Peddapuram Constituency: పెద్దాపురంలో డిఫరెంట్ పాలిటిక్స్.. ఎమ్మెల్యేగా పోటీ చేయకపోయినా అధికారం దక్కింది!

ఎమ్మెల్యేగా గెలిచినా.. అధికారం చెలాయించలేని స్థితిలో ఒకరుంటే.. ఎన్నికల్లో పోటీ చేయకుండానే అధికారాన్ని అనుభవిస్తున్నది మరొకరు. ఆశావహులకు చెక్ పెట్టేందుకు.. వచ్చే ఎన్నికల్లో టికెట్ తమకేనని.. ఏకంగా అధినేతలతోనే ప్రకటించుకున్నారు.

Peddapuram Constituency: పెద్దాపురంలో డిఫరెంట్ పాలిటిక్స్.. ఎమ్మెల్యేగా పోటీ చేయకపోయినా అధికారం దక్కింది!

Peddapuram Assembly Constituency: ఒక్కో ప్రాంతానికి ఒక్కో పేరు ఉన్నట్లే.. ఒక్కో చోట.. ఒక్కో రకమైన రాజకీయాలు ఉంటాయ్. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో రాజకీయం ఒకలా ఉంటే.. పెద్దాపురంలో మాత్రం చాలా డిఫరెంట్ పాలిటిక్స్ కనిపిస్తున్నాయ్. ఎమ్మెల్యేగా గెలిచినా.. అధికారం చెలాయించలేని స్థితిలో ఒకరుంటే.. ఎన్నికల్లో పోటీ చేయకుండానే అధికారాన్ని అనుభవిస్తున్నది మరొకరు. ఆశావహులకు చెక్ పెట్టేందుకు.. వచ్చే ఎన్నికల్లో టికెట్ తమకేనని.. ఏకంగా అధినేతలతోనే ప్రకటించుకున్నారు. ఇప్పుడు.. గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. మరి.. వాళ్లిద్దరిలో పెద్దాపురం ఓటర్లను ఎవరు ప్రసన్నం చేసుకుంటారు? ఎన్నికల బరిలో నిలిచి.. గెలిచే సత్తా ఎవరికుంది? రాబోయే ఎన్నికల్లో.. పెద్దాపురం సెగ్మెంట్‌లో కనిపించబోయే సీనేంటి?

కాకినాడ జిల్లా(Kakinada District) లో.. ఆధ్యాత్మికంగా, చారిత్రాత్మకంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న నియోజకవర్గం పెద్దాపురం. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గానికి.. 15 సార్లు ఎన్నికలు జరిగాయ్. అప్పట్లో.. పెద్దాపురం, సామర్లకోట (Samarlakota) వేర్వేరు అసెంబ్లీ సెగ్మెంట్లుగా ఉండేవి. 1967లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనతో.. సామర్లకోటని పెద్దాపురంలో విలీనం చేశారు. ఇప్పుడు.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) లోనే రెండు మున్సిపాలిటీలు కలిగిన నియోజకవర్గం పెద్దాపురం ఒక్కటే. ఇక్కడ.. కాంగ్రెస్ ఆరు సార్లు, టీడీపీ ఆరు సార్లు, సీపీఐ రెండు సార్లు, పీఆర్పీ ఒకసారి గెలిచింది. గత ఎన్నికల్లో.. జగన్ వేవ్ బలంగా వీచినా.. పెద్దాపురంలో మాత్రం టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయ చినరాజప్పే (Nimmakayala Chinarajappa) గెలిచారు. అయితే మున్సిపల్ ఎన్నికల నాటికి.. నియోజకవర్గంలో పొలిటికల్ సీన్ మారిపోయింది. వైసీపీ బలం పుంజుకొని.. పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీను కైవసం చేసుకుంది.

ఈ నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 10 వేల మందికి పైనే ఓటర్లు ఉన్నారు. వీరిలో అత్యధికంగా కాపులు 60 వేల పైనే ఉంటారు. అదేవిధంగా.. కమ్మ సామాజికవర్గం ఓటర్లు 25 వేలకు పైనే ఉంటారు. ఈ రెండు సామాజికవర్గాలే.. పెద్దాపురం రాజకీయాల్లో కీలకంగా మారుతుంటాయ్. ఇక్కడ.. అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించేది కూడా కమ్మ, కాపు సామాజికవర్గాలేననే చర్చ ఉంది. పెద్దాపురం నుంచి టీడీపీ తరఫున వరుసగా రెండు సార్లు గెలిచారు నిమ్మకాయల చినరాజప్ప. టీడీపీ ప్రభుత్వ హయాంలో.. హోంమంత్రిగా ఉన్న రాజప్ప.. నియోజకవర్గం అభివృద్ధిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. సుమారు 15 వందల కోట్లతో అభివృద్ధి చేయడంతో.. రాబోయే ఎన్నికల్లోనూ మళ్లీ గెలుస్తారని.. కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ఇక.. టీడీపీ అధికారంలో లేకపోవడంతో.. నియోజకవర్గంలో అభివృద్ధికి అవకాశం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Nimmakayala Chinarajappa

నిమ్మకాయ చినరాజప్ప (Photo: Twitter)

ఇటీవలే.. పెద్దాపురం పర్యటనలో.. చంద్రబాబు బహిరంగంగానే చినరాజప్పకు టికెట్ కన్ఫామ్ చేసేశారు. దాంతో.. కార్యకర్తల్లో మరింత జోష్ పెరిగింది. ఆయన అమలాపురం నుంచి వచ్చినా.. పెద్దాపురంలోనే స్థిరపడిపోయారు. అందరితోనూ కలుపుగోలుగా ఉంటారనే టాక్ ఉంది. ఇక.. పెద్దాపురం టీడీపీలోనూ వర్గపోరు లేకపోలేదు. మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కర రామారావు తనయుడు, గుణ్ణం చంద్రమౌళి వర్గాలు.. కొంత అసంతృప్తితో ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇక.. పెద్దాపురంలో తెలుగుదేశం ఇప్పటివరకు ఆరు సార్లు గెలిచింది. నియోజకవర్గంలో పార్టీకి బలమైన క్యాడర్ ఉండటంతో.. మళ్లీ రాజప్ప గెలిచేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

Thota Vani

తోట వాణి (Photo: Facebook)

గత ఎన్నికల్లో.. వైసీపీ తరఫున మాజీ మంత్రి తోట నరసింహం (Thota Narasimham) సతీమణి.. తోట వాణి పోటీ చేసి.. స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఇక.. పెద్దాపురం టికెట్ ఆశించి భంగపడిన దవులూరి దొరబాబు (Dora Babu Davuluri).. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ అయ్యారు. దొరబాబు రాకతో.. పెద్దాపురం వైసీపీలో కొత్త ఉత్సాహం వచ్చిందనడంలో సందేహమే లేదు. ఇప్పుడు.. పెద్దాపురం వైసీపీ ఇంచార్జ్ కూడా ఆయనే. దాంతో పాటు రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ ఛైర్మన్‌గానూ కొనసాగుతున్నారు. దాంతో.. ఎమ్మెల్యేగా పోటీ చేయకపోయినా.. గెలవకపోయినా.. అధికారం దక్కింది. ఇప్పుడంతా.. జనంలో తిరుగుతూ వైసీపీ సర్కార్ సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ.. వైసీపీ విజయం సాధించడం వెనుక.. దొరబాబు కృషి ఉంది. అయితే.. సీటు విషయంలో జరుగుతున్న ప్రచారాలకు చెక్ పెట్టేందుకు.. ఇటీవలే ఎంపీ మిథున్ రెడ్డితో సీటు ప్రకటించుకున్నారు. దాంతో.. లోకల్ వైసీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది.

Dora Babu Davuluri

దవులూరి దొరబాబు (Photo: Facebook)

మరోవైపు.. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణమైన వాళ్లకు.. దొరబాబు పదవులు ఇవ్వడంతో.. సొంత క్యాడర్‌లోనే వ్యతిరేక వర్గం తయారైందనే టాక్ ఉంది. అంతేకాదు.. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారనే చర్చ కార్యకర్తల్లో జరుగుతోంది. అయితే.. దొరబాబుకి సీటు ఇస్తే ఓడించేందుకు పార్టీలోనే ఓ వర్గం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక.. పెద్దాపురం నుంచి వైసీపీ టికెట్ రేసులో సామర్లకోట జడ్పీటీసీ, అచ్చంపేట నేత వీరంరెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. దాంతో.. వైసీపీ టికెట్ చివరికి ఎవరికిస్తారన్నది.. ఆసక్తిగా మారింది. దొరబాబు తన వ్యతిరేక వర్గంతో పాటు గ్రామ స్థాయి నేతలను కలుపుకుపోవాలనే.. అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Tummala Ramaswamy Babu

తుమ్మల రామస్వామి

గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన తుమ్మల రామస్వామి అలియాస్ బాబు (Tummala Ramaswamy Babu).. ఈసారి కూడా పోటీకి సిద్ధమవుతున్నారు. నియోజకవర్గంలో కాపుల ఓట్ బ్యాంక్ అధికంగా ఉన్నా.. ఆయన వాళ్లను ఆకర్షించడంలో విఫలమయ్యారనే టాక్ ఉంది. పెద్దాపురంలో జనసేన బలంగా ఉన్నప్పటికీ.. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదంటున్నారు. పవన్ కల్యాణ్ ప్రోగ్రాముల్లో పాల్గొనేందుకు మాత్రమే ఆసక్తి చూపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయలేకపోయారనే విమర్శలు కూడా ఉన్నాయి.

Also Read: వేడి పుట్టిస్తున్న రాప్తాడు రాజకీయాలు.. పరిటాల అడ్డా అని రుజువు చేస్తారా?

గత ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, జనసేన విడివిడిగా పోటీ చేస్తే.. తెలుగుదేశం 4 వేల ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించింది. జనసేన అభ్యర్థికి 25 వేల ఓట్లు పడ్డాయి. దాంతో.. రాబోయే ఎన్నికల్లో జనసేన-టీడీపీ గనక కలిసి పోటీ చేస్తే.. మరోసారి టీడీపీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే.. వైసీపీ, టీడీపీ మధ్య నువ్వా-నేనా అనే స్థాయిలో పోరు ఉంటుంది. పెద్దాపురంలో తాను చేసిన అభివృద్ధే గెలిపిస్తుందనే ధీమాలో.. సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఉన్నారు. ఇక.. వైసీపీ సర్కార్ అందిస్తున్న పాలన, సంక్షేమ పథకాలే.. తమకు కలిసొస్తాయని వైసీపీ నాయకులు చెబుతున్నారు. అయితే.. ఏపీలో పొత్తులు కుదిరితే.. పెద్దాపురం రాజకీయం ఏ విధంగా మారబోతోందనేది ఆసక్తి రేపుతోంది. రాబోయే ఎన్నికల్లో.. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారన్నది కూడా ఇంట్రస్టింగ్‌గా మారింది.