బాలికలతో బాడీ మసాజ్.. టీవీ యాంకర్‌పై కేసు

  • Published By: veegamteam ,Published On : February 28, 2020 / 06:53 PM IST
బాలికలతో బాడీ మసాజ్.. టీవీ యాంకర్‌పై కేసు

ఇద్దరు బాలికలతో వెట్టిచాకిరీతో పాటు బాడీ మసాజ్ చేయించుకుంటున్న ఓ టీవీ యాంకర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లో ఈ ఘటన జరిగింది. శిశు సంక్షేమ కమిటీ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ యాంకర్ కేసు నమోదు చేశారు. బాలికలను కృష్ణా జిల్లా నూజివీడు చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూషన్‌(CCI)విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. ఇటీవల చైల్డ్ కేర్ నుంచి ఇద్దరు బాలికలు మిస్సింగ్ అయినట్టు శిశు సంక్షేమ కమిటీ అధికారులకు ఫిర్యాదు అందింది. దీనిపై వారు దర్యాప్తు చేయగా హైదరాబాద్‌లోని టీవీ యాంకర్ ఇంట్లో బాలికలు ఉన్నట్టు తెలిసింది.

యాంకర్ ఇంట్లో బాలికలు:
శిశు సంక్షేమ కమిటీ తెలిపిన వివరాల ప్రకారం.. నూజివీడులోని చైల్డ్ కేర్‌లో చదువుకుంటున్న ఇద్దరు బాలికల్ని పండుగ సెలవుల పేరుతో తల్లి హైదరాబాద్ తీసుకెళ్లింది. ఓ టీవీ యాంకర్ ఇంట్లో బాలికల్ని పనికి కుదిర్చింది. సెలవులు ముగిసినా.. బాలికలు చైల్డ్‌ కేర్‌కి తిరిగిరాకపోవడంతో సీసీఐ(చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూషన్) అధికారులు మిస్సింగ్ కేసు పెట్టారు. బాలికల మిస్సింగ్‌పై దర్యాప్తు చేయగా.. హైదరాబాద్‌లో టీవీ యాంకర్ ఇంట్లో వెట్టిచాకిరి చేస్తున్నట్టు శిశు సంక్షేమ కమిటీ గుర్తించింది. ఈ క్రమంలోనే ఇద్దరు బాలికల్ని కమిటీ సభ్యులు అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

బాలికలతో వెట్టిచాకిరీ, బాడీ మసాజ్:
ఆ యాంకర్.. ఇంటి పనితో పాటు బాడీ మసాజ్ లాంటి పనులను సైతం వారితో చేయించుకుంటున్నట్లు బాలికలు తెలిపారు. సీడబ్ల్యూఐ సభ్యుల ఫిర్యాదు మేరకు నూజివీడు పోలీసులు ఆ యాంకర్‌పై కేసు నమోదు చేశారు. మైనర్లని పనిలో పెట్టుకోవడం, వెట్టిచాకిరి చేయించుకోవడం చట్టరిత్యా నేరమన్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాలికలతో వెట్టిచాకిరితో పాటు బాడీ మసాజ్ చేయించుకున్న యాంకర్ వ్యవహారం నగరంలో సంచలనంగా మారింది. బాధ్యతగా ఉండాల్సింది పోయి.. ఇలాంటి పనులు చేయడం ఏంటని మండిపడుతున్నారు. ఆ యాంకర్ ను కఠినంగా శిక్షించాలని అధికారులను కోరుతున్నారు.