ఏపీలో మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు

ఏపీలో మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు

Municipal, ZPTC and MPTC elections in AP : ఏపీలో ఎన్నికల సీజన్ సాగుతోంది. రాష్ట్రంలో వరుసగా ఎన్నికలు జరుగుతున్నాయి. మరోసారి ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ముందుగా మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలు, నగర పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్‌ఈసీ సిద్ధమైంది.

ఈ నెల 22 లేదా 23న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై న్యాయనిపుణులతో సంప్రదించాకే నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల కమిషన్ భావిస్తోంది. ఎన్నికలన్నీ వరుసగా నిర్వహించాలని ప్రభుత్వం కోరగా, పరిశీలిస్తామని నిమ్మగడ్డ చెప్పారు.

ఏపీలో ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసనమండలి స్థానాలకు ఎన్నికల నిర్వహణకు గాను కేంద్ర ఎన్నికల సంఘం 2021, ఫిబ్రవరి 11వ తేదీన షెడ్యూల్ ను ప్రకటించింది. ఈ నెల 16వ తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుందని తెలిపింది. నామినేషన్ దాఖలుకు ఈ నెల 23 వరకు గడువు ఉంటుందని తెలిపింది. ఈ నెల 24వ తేదీన నామినేషన్ల పరిశీలన, 26వ తేదీన నామినేషన్ల విత్ డ్రా ఉండనుంది. మార్చి 14న పోలింగ్ (ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు), మార్చి 17వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుందని వెల్లడించింది.

ఈ నెల 9న ఏపీలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. పార్టీ రహితంగా జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు విజయదుందుభి మోగించారు. టీడీపీ మద్దతుదారుల అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. పంచాయతీ తొలి దశ ఎన్నికల్లో బీజేపీ-జనసేన కూటమి మద్దతుదారులు అంతగా ప్రభావం చూపలేదు. ఈ నెల 13న రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.