ప్రకాశం జిల్లాలో దారుణం.. ట్రై సైకిల్‌పైనే దివ్యాంగురాలు సజీవ దహనం

ప్రకాశం జిల్లాలో దారుణం.. ట్రై సైకిల్‌పైనే దివ్యాంగురాలు సజీవ దహనం

Physically Challenged burnt alive : ప్రకాశం జిల్లా ఒంగోలు శివారులో దారుణం జరిగింది. దశరాజుపల్లి రోడ్డులోని చిన్నవెంకన్న కుంట దగ్గర… ఉమ్మనేని భువనేశ్వరి అనే 22ఏళ్ల దివ్యాంగురాలు సజీవదహనమైంది. అయితే యువతిది హత్యా.. ఆత్మహత్యా… అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మృతురాలి తల్లిమాత్రం తమ కూతురుని హత్య చేశారని ఆరోపిస్తోంది. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

కమ్మపాలెం మూడో లైన్‌లో భువనేశ్వరి అనే దివ్యాంగురాలు నివాసముంటోంది. ఆమె ఒంగోలు నగరంలోని 12వ వార్డు సచివాలయంలో వలంటీర్‌గా పనిచేస్తోంది. రోజులాగే శుక్రవారం కూడా భువనేశ్వరి సచివాలయానికి వెళ్లింది. సాయంత్రం 6.45 గంటలకు తల్లితో ఫోన్‌లో మాట్లాడింది. ఆ తర్వాత ఇంటికి రాలేదు. భువనేశ్వరి తల్లి జానకి.. రాత్రి 8 గంటల సమయంలో కుమార్తెకు ఫోన్‌ చేయగా స్విచాఫ్‌ అని వచ్చింది. దీంతో ఆమె కూతురి కోసం అన్నిచోట్ల వెతికింది. తెలిసిన వారందరినీ వాకబు చేసింది. అయినా ఆచూకీ మాత్రం లభించలేదు.

దశరాజుపల్లి రోడ్డులోని చినవెంకన్నకుంట దగ్గర మూడు చక్రాల సైకిల్‌పై ఓ యువతి తగులబడుతోందన్న సమాచారం పోలీసులకు అందింది. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకోగా ఆమె మంటల్లో తగలబడుతూ కనిపించింది. వెంటనే ఫైరింజన్‌ను పిలిపించి మంటలను ఆర్పివేశారు. భువనేశ్వరి తల్లికి సమాచారం అందడంతో కన్నీరుమున్నీరయ్యింది. ఘటనా స్థలానికి చేరుకుని సజీవదహనమైన కూతురును చూసి గుండెలవిసేలా రోదించింది. తన కుమార్తె ఎంతో ధైర్యవంతురాలని.. ఆత్మహత్య చేసుకొని ఉండదని పోలీసులకు తెలిపింది. ఎవరో హత్య చేసి ఉంటారన్న అనుమానాన్ని ఆమె వ్యక్తం చేసింది.

కాలిపోతున్న సమయంలో భువనేశ్వరి శరీరం నుంచి ఎలాంటి కదలికలు లేకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. ఎవరైనా ఆమెను ముందే చంపి ఆ తర్వాత పెట్రోల్‌పోసి తగులబెట్టారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో… భువనేశ్వరి తన వాట్సాప్‌లో 6.50 పెట్టిన పోస్ట్‌.. ఆత్మహత్య చేసుకుందా అనుమానాలకు బలం చేకూర్చుతోంది. ఇక తన వాట్సాప్‌ పనిచేయదని.. ఎవ్వరూ చూడవద్దని పోస్ట్‌ చేసింది భువనేశ్వరి. యువతి సజీవ దహనంపై సీఐ రాజేష్‌ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఘటనకు ముందు భువనేశ్వరి పోతురాజు కాలువ గట్టు ఎక్కలేక ఇబ్బందిపడుతున్న సమయంలో.. అక్కడే ఉన్న యువకులు కాలువపైకి వీల్ చైర్‌ని ఎక్కించినట్లు గుర్తించారు. అయితే దశరాజుపల్లికి శివారులోని నిర్మాణుష్య ప్రాంతానికి భువనేశ్వరి ఎందుకు వెళ్లింది?, ఎవరు రప్పించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి కాల్ డేటా ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు.

భువనేశ్వరి చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. తల్లి జానకి తన ఇద్దరు కూతుళ్లను కష్టపడి పెంచింది. బుక్‌ డిపోలో పనిచేస్తూ ఇద్దరు కూతుళ్లను చదివించింది. భువనేశ్వరి అక్క మానసిక వికలాంగురాలు. భువనేశ్వరి దూర విద్య ద్వారా నాగార్జున యూనివర్సిటీలో ఎంబీఏ కూడా చేస్తోంది.