అనంతపురం జిల్లాలో కలవరపెడుతున్న క్షుద్రపూజల ఘటన.. యువకుడిని హత్య చేశారా? నరబలి ఇచ్చారా?

అనంతపురం జిల్లాలో కలవరపెడుతున్న క్షుద్రపూజల ఘటన.. యువకుడిని హత్య చేశారా? నరబలి ఇచ్చారా?

Occult worship incident in Anantapur : అనంతపురం జిల్లాలో క్షుద్రపూజల ఘటన కలకలం రేపుతోంది. బొమ్మనహళ్ మండలం ఉంతకల్లు సమీపంలో లభించిన యువకుడి మృతదేహం పోలీసుల అనుమానాలను మరింత బలపరుస్తోంది. కాలువ గట్టుపై యువకుడిని హత్య చేసిన తర్వాత.. గుర్తు పట్టకుండా ముఖంపై బండరాయితో కొట్టి… మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆ తర్వాత కాలువలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. చిత్తూరు జిల్లా మదనపల్లి ఘటన తర్వాత రాష్ట్రంలో క్షుద్రపూజల ఘటనలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి.

కన్నకూతుళ్లను తల్లిదండ్రులు చంపేసిన ఘటన మరవకముందే అలాంటి ఘటనే అనంతపురం జిల్లాలో చేటు చేసుకుంది. బొమ్మనహళ్ మండలం ఉంతకల్లు గ్రామం సమీపంలోని తుంగభద్ర హైలెవల్ కాలువలో స్థానికులు గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించారు. ఐతే కాలువ గట్టుపై దృశ్యాలను చూసి బెంబేలెత్తిపోయారు. ఘటనాస్థలిలో రక్తపు మరకలతో పాటు నిమ్మకాయలు, పూజలు చేసిన ఆకులను గుర్తించారు. దీన్నిబట్టి చూస్తే అక్కడ క్షుద్రపూజలు జరిగినట్లు అనుమానిస్తున్నారు.

అమవాస్య కావడంతో గురువారం తెల్లవారుజామున యువకుడ్ని నరబలి ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు. తొలుత యువకుడ్ని బండరాయితో కొట్టి చంపిన దుండగులు, ఆ తర్వాత మృతదేహానికి నిప్పంటించారు. మృతదేహంపై దుస్తులు కూడా లేకపోవడంతో క్షుద్రపూజల అనుమానాలు బలపడుతున్నాయి. మృతదేహాన్ని గుర్తుపట్టకుండా ముఖంపై బండరాయితో కొట్టి, పెట్రోల్ పోసి తగులబెట్టిన తర్వాత కాలువలో పడేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి నిమ్మకాయలు, ఆకులు, ఇతర పూజా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే కాలువ గట్టుపై పాదాల ముద్రలతో పాటు ఇతర ఆధారాలను సేకరించారు. యువకుడి గురించి ఎలాంటి అనవాళ్లు లేకపోవడం, స్థానికులు గుర్తింలేకపోవడంతో ఈ కేసు పోలీసులకు సవాల్ గా మారింది. దీంతో డాగ్ స్క్వాండ్ ను రంగంలోకి దించారు. అలాగే ఉంతకల్లుతో పాటు బొమ్మనహళ్ మండలంలో క్షుద్రపూజలు, తాయత్తులు కట్టేవారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

మృతుడు యువకుడు కావడం..మృతదేహంపై దుస్తులు లేకపోవడం, అమవాస్య ఘడియలు కావడంతో ఖచ్చితంగా నరబలి జరిగి ఉంటుందన్న అనుమానాలు బలపడుతున్నాయి. అయితే యువకుడిని హత్య చేశారా… లేక నరబలి ఇచ్చారా అనేది స్పష్టం చెప్పలేమని పోలీసులు వెల్లడిస్తున్నారు. మరోవైపు మదనపల్లి జంట హత్యల కేసు ఘటన నేపథ్యంలో పోలీసులు అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అమవాస్య ఘడియల్లో నరబలి ఇస్తే శక్తులు వస్తాయని, నిధులు దొరుకుతాయన్న నమ్మకాలు చాలా మందిలో ఉన్నాయి.