Prakasam TDP Mlas : న్యాయం చేయండి.. సీఎం జగన్‌కు టీడీపీ ఎమ్మెల్యేల లేఖ

ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు (గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డోలా బాల వీరాంజనేయస్వామి) సీఎం జగన్ కు మరో లేఖ రాశారు.

Prakasam TDP Mlas : న్యాయం చేయండి.. సీఎం జగన్‌కు టీడీపీ ఎమ్మెల్యేల లేఖ

Prakasam Tdp Mlas

Prakasam TDP Mlas : ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు (గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డోలా బాల వీరాంజనేయస్వామి) సీఎం జగన్ కు మరో లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం నిన్న విడుదల చేసిన గెజిట్ లో ప్రకాశం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టుకి అన్యాయం జరిగిందని లేఖలో తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకాశం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టుని గెజిట్ లో “అనుమతులు లేని ప్రాజెక్టుగా చేర్చడంపై టీడీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 2014 నాటి విభజన చట్టం ప్రకారం వెలుగొండ ప్రాజెక్టుని నాడు కేంద్రం ఆమోదించి, అనుమతులు ఉన్న ప్రాజెక్టుగా చూపిందని, నేడు ఇలా అనుమతులు లేవు అని చెప్పడం సరికాదని సీఎం జగన్ కు రాసిన లేఖలో వారు ప్రస్తావించారు. విభజన చట్టంలోని 11వ షెడ్యూల్, 85 (7ఈ) ఆర్టికల్ ప్రకారం నాడు కేంద్రం తెలుగు రాష్ట్రాల్లోని ఆరు (తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలుగొండ, నెట్టెంపాడు, కల్వకుర్తి) సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపిందని.., కానీ నిన్న విడుదల చేసిన గెజిట్ లో కేవలం 5 ప్రాజెక్టులను మాత్రమే 2014 విభజన చట్టం ప్రకారం చూపి వెలుగొండని విస్మరించడంపై ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం తెలిపారు.

కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ లో వెంటనే మార్పులు చేసి.. విభజన చట్టం ప్రకారం వెలుగొండకు ప్రాధాన్యత కలిగేలా చూడాలని.. సీఎం జగన్ ఈ బాధ్యత తీసుకోవాలని లేఖలో ఎమ్మెల్యేలు కోరారు. వెలుగొండ ప్రాజెక్టు భవిష్యత్తు అంధకారమవుతుందని, అటు సాగర్ నీరు రాక, ఇటు వెలుగొండ ఇలాంటి ఆటంకాలు ఉంటే ప్రకాశం జిల్లాలో నీటి ఎద్దడి మరింత తీవ్రమవుతుందంటూ లేఖలో వాపోయారు. ఇప్పటికే రాయలసీమ లిఫ్ట్ పై ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు సీఎం జగన్ కు రాసిన లేఖ కలకలం రేపుతోంది. ఇప్పుడు ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు మరో లేఖాస్త్రం సంధించారు.