మంత్రి కొడాలి నానిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశం

మంత్రి కొడాలి నానిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశం

SEC Nimmagadda serious about Kodali Nani : ఏపీ మంత్రి కొడాలి నానికి… మరో షాకిచ్చారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌. కొడాలి నానిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీని ఆదేశించారు. ఐపీసీ సెక్షన్‌ 504, 505(1), (C), 506 కింద కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రి కొడాలి నాని ఎన్నికల కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అధిగమించారని… ఆయనపై కేసు పెట్టాలని కృష్ణా జిల్లా ఎస్పీకి ఆర్డర్స్‌ పాస్‌ చేశారు.

రేషన్ సరుకుల డోర్ డెలివరీ అంశంపై మాట్లాడిన మంత్రి కొడాలి నాని… రాష్ట్రంలో రేషన్ సరుకుల డోర్ డెలివరీని అడ్డుకునేందుకు ఎస్ఈసీ, చంద్రబాబు యత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన గంటలోనే ఎస్ఈసీ నిమ్మగడ్డ షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. కొడాలి చేసిన వ్యాఖ్యలు ఎస్ఈసీని కించపరిచే విధంగా ఉన్నాయని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

ఎస్‌ఈసీ షోకాజ్‌ నోటీస్‌పై మంత్రి కొడాలి నాని స్పందించారు. ఎస్‌ఈసీ తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. కొడాలి నాని వివరణతో సంతృప్తి చెందని నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌… ఆయన ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్లు భావించారు. కొడాలిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని కృష్ణా జిల్లా ఎస్పీని ఆదేశించారు.