడం.. గత ఎన్నికల్లో వైసీపీకి నియోజకవర్గాల్లో కలిసి వచ్చింది. ఐదు విజయాలు అందుకునేలా చేసింది. మరి ఇప్పుడు పవన్, చంద్రబాబు నిర్ణయాలు ఎలా ఉంటాయన్న దాని మీదే.. 2024 ఫైట్ ఆధారపడి ఉంటుంది.