తిరుమలలో వివాహాలకు అనుమతి.. పిల్లలకు ఎంట్రీ ఎప్పుడంటే?

  • Published By: vamsi ,Published On : November 9, 2020 / 01:04 PM IST
తిరుమలలో వివాహాలకు అనుమతి.. పిల్లలకు ఎంట్రీ ఎప్పుడంటే?

తిరుమల అనగానే కిలోమీటర్ల పొడువుండే క్యూలైన్లు, ఇసుక వేస్తే రాలనంత జనం, దర్శనం కోసం ఎదరుచూసే గంటలే గుర్తొస్తాయి. కానీ ప్రస్తుతం తిరుమలలో అటువంటి పరిస్థితి కనిపించట్లేదు.. కరోనా వైరస్ ప్రభావం తిరుమలలో స్పష్టంగా కనిపిస్తోంది. చిన్న పిల్లలకు వృద్ధులకు అయితే ప్రస్తుతానికి తిరుమలలో ఎంట్రీకి అవకాశం లేదు.



కొండ మీద గోవిందుడి నామస్మరణ కొనసాగుతూనే ఉండగా.. మాడవీధుల్లో భక్తులు పలుచగా కనిపిస్తూ ఉన్నారు. మునుపటి పరిస్థితి అయితే ఇంకా లేదు కానీ, వెంగమాంబ అన్నప్రసాదం, లడ్డు కౌంటర్లు, కళ్యాణకట్ట, కొండపైకి బస్సులు కొన్ని మార్పులు చేర్పులతో నడుస్తున్నాయి.



కోవిడ్-19 ప్రభావంతో దాదాపు 128 యేళ్ల తర్వాత, ఆలయం మూసివేసి, తెరవగా.. భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు తపన పడుతున్నారు. సాధారణ సమయాల్లో నిత్యం దాదాపు 60 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేవారు. అయితే ఇప్పుడు ఐదారు వేల మంది మాత్రమే దర్శించుకుంటూ ఉన్నారు.



మూర్చి నుంచి సుధీర్ఘ లాక్‌డౌన్ తర్వాత గుడిని జూన్ 10వ తేదీ నుంచి తెరిచారు. అయితే కొవిడ్‌ కొత్త మార్గదర్శకాలు వచ్చాకే వయోవృద్ధులు, చిన్నారులకు శ్రీవారి దర్శనం ఉంటుందని తితిదే ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు. తిరుమలలో ఆదివారం ‘డయల్‌ యువర్‌ తితిదే ఈవో’ కార్యక్రమంలో ఆయన భక్తుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.



కొవిడ్‌ కారణంగా టీటీడీ రద్దు చేసిన ఆర్జిత సేవల టికెట్ల రీఫండ్‌ను డిసెంబరు నెలాఖరు లోపు భక్తులు పొందవచ్చని తెలిపారు. 200 మంది లోపు ఆహ్వానితులతో తిరుమలలో వివాహాలు జరిపేందుకు అనుమతులు ఇస్తున్నామన్నారు.