స్థానిక సంస్థల నోటిఫికేషన్ రద్దు చేయాలన్న పార్టీలు

  • Published By: madhu ,Published On : October 28, 2020 / 01:23 PM IST
స్థానిక సంస్థల నోటిఫికేషన్ రద్దు చేయాలన్న పార్టీలు

AP local bodies : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకే అన్ని పార్టీలు మొగ్గు చూపాయి. గుర్తింపు పొందిన పార్టీలన్నీ తమ అభిప్రాయాన్ని ఎస్‌ఈసీ మీటింగ్‌లో తెలిపాయి. అధికార పార్టీ వైసీపీ తప్ప ఈ మీటింగ్‌కు అన్ని పార్టీ నేతలు హాజరయ్యారు. స్థానిక సంస్థల నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని మెజార్టీ రాజకీయ పార్టీలు ఈసీని కోరాయి.



గతంలో జరిగిన ఏకగ్రీవాలన్నీ రద్దు చేసి ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకటించాలని ఎస్‌ఈసీని కోరామన్నారు బీజేపీ నేత పాకా సత్యనారాయణ. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషనర్‌కు లిఖిత పూర్వకంగా తమ అభిప్రాయాన్ని తెలిపింది సీపీఎం. వివాదాలకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించాలని ఎస్‌ఈసీని కోరామన్నారు వై వెంకటేశ్వరరావు.



ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని లిఖిత పూర్వకంగా తెలియజేసినట్లు చెప్పారు. వివాదాలకు తావులేకుండా ఎన్నికలు నిర్వహించాలని సీపీఐ ఈసీని కోరింది. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ ఎన్నికలు నిర్వహించాలని సూచించింది.



గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి మళ్లీ మొదటి నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషనర్‌ను కోరింది బీఎస్పీ. స్థానిక సమస్యలు పరిష్కారం కావాలంటే ఎన్నికలు నిర్వహించాల్సిందేనన్నారు బీఎస్పీ నేత పుష్పరాజ్‌. కరోనా దృష్ట్యా ప్రజల్లో అవగాహన తెచ్చి ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలన్నారు. కేంద్ర రక్షణ బలగాల సమక్షంలో ఎన్నికలు నిర్వహించాలని ఈసీని కోరామన్నారు.