ప్రాణం తీసిన పొగ మంచు, ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

ప్రాణం తీసిన పొగ మంచు, ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

road accident at kuppam : చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి సరిహద్దు దగ్గర ఆగి ఉన్న ఆర్టీసీ బస్సుని మారుతీ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ లో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు స్పాట్ లోనే చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని వెంటనే కృష్ణగిరి ఆసుపత్రికి తరలించారు. వారికి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

కాగా, ఈ ప్రమాదానికి పొగ మంచు కారణం అని తెలుస్తోంది. సోమవారం(ఫిబ్రవరి 1,2021) తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. తమిళనాడుకి చెందిన ఆర్టీసీ బస్సు ఆగి ఉంది. మారుతీ ఓమ్నీ వ్యాన్ వెనుక నుంచి ఢీకొట్టింది. స్నేహితుల బృందం బెంగళూరు సమీపంలోని విహార యాత్రకు వ్యాన్ లో వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి కృష్ణగిరికి వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది.

తెల్లవారుజామున రహదారిపై దట్టమైన పొగ మంచు ఉంది. రోడ్డు పై వెళ్తున్న సమయంలో వ్యాన్ కి ఎదురుగా ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తిని వ్యాన్ ఢీకొట్టింది. ఆ తర్వాత అదుపు తప్పి ఆర్టీసీ బస్సుని బలంగా వెనుక నుంచి ఢీకొట్టింది. రోడ్డుపై ఉన్న వ్యక్తితో పాటు వ్యాన్ లో ఉన్న వారిలో ఐదుగురు స్పాట్ లోనే చనిపోయారు. వ్యాన్ లో ఉన్న మరో ముగ్గురుని స్థానికులు, పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో భీతావాహక వాతావరణం ఉంది. రహదారిపై దట్టంగా అలుముకున్న పొగ మంచే ఈ ఘోర ప్రమాదానికి కారణం అని పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. విహార యాత్ర విషాదం మారింది. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.