Nellore Rural Constituency: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇలాఖాలో వైసీపీ తడాఖా చూపుతుందా?

కోటంరెడ్డికి.. తెలుగుదేశం నేతలు సహకరిస్తారా? వైసీపీ నుంచి టికెట్ రేసులో ఉన్న లీడర్ ఎవరు? ఓవరాల్‌గా.. నెల్లూరు రూరల్‌లో ఈసారి కనిపించబోయే సీనేంటి?

Nellore Rural Constituency: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇలాఖాలో వైసీపీ తడాఖా చూపుతుందా?

Nellore Rural Assembly constituency : సాధారణంగా ప్రతి జిల్లాలో ఒకటో.. రెండో.. హాట్ సీట్లు ఉంటాయ్. అలాంటి వాటిలో.. కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు మాత్రమే.. స్టేట్ మొత్తం హాట్ టాపిక్‌‌ (hot topic)గా మారుతుంటాయ్. అలాంటిదే.. నెల్లూరు రూరల్ కూడా. ఇక్కడ రాజకీయం ఎలా మారిందో.. ఇప్పుడెలా సాగుతుందో.. ఏపీ మొత్తం గమనిస్తూనే ఉంది. మరి.. వైసీపీ (YCP)కి దూరంగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇలాఖాలో.. రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీ తడాఖా చూపుతుందా? కోటంరెడ్డికి.. తెలుగుదేశం నేతలు (Telugu Desam) సహకరిస్తారా? వైసీపీ నుంచి టికెట్ రేసులో ఉన్న లీడర్ ఎవరు? ఓవరాల్‌గా.. నెల్లూరు రూరల్‌లో ఈసారి కనిపించబోయే సీనేంటి?

ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒకరకమైన రాజకీయం కనిపిస్తే.. నెల్లూరు జిల్లా పాలిటిక్స్ మరో రకంగా ఉంటాయ్. ఇక్కడ.. ఏ ఎన్నికలు జరిగినా ఆసక్తికరంగానే ఉంటాయ్. ఒకప్పుడు.. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న నెల్లూరు.. ఇప్పుడు వైసీపీకి అడ్డాగా మారిపోయింది. గత ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. అయితే.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం నెల్లూరు రూరల్‌లో.. నెక్ టు నెక్ ఫైట్ తప్పేలా లేదు. మాస్ లీడర్, సిట్టింగ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy)తో పాటు ఆర్థికంగా బలమైన నాయకులకు మధ్య పోటీ ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీకి దూరంగా ఉన్న కోటంరెడ్డికి.. నెల్లూరు ఎంపీ, రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి (Adala Prabhakar Reddy) మధ్యే ఆసక్తికర పోరు జరగబోతోందనే టాక్ మొదలైపోయింది. కొంతకాలంగా.. ఎమ్మెల్యే కోటంరెడ్డి.. వైసీపీ సర్కారును ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. మరోవైపు.. వివాదాస్పద రాజకీయాలకు దూరంగా ఉండే ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి.. వచ్చే ఎన్నిక్లలో ఎలాగైనా గెలవాలని.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దాంతో.. నెల్లూరు రూరల్‌లో ఈసారి పోటీ ఓ రేంజ్‌లో ఉండటం ఖాయమనే చర్చ జరుగుతోంది.

2009లో ఏర్పడిన నెల్లూరు రూరల్ నియోజకవర్గం.. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ సెగ్మెంట్ పరిధిలో.. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని 26 డివిజన్లు, 18 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మొత్తం.. 2 లక్షల 54 వేల మందికిపైనే ఓటర్లు ఉన్నారు. ఇప్పటివరకు మూడు సార్లు ఎన్నికలు జరిగాయి. 2009 ఎన్నికల్లో.. దివంగత నేత ఆనం వివేకానందరెడ్డి.. కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. ఇక.. గత రెండు ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి.. వరుసగా గెలుస్తూ వస్తున్నారు. మరోసారి బరిలో దిగి.. హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. అయితే.. వైసీపీ తరఫున గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి.. ఇప్పుడు ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో.. ఆయన తెలుగుదేశం నుంచి పోటీ చేయడం ఖాయమంటున్నారు. అందువల్ల.. నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో జనంలోనే ఉంటున్నారు. ఆయనకు.. సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి (Kotam Reddy Giridhar Reddy) కూడా అండగా ఉండటం.. మరింత కలిసొచ్చే విషయంగా చెబుతున్నారు. మాస్ లీడర్‌ ఇమేజ్ సంపాదించుకున్న కోటంరెడ్డి.. ఏ పార్టీ తరఫున బరిలో దిగినా.. గెలవడం పక్కా అనేంత స్థాయికి వెళ్లిపోయారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో.. అనుమానం ఉన్న చోట తాను ఉండలేనని.. వైసీపీ దూరంగా జరిగారు కోటంరెడ్డి. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని.. వైసీపీ కూడా ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి ఆయన.. నియోజకవర్గ సమస్యలపై అధికార పార్టీని నిలదీస్తూ వస్తున్నారు. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ.. అధికార వైసీపీకి తలనొప్పిగా మారారు.

Kotamreddy Sridhar Reddy

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Photo: Facebook)

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. త్వరలోనే తెలుగుదేశంలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి.. టీడీపీ అభ్యర్థిగానే పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ్. ఇప్పటికే ఆయన చంద్రబాబుని, లోకేశ్‌ని కలిసినట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. ఈ మధ్యకాలంలో చంద్రబాబు, టీడీపీకి అనుకూలంగా కోటంరెడ్డి మాట్లాడిన సందర్భాలూ ఉన్నాయ్. అయితే.. కొన్ని నెలల ముందు వరకు.. తెలుగుదేశం పార్టీలోకి శ్రీధర్ రెడ్డి వద్దని వ్యతిరేకించిన పసుపు పార్టీ నేతలంతా.. ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. వీళ్లంతా.. గతంలో ఎమ్మెల్యే కోటంరెడ్డిపై అనేక అవినీతి ఆరోపణలు చేసిన వాళ్లే. అయితే.. కోటంరెడ్డి టీడీపీలో చేరి ఎన్నికల్లో పోటీ చేస్తే.. లోకల్ టీడీపీ నాయకులు సహకరిస్తారా? లేదా? అన్నదే.. ఇప్పుడు బిగ్ క్వశ్చన్.

shaik abdul aziz

అబ్దుల్ అజీజ్ (Photo: Facebook)

మరోవైపు.. నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న అబ్దుల్ అజీజ్ కూడా రూరల్ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. నాలుగేళ్లుగా.. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ.. అనేకసార్లు ఎమ్మెల్యే కోటంరెడ్డిపై అవినీతి ఆరోపణలు చేశారు. పరోక్షంగా కోటంరెడ్డి రాకను వ్యతిరేకిస్తున్నారు. పార్టీ ఆదేశిస్తే పోటీ చేసేందుకు తాను సిద్ధమని.. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా.. రూరల్ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని చెబుతున్నారు అబ్దుల్ అజీజ్.

Adala Prabhakar Reddy

ఆదాల ప్రభాకర్ రెడ్డి (Photo: Facebook)

వైసీపీ విషయానికొస్తే.. ఎమ్మెల్యే కోటంరెడ్డి సస్పెన్షన్ తర్వాత రూరల్ సెగ్మెంట్ ఇంచార్జ్‌గా నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమించారు. రాబోయే ఎన్నికల్లో.. వైసీపీ నుంచి ఆయనే పోటీ చేస్తారని.. పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. అయితే.. ఆదాలకు ఇష్టం లేకపోయినా.. ఇంచార్జ్‌గా కొనసాగుతున్నారనే ప్రచారం సాగుతోంది. అందువల్ల.. ఆదాల ఇక్కడి నుంచే పోటీ చేస్తారా? లేదా? అనే దానిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయ్. ఎందుకంటే.. ప్రభాకర్ రెడ్డి కూడా తెలుగుదేశంలోకే వెళతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పైగా.. గత ఎన్నికల సమయంలో.. ఆదాల టీడీపీ అభ్యర్థిగా టికెట్ తెచ్చుకొని.. ప్రచారం చేస్తూ.. సడన్‌గా పసుపు జెండాని పక్కనబెట్టి.. వైసీపీలో చేరారు. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీటవుతుందేమోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

Also Read: పెద్దాపురంలో డిఫరెంట్ పాలిటిక్స్.. ఎమ్మెల్యేగా పోటీ చేయకపోయినా అధికారం దక్కింది!

ఈ అనుమానాలను, విమర్శలను కొట్టిపారేస్తూ.. గడప గడపకు ప్రభుత్వం ప్రోగ్రాంలో.. తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతారున్నారు ఆదాల ప్రభాకర్ రెడ్డి. వైసీపీ పాలన, సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో.. రూరల్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని.. గెలిచి.. ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని చెబుతున్నారు. అలాగే.. ఎమ్మెల్యే కోటంరెడ్డిపై అవినీతి ఆరోపణలు కూడా చేస్తున్నారు. మరోవైపు.. ఆదాల ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం కన్నా.. కావలి నుంచి పోటీ చేయాలనే ఆసక్తిగా ఎక్కువగా ఉందనే ప్రచారం కూడా సాగుతోంది.

Malem Sudheer Kumar Reddy

వైఎస్ జగన్ తో మాలెం సుధీర్ కుమార్ రెడ్డి (Photo: Facebook)

ఇక.. జిల్లా యూత్ ప్రెసిడెంట్ మాలెం సుధీర్ కుమార్ రెడ్డి (Malem Sudheer Kumar Reddy) పేరు కూడా వైసీపీ అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. సౌమ్యుడు, వివాదరహితుడిగా ఆయనకు పేరుంది. సీఎం జగన్ పార్టీ పెట్టక ముందు నుంచే.. ఆయన వెంట ఉన్నారు సుధీర్. ఓదార్పు యాత్రలోనూ.. జగన్ వెంటే ఉన్నారు. ఆయన బలమంతా.. నెల్లూరులో వేల మందితో కూడిన ఏసీ సుబ్బారెడ్డి కూరగాయ మార్కెటే. అంతేకాదు.. కార్మికులు, రైతులతోనూ మంచి సంబంధాలున్నాయ్.

Anam Vijaykumar Reddy

ఆనం విజయ్ కుమార్ రెడ్డి (Photo: Facebook)

అటు.. ఆనం విజయ్ కుమార్ రెడ్డి (Anam Vijaykumar Reddy) కూడా వైసీపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. రూరల్ నియోజకవర్గంలో.. ఆనం ఫ్యామిలీకి కూడా మంచి పట్టుంది. విజయ్ కుమార్ రెడ్డిపై సీఎం జగన్‌కు కూడా మంచి అభిప్రాయమే ఉంది. గతంలో.. ఆయనకు డీసీసీబీ ఛైర్మన్ పదవి ఇచ్చారు. ఆయన సతీమణి అరుణ జడ్పీ ఛైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. ముందు నుంచీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, ఆనం విజయ్ కుమార్ రెడ్డి మధ్య విభేదాలున్నాయి. వైసీపీ తరఫున ఆశాహవులు ఎక్కువే ఉన్నా.. శ్రీధర్ రెడ్డి, ఆదాల మధ్య మాత్రమే పోటీ ఓ రేంజ్‌లో ఉండబోతుందనే చర్చ ఎక్కువగా సాగుతోంది. ఇలాంటి రాజకీయ పరిస్థితుల మధ్య.. రాబోయే ఎన్నికల్లో రూరల్ నియోజకవర్గంలో ఎలాంటి పొలిటికల్ సీన్ కనిపించబోతుందన్నది.. ఆసక్తిగా మారింది.