పంచాయతీ ఎన్నికల నామినేషన్లు : కిడ్నాప్ లు, ఉద్రిక్తతలు

పంచాయతీ ఎన్నికల నామినేషన్లు : కిడ్నాప్ లు, ఉద్రిక్తతలు

Panchayat Election Nomination Tensions : ఏపీ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హడావుడి నెలకొంది. తొలివిడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం 2021, జనవరి 31వ తేదీ ఆదివారంతో ముగిసింది. కానీ..అక్కడక్కడ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పోటీ చేస్తున్న వారిని, ఇతరులను కిడ్నాప్ లు చేయడం, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేయడం కలకలం రేపుతున్నాయి.

జగ్గంపేటలో కిడ్నాప్ : –
తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో కిడ్నాప్‌ కలకలం రేపింది. గొల్లలగుంట టీడీపీ సర్పంచ్ అభ్యర్థి భర్త శ్రీనివాస్‌రెడ్డి అపహరించారు దుండగులు. కాళ్లు, చేతులు కట్టేసి.. శ్రీనివాస్‌ను అటవీ ప్రాంతంలో వదిలేశారు. గోవిందపురం అడవుల్లో శ్రీనివాస్‌ను గుర్తించిన పశువుల కాపర్లు.. సమాచారం ఇవ్వడంతో.. శ్రీనివాస్‌ను టీడీపీ కార్యకర్తలు గ్రామానికి తీసుకెళ్లారు. అయితే కక్ష పూరితంగా వైసీపీ నాయకులే కిడ్నాప్ చేయించారని శ్రీనివాస్‌రెడ్డి భార్య ఆరోపిస్తోంది. నామినేషన్‌ వేయకుండా అడ్డుకునేందుకు కిడ్నాప్‌ చేశారని ఆరోపించిన ఆమె.. తిరిగి వచ్చిన తర్వాత భర్తతో కలిసి నామినేషన్ వేసింది.

సిక్కోలు జిల్లాలో : –
మరోవైపు..శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన వైసీపీ సర్పంచ్‌ అభ్యర్థి కింజరపు అప్పన్నను టీడీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకోవడంతో ఘర్షణ మొదలైంది. అప్పన్నకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ దువ్వాడ శ్రీనివాస్‌ కారును టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. శ్రీనివాస్‌ను గ్రామంలోకి రావడానికి వీల్లేందంటూ అడ్డుపడ్డారు. టీడీపీ, వైసీపీ శ్రేణుల ఘర్షణతో.. నిమ్మాడలో హై టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

జగ్గంపేటలో కిడ్నాప్ లు : –

ఇదిలా ఉంటే…అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలో కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్నాడు టీడీపీ మద్దతుదారుడు ఈరన్న. బొమ్మక్కపల్లికి చెందిన సర్పంచ్‌ అభ్యర్థి తిమ్మక్క భర్త ఈరన్నను నిన్న దుండగులు కిడ్నాప్‌ చేశారు. అతడు దేవాలయానికి వెళ్తున్న సమయంలో బంధించారు. ముఖానికి మాస్క్‌ ధరించిన ముగ్గురు దుండగులు తనను కిడ్నాప్‌ చేశారని తెలిపాడు. మత్తు మందు ఇచ్చి రాయపురం సమీపంలోని అడవిలోకి తీసుకెళ్ళి చితక బాదారని ఆవేదన వ్యక్తం చేశాడు. మత్తులో నుంచి మేల్కొన్నాక.. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయకూడదని కత్తులతో బెదిరించారని వాపోయాడు. అయితే కిడ్నాపర్లకు కట్టుకథలు చెప్పి వారి నుంచి తప్పించుకున్నానన్నాడు ఈరన్న.

చిత్తూరు జిల్లాలో : –
మరో ఘటనలో చిత్తూరు జిల్లాలో టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబుకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం కలకలం రేగింది. కారుపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో దొరబాబు కారుతో పాటు..10కి పైగా ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. యాదమర్రి ఎంపీడీవో కార్యాయలయం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.